...
...
Next Story

Hyundai Bayon : సరికొత్త లుక్​తో హ్యుందాయ్ బేయాన్- లాంచ్​ డేట్ ఇదే..

హ్యుందాయ్ సంస్థ నుంచి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సరికొత్త బేయాన్ ఎస్‌యూవీ అక్టోబర్ 12న ప్రపంచవ్యాప్తంగా అరంగేట్రం చేయనుంది. భారత మార్కెట్‌లోకి కూడా త్వరలోనే రానున్న ఈ మోడల్ కొత్త డిజైన్, అధునాతన ఏఐ సాంకేతికతతో ఆకట్టుకోనుంది. వివరాల్లోకి వెళితే..

Published on: Sep 24, 2026, 16:30:20 IST
Advertisement

గ్లోబల్ మార్కెట్‌తో పాటు భారత ఆటోమొబైల్ రంగాన్ని సైతం ఏలేందుకు ప్రముఖ వాహన తయారీ సంస్థ 'హ్యుందాయ్' మరో సరికొత్త ఎస్‌యూవీతో సిద్ధమైంది. సబ్‌కాంప్యాక్ట్ బీ-ఎస్‌యూవీ విభాగంలో మంచి గుర్తింపు పొందిన ‘హ్యుందాయ్ బేయాన్’ నయా మోడల్‌ను అక్టోబర్ 12న ఫ్రాన్స్‌లో జరగనున్న ప్రతిష్టాత్మక 'ప్యారిస్ మోటార్ షో 2026' వేదికగా ఆవిష్కరించనుంది ఈ దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ. ప్యారిస్ ఎక్స్‌పో పోర్ట్ డీ వెర్సైల్స్‌లో జరిగే ప్రత్యేక విలేకరుల సమావేశంలో హ్యుందాయ్ యూరోప్ ప్రతినిధులు ఈ బేయాన్​ని ప్రపంచానికి పరిచయం చేయనున్నారు.

ఐదేళ్ల ప్రయాణం.. సరికొత్త రూపం

హ్యుందాయ్ బేయాన్ ఎస్​యూవీ..
హ్యుందాయ్ బేయాన్ ఎస్​యూవీ..

హ్యుందాయ్ పోర్ట్‌ఫోలియోలో పాపులర్ హ్యాచ్‌బ్యాక్ 'ఐ20' ప్లాట్‌ఫామ్‌పై వచ్చిన బేయాన్.. ప్రస్తుతం కోనా ఎస్‌యూవీకి దిగువ వర్గంలో కొనసాగుతోంది. మార్కెట్లోకి వచ్చి ఐదేళ్లు పూర్తవుతున్న తరుణంలో, దీని స్థానంలో సరికొత్త ఫేస్‌లిఫ్ట్ రూపంతో పాటు పూర్తిగా మార్చిన ఇంటీరియర్ కేబిన్‌తో హ్యుందాయ్ ఈ కారును తెస్తోంది. ఇకపోతే ఈ యూరోపియన్ వర్షెన్‌తో పాటు భారతీయ మార్కెట్ కోసం కూడా హ్యుందాయ్ ప్రత్యేకంగా బేయాన్‌ను సిద్ధం చేస్తోందనే వార్తలు కార్ ప్రేమికుల్లో ఆసక్తి రేపుతున్నాయి.

భారత్ ఎడిషన్ ప్రత్యేకతలేంటి?

ఇప్పటికే భారత మార్కెట్లో ఈ కారు కోసం బుకింగ్స్ ప్రక్రియ మొదలవగా, అధికారిక లాంచ్‌కు కంపెనీ రంగం సిద్ధం చేస్తోంది. మనదేశంలో రాబోయే వర్షెన్‌ను 'గ్లోబల్ కే ఎన్‌హ్యాన్స్‌డ్ ప్లాట్‌ఫామ్' ఆధారంగా నిర్మిస్తున్నారు. సైజ్ పరంగా ఇది దాదాపు 4.2 మీటర్ల పొడవు కలిగి ఉండి, నిజమైన ఎస్‌యూవీ తరహాలో ఎత్తైన ప్రొఫైల్‌ను కలిగి ఉండనుంది. శక్తివంతమైన పెట్రోల్ ఇంజిన్‌తో పాటు మ్యాన్యువల్, ఆటోమేటిక్ (ఐవీటీ) గేర్‌బాక్స్ ఆప్షన్లలో లభించనుంది.

జనరేటివ్ ఏ వాయిస్ అసిస్టెంట్.. హైటెక్ ఫీచర్లు

కార్ లవర్స్‌ను ఆకట్టుకునేలా హ్యుందాయ్ ఈసారి సరికొత్త టెక్నాలజీని బేయాన్‌ ఎస్​యూవీలో జోడించింది. ఇందులో మొదటిసారిగా 'జనరేటివ్ ఏఐ వాయిస్ అసిస్టెంట్'ను ప్రవేశపెడుతున్నారు. దీని ద్వారా కారుతో మరింత సులువుగా కనెక్ట్ కావచ్చు.

ప్యారిస్ వేదికగా జరిగే ఈ ఈవెంట్‌లో కేవలం బేయాన్ ఆవిష్కరణ మాత్రమే కాకుండా హ్యుందాయ్ తన ఇతర మోడళ్లను కూడా ప్రదర్శించనుంది. యూరోప్ మార్కెట్ కోసం సరికొత్త సీ-సెగ్మెంట్ ఎస్‌యూవీతో పాటు, తమ మొదటి బ్యాటరీ-ఎలక్ట్రిక్ కమర్షియల్ వాహనాన్ని పరిచయం చేయడానికి ప్రణాళికలు రూపొందించింది. ప్రపంచ మార్కెట్ కోసం రూపొందించిన బేయాన్, భారత్ మోడల్ పరస్పరం డిజైన్ పరంగా చాలా వరకు పోలి ఉండే అవకాశముంది.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks