...
...
Next Story

CA Curriculum: సీఏ కోర్సులో భారీ మార్పులు.. సిలబస్‌లోకి ఏఐ!

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) మారుతున్న కాలానికి అనుగుణంగా సీఏ సిలబస్‌ను మార్చాలని నిర్ణయించింది. భవిష్యత్తు చార్టర్డ్ అకౌంటెంట్లను డిజిటల్ యుగానికి సిద్ధం చేసేందుకు కోర్సులో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, డేటా అనలిటిక్స్ వంటి ఆధునిక సబ్జెక్టులను చేర్చబోతోంది.

Published on: May 18, 2026, 05:30:14 IST
Advertisement

దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన చార్టర్డ్ అకౌంటెన్సీ (సీఏ) కోర్సును మరింత ఆధునీకరించేందుకు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) నడుం బిగించింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని పరిశ్రమల్లో సాంకేతికత, డిజిటల్ టూల్స్ వాడకం విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో.. సీఏ కరికులమ్‌ (పాఠ్యప్రణాళిక) లోకి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), డేటా అనలిటిక్స్, ఇతర సరికొత్త సబ్జెక్టులను ప్రవేశపెట్టేందుకు ఐసీఏఐ సిద్ధమైంది.

సీఏ సిలబస్​లో మార్పులు..
సీఏ సిలబస్​లో మార్పులు..

ప్రస్తుతం దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు సీఏ కోర్సును అభ్యసిస్తుండగా.. ఐసీఏఐలో 5 లక్షల కంటే ఎక్కువ మంది సభ్యులు (సీఏలు) ఉన్నారు. పరిశ్రమల తదుపరి తరం అవసరాలకు అనుగుణంగా కాబోయే చార్టర్డ్ అకౌంటెంట్లను తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈ మార్పులు చేపడుతున్నారు.

ఐసీఏఐ ప్రెసిడెంట్ ప్రసన్న కుమార్ డీ ఈ మార్పులపై మాట్లాడుతూ.. ప్రస్తుతం అకౌంటింగ్ రంగంలో టెక్నాలజీ ఒక ముఖ్యమైన భాగమైపోయిందని, అందుకే కాబోయే సీఏలకు ఏఐ, డేటా అనలిటిక్స్ వంటి నైపుణ్యాలు అత్యంత అవసరమని స్పష్టం చేశారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అనేది కేవలం ఇంజనీరింగ్ వంటి సాంకేతిక రంగాలకే పరిమితం కాదని.. ఉద్యోగాలు చేసే వారితో పాటు సొంతంగా ప్రాక్టీస్ పెట్టే చార్టర్డ్ అకౌంటెంట్లకు కూడా రాబోయే రోజుల్లో ఏఐ ఆధారిత టూల్స్, డేటా అనాలిసిస్ పరిజ్ఞానం చాలా అవసరమవుతుందని ఆయన పేర్కొన్నారు.

సిలబస్‌లోకి రాబోయే కొత్త సబ్జెక్టులు ఇవే..

ప్రస్తుతం ఉన్న సీఏ సిలబస్‌లో కింది సబ్జెక్టులకు అధికారికంగా స్థానం లేదు. అయితే అప్డేటెడ్ విద్యా విధానంలో వీటిని విధిగా చేర్చనున్నారు:

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)

ఈఎస్‌జీ (ఎన్విరాన్మెటల్, సోషల్, గవర్నెన్స్)

సస్టైనబిలిటీ

ఫోరెన్సిక్ ఆడిటింగ్

కమిటీ ఏర్పాటు - మార్పుల సమీక్ష..

ఈ విద్యా శిక్షణ విధానాన్ని పరిశీలించి, తగిన మార్పులను సిఫార్సు చేయడం కోసం ఐసీఏఐ ‘కమిటీ ఫర్ రివ్యూ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్’ను ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ప్రస్తుత సిలబస్, ప్రాక్టికల్ ట్రైనింగ్ స్ట్రక్చర్ (ఆర్టికల్‌షిప్), సాఫ్ట్ స్కిల్స్ డెవలప్‌మెంట్, కమ్యూనికేషన్ ట్రైనింగ్, పరీక్షల నిర్వహణ పద్ధతులను సమగ్రంగా సమీక్షించనుంది. అకౌంటింగ్ రంగంలో ప్రస్తుతం ప్రాధాన్యత సంతరించుకున్న నాన్-ఫైనాన్షియల్ రిపోర్టింగ్, ఏఐ ఆధారిత ప్రక్రియలు, డేటా ఆధారిత ఆడిటింగ్ పద్ధతులపై ఈ కమిటీ ప్రధానంగా దృష్టి పెట్టనుంది.

కాగా, ఐసీఏఐ గతంలో 2023లో కొత్త విద్యా శిక్షణ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇప్పుడు ఏర్పడిన సీఆర్ఈటీ కమిటీ డిసెంబర్ నాటికి తన నివేదికను, సిఫార్సులను పూర్తి చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత ఈ ప్రతిపాదనలను ప్రజల అభిప్రాయాలు, చర్చల కోసం పబ్లిక్ డొమైన్‌లో ఉంచనున్నారు. ఈ చారిత్రాత్మక మార్పుల వల్ల సీఏ విద్య ఆధునీకరణ చెందడమే కాకుండా, వేగంగా మారుతున్న ఆర్థిక వాతావరణంలో అంతర్జాతీయ సవాళ్లను ఎదుర్కొనేందుకు విద్యార్థులకు పూర్తి ప్రొఫెషనల్ లభిస్తుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks