AI course : ఈ ఐఐటీలో ఏఐ, రోబోటిక్స్‌పై ఎంటెక్ కోర్సు- గేట్ స్కోర్ లేకుండానే అడ్మిషన్!
Artificial Intelligence course : ఐఐటీ గువాహటి రోబోటిక్స్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌లో కొత్త హైబ్రిడ్ ఎంటెక్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. ఉద్యోగులు, ఫ్రెషర్లు గేట్ స్కోర్ లేకుండానే ఈ కోర్సులో చేరవచ్చు. జులై 15 వరకు దరఖాస్తుకు అవకాశం ఉంది. వివరాల్లోకి వెళితే..
IIT Guwahati MTech admission : సాంకేతిక రంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పులకు అనుగుణంగా ప్రఖ్యాత ఐఐటీ గువాహటి.. సరికొత్త విద్యా కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రోబోటిక్స్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) విభాగాల్లో కొత్తగా ‘హైబ్రిడ్ ఎంటెక్’ కోర్సును ప్రవేశపెట్టింది1 అటు ఫ్రెష్ గ్రాడ్యుయేట్లతో పాటు ఇటు ఇప్పటికే ఉద్యోగం చేస్తున్న ప్రొఫెషనల్స్ కూడా తమ కెరీర్‌ను అప్‌గ్రేడ్ చేసుకునేలా ఈ ప్రోగ్రామ్‌ను రూపొందించారు. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

ఐఐటీ గువాహటిలో ఏఐ కోర్సు- గేట్ స్కోర్ అవసరం లేదు!
సాధారణంగా ఐఐటీల్లో ఎంటెక్ సీటు సాధించాలంటే ‘గేట్’ పరీక్షలో అత్యుత్తమ స్కోర్ సాధించాలి. కానీ, ఈ ప్రత్యేక కోర్సుకు గేట్ స్కోర్ అవసరం లేదని ఐఐటీ గువాహటి స్పష్టం చేసింది. ఇన్స్టిట్యూట్ నిర్వహించే రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగానే అభ్యర్థులను ఎంపిక చేస్తామని వెల్లడించింది.
ఇది పని చేస్తున్న ఉద్యోగులకు, గేట్ రాయలేకపోయిన ప్రతిభావంతులకు గొప్ప అవకాశమని చెప్పవచ్చు.
ఐఐటీ గువాహటిలో ఏఐ కోర్సు- ప్రత్యేకతలు ఇవే..
ఈ కోర్సును ఐఐటీ గువహటిలోని 'స్కూల్ ఆఫ్ ఇంటర్ డిసిప్లినరీ స్టడీస్ అండ్ సస్టైనబిలిటీ' విభాగం నిర్వహిస్తోంది. ఇది హైబ్రిడ్ మోడల్‌లో సాగుతుంది. అంటే తరగతులు ఆన్‌లైన్‌లో జరుగుతాయి, కానీ ప్రయోగశాల శిక్షణ, తుది పరీక్షలు మాత్రం ఐఐటీ గువాహటి క్యాంపస్‌లోనే ఉంటాయని గుర్తుపెట్టుకోవాలి.
ఫ్లెక్సిబిలిటీ: విద్యార్థులు తమ వీలును బట్టి ఈ కోర్సును కనీసం రెండేళ్లలో లేదా గరిష్టంగా ఐదేళ్లలో పూర్తి చేయవచ్చు. తరగతుల రికార్డింగ్స్ కూడా ఎప్పుడైనా చూసుకునే వెసులుబాటు ఉంటుంది.
మల్టిపుల్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్: అభ్యర్థులు చదివే కాలాన్ని బట్టి పీజీ సర్టిఫికేట్, పీజీ డిప్లొమా, మాస్టర్ ఆఫ్ సైన్స్ (ఇంజనీరింగ్) లేదా నేరుగా ఎంటెక్ డిగ్రీని పొందవచ్చు. మధ్యలో కోర్సు ఆపేసినా వారు చదివిన వరకు గుర్తింపు లభిస్తుంది.
ఐఐటీ గువాహటిలో ఏఐ కోర్సు- ఎవరు అర్హులు?
ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, మెకానికల్, సివిల్, ఐటీ లేదా డిజైన్ వంటి విభాగాల్లో నాలుగేళ్ల బ్యాచిలర్ డిగ్రీ ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. కనీసం 60 శాతం మార్కులు లేదా 6.0 సీపీఐ ఉండాలి. అలాగే ఇంటర్మీడియట్ వరకు గణితం ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి.
ఐఐటీ గువాహటిలో ఏఐ కోర్సు- ఉద్యోగ అవకాశాలు..
ప్రస్తుతం హెల్త్‌కేర్, మ్యానుఫ్యాక్చరింగ్, అగ్రికల్చర్, డిఫెన్స్, ట్రాన్స్‌పోర్ట్ రంగాల్లో రోబోటిక్స్, ఏఐ నిపుణులకు భారీ డిమాండ్ ఉందని ఐఐటీ గువాహటి డీన్ ప్రొఫెసర్ హేమంత్ బీ కౌశిక్ తెలిపారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ప్రాక్టికల్ నాలెడ్జ్ అందించడమే ఈ కోర్సు ప్రధాన ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది.
దరఖాస్తుకు చివరి తేదీ: జులై 15, 2026
తరగతుల ప్రారంభం: ఆగస్టు 10, 2026
ఆసక్తి గల అభ్యర్థులు ఐఐటీ గువహటి అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
తరచుగా అడిగే ప్రశ్నలు -
1. ఈ కోర్సులో చేరడానికి గేట్ పరీక్ష స్కోర్ తప్పనిసరా?
సమాధానం: లేదండీ, ఈ ప్రత్యేక హైబ్రిడ్ ఎంటెక్ ప్రోగ్రామ్‌కు గేట్ స్కోర్ అడగడం లేదు. ఐఐటీ గువాహటి సంస్థే స్వయంగా ఒక రాత పరీక్ష, ఇంటర్వ్యూ నిర్వహిస్తుంది. అందులో చూపిన ప్రతిభ ఆధారంగానే విద్యార్థులను ఎంపిక చేస్తారు. దీనివల్ల గేట్ రాయలేకపోయిన అభ్యర్థులు, ప్రస్తుతం వివిధ సంస్థల్లో పనిచేస్తున్న వృత్తి నిపుణులు నేరుగా ఐఐటీలో సీటు సాధించే అవకాశం ఉంటుంది.
2. ఉద్యోగం చేస్తున్న వారు ఈ కోర్సును ఎలా పూర్తి చేయాలి? క్యాంపస్‌కు వెళ్లాల్సి ఉంటుందా?
సమాధానం: ఇది ‘హైబ్రిడ్’ మోడల్ కోర్సు కాబట్టి ఉద్యోగులకు చాలా అనుకూలంగా ఉంటుంది. సిద్ధాంతపరమైన పాఠాలు అన్నీ ఆన్‌లైన్‌లోనే జరుగుతాయి. ఒకవేళ లైవ్ క్లాస్‌కు హాజరు కాలేకపోతే, రికార్డ్ చేసిన లెక్చర్లను మీ వీలును బట్టి ఎప్పుడైనా చూసుకోవచ్చు. అయితే, ప్రాక్టికల్స్, ఫైనల్ ఎగ్జామ్స్ కోసం మాత్రం ఖచ్చితంగా ఐఐటీ గువాహటి క్యాంపస్‌కు వెళ్లాల్సి ఉంటుంది. ఈ కోర్సును రెండేళ్ల నుంచి ఐదేళ్ల కాలపరిమితిలో మీ సౌలభ్యాన్ని బట్టి పూర్తి చేయవచ్చు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


