...
...
Next Story

రీల్స్ పిచ్చి తీసిన ప్రాణం- ఉరి వేసుకుంటున్నట్టు వీడియో తీస్తూ మహిళ మృతి..!

యూపీలో ఓ మహిళ రీల్స్​ కోసం ఒక ఉరి సీన్​ని రీక్రియేట్​ చేసేందుకు ప్రత్నించింది. కానీ అదుపు తప్పి, ఉచ్చులో చిక్కుకుపోయి, ప్రాణాలు కోల్పోయింది! ఆ మహిళకు ఉన్న నాలుగేళ్ల కూతురు.. తల్లిని చూసి గట్టిగా అరవడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

Published on: Feb 7, 2026, 13:15:38 IST
Advertisement

సోషల్ మీడియా వ్యసనం, మరీ ముఖ్యంగా ఇన్​స్టాగ్రామ్​ రీల్స్ మోజు అనేది ఎంత ప్రాణాంతకంగా మారిందో గుర్తుచేసే ఒక దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్‌ బండా జిల్లాకు చెందిన ఒక మహిళ ఉరి వేసుకుంటున్నట్టు వీడియో చిత్రీకరించే క్రమంలో ప్రాణాలు కోల్పోయింది.

అసలేం జరిగింది?

యూపీలో విషాదం!
యూపీలో విషాదం!

27 ఏళ్ల మోహిని అనే మహిళ తన ఇంట్లో రీల్ షూట్ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఈ ఘటన జరిగింది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. మోహిని ఉరి వేసుకుంటున్నట్లుగా ఉండే ఒక దృశ్యాన్ని రీక్రియేట్ చేయడానికి ప్రయత్నించింది. ఆమె తన మెడకు ఉచ్చు వేసుకుని, ఆ దృశ్యాన్ని తన మొబైల్ ఫోన్‌లో చిత్రీకరించడానికి ఒక స్టూల్‌పై నిలబడింది.

కానీ క్షణాల వ్యవధిలోనే పరిస్థితి భయానకంగా మారింది. ఆమె కాలు జారిపోయిందా లేదా బ్యాలెన్స్​ కోల్పోయిందా అనేది స్పష్టంగా తెలియనప్పటికీ, ఆ ఉరి మాత్రం ఆమె పాలిట శాపంగా మారింది. మెడకు ఉచ్చు బిగుసుకోవడంతో కొద్ది సెకన్లలోనే ఆమె మరణించింది.

ఇలా వెలుగులోకి వచ్చిన ఘటన..

మోహినికి నాలుగేళ్ల కుమార్తె ఉంది. ఆ బాలిక గదిలోకి రావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. తన తల్లి ఉరికి వేలాడుతుండటం చూసిన ఆ చిన్నారి భయంతో కేకలు వేసింది. పాప ఏడుపు విని పరిగెత్తుకుంటూ వచ్చిన పొరుగువారు, అక్కడ ఉన్న దృశ్యాన్ని చూసి స్తంభించిపోయారు.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని ఉరి నుండి కిందకు దించి, తమ ఆధీనంలోకి తీసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని అధికారులు తెలిపారు.

కేవలం రీల్ కోసం సృష్టించిన ఒక కృత్రిమ దృశ్యం, వాస్తవ జీవితంలో విషాదంగా మారి ఒక కుటుంబాన్ని తీవ్రంగా కుదిపేసింది.

సోషల్ మీడియా వ్యామోహం, రీల్స్ పిచ్చి ఏ స్థాయికి చేరుతుందో చెప్పడానికి ఈ ఘటన ఒక భయంకరమైన ఉదాహరణ. ప్రాణాలకు తెగించి వీడియోలు తీయడం వల్ల కలిగే ప్రమాదాన్ని ఈ విషాదం గుర్తుచేస్తోంది.

మోహిని మరణంతో ఆ నాలుగేళ్ల చిన్నారి ఇప్పుడు తల్లి లేని బాలికగా మిగిలిపోయింది.

దేశంలో ఈ తరహా ఘటనలు రోజురోజుకు ఆందోళనకర రీతిలో పెరుగుతున్నాయి. కొందరు ట్రైన్​ పట్టాలపై ప్రమాదకరంగా రీల్స్​ చేస్తూ కనిపిస్తుంటే, ఇంకొదరు ప్రాణాలకు తెగించి, భవనాల పైన స్టెప్పులు వేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks