IND vs ENG : ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్ కూడా ఓడిపోయిన భారత్! కనీస పోరాటం చూపించలేకపోతున్న ప్రపంచ ఛాంపియన్..
భారత టీ20 ప్రపంచ విజేతలకు ఇంగ్లండ్ గడ్డపై కోలుకోలేని దెబ్బ తగిలింది. నాలుగో టీ20లో ఇంగ్లండ్ 9 వికెట్ల తేడాతో భారత్‌ను చిత్తు చేసి, మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-0తో కైవసం చేసుకుంది.
టీ20 ప్రపంచకప్ గెలిచిన కేవలం నాలుగు నెలల వ్యవధిలోనే టీమిండియాకు విదేశీ గడ్డపై వరుస పరాజయాలు ఎదురవుతున్నాయి! అహ్మదాబాద్‌లో మార్చి 8న విశ్వవిజేతగా నిలిచిన భారత జట్టు, ఇప్పుడు ఇంగ్లాండ్ పర్యటనలో చేతులెత్తేసింది. గురువారం రాత్రి జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో ఇంగ్లాండ్ జట్టు.. అటు బౌలింగ్లోను, ఇటు బ్యాటింగ్‌లోను సంపూర్ణ ఆధిపత్యం చలాయించి 9 వికెట్ల తేడాతో భారత్‌ను ఘోరంగా ఓడించింది. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను ఇంగ్లాండ్ 3-0తో సొంతం చేసుకుంది. తొలి మ్యాచ్ వర్షం వల్ల రద్దు కాగా.. ఆ తర్వాత ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ భారత్ దారుణంగా ఓడిపోయింది. 2018-19 సీజన్ తర్వాత భారత్ వరుసగా రెండు టీ20 సిరీస్‌లను కోల్పోవడం ఇదే తొలిసారి. దీనికి ముందు ఐర్లాండ్ చేతిలో 0-2తో భారత్ భంగపడిన సంగతి తెలిసిందే.

శ్రేయస్ అయ్యర్ ఒంటరి పోరాటం..
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కు ఇంగ్లాండ్ పిచ్‌లపై ఉండే అదనపు బౌన్స్ పెద్ద శాపంగా మారింది. ఇంగ్లాండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ (2/20) తన లైనప్‌తో భారత టాప్ ఆర్డర్‌ను బెంబేలెత్తించాడు. యువ ఓపెనర్, 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ (15) భారత ఫ్లాట్ పిచ్‌లపై ఆడినట్లు ఇక్కడ కూడా భారీ షాట్లకు ప్రయత్నించి ఆర్చర్ బౌలింగ్‌లోనే క్యాచ్ అవుట్ అయ్యాడు. ఆ వెంటనే ఇషాన్ కిషన్ (4) జోష్ టంగ్ షార్ట్ పిచ్ బంతికి దొరికిపోయాడు. సూపర్ ఫామ్‌లో ఉన్న అభిషేక్ శర్మ (16)ను ఆదిల్ రషీద్ అద్భుతమైన రిటర్న్ క్యాచ్‌తో పెవిలియన్‌కు పంపడంతో భారత్ 48 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.
ఈ దశలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ జట్టును ఆదుకున్నాడు. కానీ.. ల్యాండ్‌మార్క్ 100వ అంతర్జాతీయ టీ20 ఆడుతున్న అక్షర్ పటేల్, వైస్ కెప్టెన్ తిలక్ వర్మ (11), శివం దూబే (22) ఎక్కువసేపు క్రీజులో నిలబడలేకపోయారు. ముఖ్యంగా ఐదో నంబర్‌లో వచ్చిన శివం దూబే ఇంగ్లాండ్ పేస్‌ను తట్టుకోలేక 23 బంతుల్లో 22 పరుగులు మాత్రమే చేసి ఒత్తిడి పెంచాడు.
ఒకవైపు వికెట్లు పడుతున్నా శ్రేయస్ అయ్యర్ మాత్రం కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. 49 బంతుల్లో 5 సిక్సర్లు, 4 ఫోర్లతో అజేయంగా 80 పరుగులు చేశాడు. ముఖ్యంగా 18వ ఓవర్లో ఆదిల్ రషీద్ బౌలింగ్‌లో రెండు సిక్సర్లు, ఒక ఫోర్‌తో 20 పరుగులు రాబట్టి స్కోరు బోర్డును పరిగెత్తించాడు. అయితే చివరి రెండు ఓవర్లలో సామ్ కరన్, ఆర్చర్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 158 పరుగులకే పరిమితమైంది.
ఇంగ్లాండ్ బ్యాటర్ల విధ్వంసం..
159 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్‌కు భారత బౌలర్లు ఎలాంటి పోటీ ఇవ్వలేకపోయారు! ఇన్‌జూరీల కారణంగా వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా దూరమవ్వడంతో బరిలోకి దిగిన ప్రసిద్ధ్ కృష్ణ, ప్రిన్స్ యాదవ్ తీవ్రంగా నిరాశపరిచారు. రెండో ఓవర్లోనే ప్రమాదకరమైన జోస్ బట్లర్‌ను అర్ష్‌దీప్ సింగ్ అవుట్ చేసినప్పటికీ, ఆ తర్వాత ఇంగ్లాండ్ బ్యాటర్లు హ్యారీ బ్రూక్, ఫిల్ సాల్ట్ భారత బౌలింగ్‌ను ముక్కలు ముక్కలు చేశారు.
అర్ష్‌దీప్‌కు వికెట్ దక్కినా కెప్టెన్ అయ్యర్ అతనికి వరుస ఓవర్లు ఇవ్వకపోవడం ఇక్కడ పెద్ద వ్యూహాత్మక తప్పిదంగా మారింది.
యువ బౌలర్ ప్రిన్స్ యాదవ్ వేసిన ఓవర్లో నో-బాల్స్, వైడ్‌లతో పాటు ఫిల్ సాల్ట్ వరుస ఫోర్లు బాదడంతో ఇంగ్లాండ్ పవర్‌ప్లే ముగిసేసరికి 62/1తో పటిష్ట స్థితికి చేరింది. ఆ తర్వాత స్పిన్నర్లు వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్‌లను హ్యారీ బ్రూక్ టార్గెట్ చేశాడు. సుందర్ వేసిన ఓవర్లో వరుసగా 4, 6, 4 బాదిన బ్రూక్.. తన 100వ మ్యాచ్ ఆడుతున్న అక్షర్ పటేల్ బౌలింగ్‌ను సైతం వదలకుండా సిక్సర్లతో విరుచుకుపడి కేవలం 21 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
హ్యారీ బ్రూక్ 35 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లతో అజేయంగా 79 పరుగులు చేయగా, ఫిల్ సాల్ట్ 42 బంతుల్లో 59 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు అజేయంగా సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పి, కేవలం 13.5 ఓవర్లలోనే ఇంగ్లండ్‌ను విజ తీరాలకు చేర్చారు.
అయ్యర్ కెప్టెన్సీపై ఒత్తిడి..
సూర్యకుమార్ యాదవ్ తర్వాత భారత టీ20 జట్టు పగ్గాలు చేపట్టిన శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్‌గా ఇది వరుసగా ఐదో ఓటమి! బౌలింగ్ మార్పుల్లో, ఫీల్డింగ్ సెటప్‌లో అయ్యర్ తీసుకున్న నిర్ణయాలపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ప్రపంచ ఛాంపియన్ హోదాలో ఉండి కనీసం ఒక్క మ్యాచ్‌లోనూ పోరాటం చూపించకుండా టీమిండియా సిరిస్ చేజార్చుకోవడం భారత అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది.
ఇరు జట్ల మధ్య చివరిదైన ఐదో టీ20 మ్యాచ్ శనివారం సౌతాంప్టన్ వేదికగా జరగనుంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


