IND vs NZ live : దంచికొట్టిన రిషభ పంత్- ఆసియాలోనే తొలి కీపర్‌గా రికార్డు! న్యూజిలాండ్​పై భారత్​ పైచేయి..

న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత వికెట్ కీపర్ రిషభ్ పంత్ (128) అద్భుత శతకంతో చెలరేగాడు. ఫలితంగా దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా దేశాలన్నింటిలోనూ టెస్టు సెంచరీ బాదిన తొలి ఆసియా వికెట్ కీపర్‌గా చరిత్ర సృష్టించాడు.

Published on: Nov 22, 2026, 06:03:41 IST
As Prefered on
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

ఆదివారం ఉదయాన్నే భారత క్రికెట్ అభిమానులకు రిషభ్ పంత్ అసలైన విందు భోజనం అందించాడు! వెల్లింగ్టన్‌లోని బేసిన్ రిజర్వ్ మైదానంలో న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు నాలుగో రోజు పంత్ తన బ్యాట్‌తో విధ్వంసం సృష్టించాడు. కేవలం 135 బంతుల్లోనే తన టెస్టు కెరీర్‌లో తొమ్మిదో సెంచరీని పూర్తి చేసుకున్న ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించాడు. దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా (సేనా) దేశాలన్నింటిలోనూ టెస్టు శతకం నమోదు చేసిన మొట్టమొదటి ఆసియా వికెట్ కీపర్‌గా పంత్ అరుదైన ఘనత సాధించాడు.

న్యూజిలాండ్​తో తొలి టెస్టులో చెలరేగిన రిషభ్ పంత్.. (AFP)
న్యూజిలాండ్​తో తొలి టెస్టులో చెలరేగిన రిషభ్ పంత్.. (AFP)

ఆసియా పిచ్‌లపై పరుగుల వరద పారించే బ్యాటర్లు సైతం బౌన్స్, స్వింగ్ ఎక్కువగా ఉండే ‘సేనా’ దేశాల్లో తడబడుతుంటారు. భారత దిగ్గజ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీకి సైతం ఆసియా వెలుపల ఒక్క టెస్టు సెంచరీ కూడా లేదు! అలాంటి కఠినమైన పిచ్‌లపై 29 ఏళ్ల రిషభ్ పంత్ ఏకంగా ఏడు శతకాలు బాదడం విశేషం. తన కెరీర్‌లో సాధించిన మొత్తం తొమ్మిది టెస్టు సెంచరీల్లో ఏడు ఈ నాలుగు దేశాల్లోనే రావడం పంత్ సత్తాకు నిదర్శనం.

గిల్‌క్రిస్ట్, బెయిర్‌స్టో సరసన పంత్.. దిగ్గజాల జాబితాలో చోటు!

ప్రపంచ క్రికెట్ చరిత్రలో సేనా దేశాలన్నింటిలో సెంచరీలు కొట్టిన మూడో వికెట్ కీపర్‌గా పంత్ నిలిచాడు. అతనికంటే ముందు ఆస్ట్రేలియా దిగ్గజం ఆడమ్ గిల్‌క్రిస్ట్, ఇంగ్లాండ్ ఆటగాడు జానీ బెయిర్‌స్టో మాత్రమే ఈ ఫీట్ సాధించారు. వికెట్ కీపర్‌గా అత్యధిక టెస్టు సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో పంత్ (9) ప్రస్తుతం మూడో స్థానానికి చేరుకున్నాడు. ఈ జాబితాలో ఆడమ్ గిల్‌క్రిస్ట్ (17), జింబాబ్వే మాజీ సారథి ఆండీ ఫ్లవర్ (12) మాత్రమే పంత్ కంటే ముందున్నారు.

మరోవైపు వికెట్ కీపర్ అనే నిబంధన లేకుండా మొత్తం ఆసియా బ్యాటర్ల జాబితాను తీసుకున్నా, సేనా దేశాల్లో సెంచరీలు బాదిన తొమ్మిదో ఆటగాడిగా పంత్ నిలిచాడు. మహ్మద్ అజారుద్దీన్, సచిన్ టెండూల్కర్, సయీద్ అన్వర్, రాహుల్ ద్రవిడ్, యూనిస్ ఖాన్, కుమార సంగక్కర, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ వంటి దిగ్గజాల సరసన పంత్ సగర్వంగా చేరాడు.

మెక్‌కల్లమ్ సిక్సర్ల రికార్డు బద్దలు..

పంత్ తన విదేశీ శతకాల ప్రస్థానాన్ని పరిశీలిస్తే, 2018 ఇంగ్లాండ్ పర్యటనలో ఓవల్ మైదానంలో తొలి సెంచరీ సాధించాడు. ఆ తర్వాత 2019 ఆస్ట్రేలియా పర్యటనలో సిడ్నీ వేదికగా 159 పరుగులతో చెలరేగాడు. 2022 జనవరిలో దక్షిణాఫ్రికా గడ్డపై శతకం బాదిన పంత్.. తాజాగా వెల్లింగ్టన్ సెంచరీతో ఆ నాలుగు దేశాల కోటాను పూర్తి చేశాడు.

కాగా నాలుగో రోజు భోజన విరామానికి ముందు రచిన్ రవీంద్ర బౌలింగ్‌లో మరో భారీ సిక్సర్ బాదేందుకు ప్రయత్నించి, బౌండరీ లైన్ వద్ద నాథన్ స్మిత్ చేతికి చిక్కడంతో పంత్ 128 పరుగుల వద్ద వెనుదిరిగాడు.

ఈ ఇన్నింగ్స్‌లో మొత్తం ఆరు సిక్సర్లు బాదిన పంత్, టెస్టు క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాళ్ల జాబితాలో న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ బ్రెండన్ మెక్‌కల్లమ్ (107) రికార్డును అధిగమించాడు! ప్రస్తుతం పంత్ ఖాతాలో 108 టెస్టు సిక్సర్లు ఉన్నాయి. ఈ జాబితాలో ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ బెన్ స్టోక్స్ 138 సిక్సర్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

అక్టోబర్‌లో జరిగిన ఇరానీ కప్ తర్వాత స్వల్ప గాయంతో ఇబ్బంది పడ్డ పంత్, న్యూజిలాండ్-ఏతో జరిగిన అనధికారిక టెస్టులకు దూరమయ్యాడు. గాయం నుంచి కోలుకుని బరిలోకి దిగిన తొలి అంతర్జాతీయ మ్యాచ్‌లోనే ఇలాంటి చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడటం విశేషం.

కివీస్ గడ్డపై భారత్ సరికొత్త చరిత్ర.. టాప్-5 బ్యాటర్ల మెరుపులు!

లంచ్ టీమిండియా 6 వికెట్లు కోల్పోయి 629 పరుగులు సాధించింది. న్యూజిలాండ్​పై ప్రస్తుతం 261 పరుగుల లీడ్​లో ఉంది.

పంత్ విధ్వంసానికి తోడు కేఎల్ రాహుల్ (136), శుభ్‌మన్ గిల్ (98), యశస్వి జైస్వాల్ (85), దేవదత్ పడిక్కల్ (80) రాణించడంతో న్యూజిలాండ్ గడ్డపై భారత్ తన అత్యధిక టెస్టు స్కోరును నమోదు చేసింది. 2009లో హామిల్టన్ టెస్టులో చేసిన 520 పరుగుల పాత రికార్డును టీమిండియా ఈ మ్యాచ్‌లో చెరిపేసింది. విదేశీ గడ్డపై ఒకే ఇన్నింగ్స్‌లో భారత టాప్-5 బ్యాటర్లందరూ 50కి పైగా పరుగులు చేయడం టెస్టు చరిత్రలో ఇదే తొలిసారి కావడం మరో విశేషం.

అంతకుముందు తొలి ఇన్నింగ్స్ బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు హెన్రీ నికోల్స్ (175 నాటౌట్), గ్లెన్ ఫిలిప్స్ (118) శతకాల సాయంతో 368 పరుగులకు ఆలౌటైంది. భారత బ్యాటర్ల సమష్టి ప్రదర్శనతో వెల్లింగ్టన్ టెస్టులో టీమిండియా పూర్తి పట్టు బిగించింది.

ABOUT THE AUTHOR

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.