Index mutual fund లో ఎందుకు ఇన్వెస్ట్​ చేయాలి? ఇది ఎవరికి బెస్ట్​ ఆప్షన్​?

స్టాక్ మార్కెట్​ అంటే రిస్కీ అని చాలా మంది భావిస్తుంటారు. అది నిజమే! కానీ దీర్ఘకాలంలో, తక్కువ రిస్క్​తో మంచి రిటర్నులు పొందాలనుకుంటే.. మ్యూచువల్​ ఫండ్స్​ బెస్ట్​ ఆప్షన్​ అవుతుంది. మరీ ముఖ్యంగా ‘ఇండెక్స్​ మ్యూచువల్​ ఫండ్​’ గురించి మీరు కచ్చితంగా తెలుసుకోవాలి.

Published on: Oct 25, 2025, 07:30:07 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఈ మధ్య కాలంలో ఎవరినైనా ‘ఏం చేస్తున్నావు?’ అని అడిగితే “మ్యూచువల్​ ఫండ్స్​లో ఎస్​ఐపీ చేస్తున్నాను” అనే సమాధానం వస్తోంది! కోవిడ్​ తర్వాత చాలా మంది భారతీయులు స్టాక్​ మార్కెట్​పై ఆసక్తి చూపించడం మొదలుపెట్టారు. ఆ తర్వాత వారి ఫ్యూచర్​ కోసం మ్యూచువల్​ ఫండ్స్​లో ఇన్వెస్ట్​ చేయడం మొదలుపెట్టారు. మరి మీరు కూడా మీ ఇన్వెస్ట్​మెంట్​ జర్నీని ప్రారంభించాలనుకుంటున్నారా? అయితే ఇది మీకోసమే! తక్కువ రిస్క్​తో అద్భుత లాభాలను ఇచ్చే ‘ఇండెక్స్​ మ్యూచువల్​ ఫండ్’ గురించి పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

ఇండెక్స్​ మ్యూచువల్​ ఫండ్​ అంటే ఏంటి?
ఇండెక్స్​ మ్యూచువల్​ ఫండ్​ అంటే ఏంటి?

ఇండెక్స్​ మ్యూచువల్​ ఫండ్​ అంటే ఏంటి?

సెన్సెక్స్​, నిఫ్టీ, బ్యాంక్​ నిఫ్టీ మొదలైన సూచీల్లో ఇన్​వెస్ట్​ చేయడాన్ని ‘ఇండెక్స్​ మ్యూచువల్​ ఫండ్’​ అంటారు. ఉదాహరణకు బ్యాంక్​ నిఫ్టీని తీసుకుందాము. ఇందులో 12 స్టాక్స్​ ఉంటాయి. అవి పెరుగుతూ ఉంటే, బ్యాంక్​ నిఫ్టీ పెరుగుతుంది. అవి పడుతుంటే, బ్యాంక్​ నిఫ్టీ పడుతుంటుంది. బ్యాంక్​ నిఫ్టీకి సంబంధించిన ఇండెక్స్​ మ్యూచువల్​ ఫండ్​ కూడా ఇంతే! ఇందులో బ్యాంక్​ నిఫ్టీకి చెందిన స్టాక్సే ఉండటం వల్ల ఆ సూచీ రిటర్నులకు తగ్గట్టుగానే ఆ మ్యూచువల్​ ఫండ్​లోనూ రాబడి ఉంటుంది.

గమనించాల్సిన ఇంకో విషయం ఏంటంటే.. ఇలాంటి ఇండెక్స్​ మ్యూచువల్​ ఫండ్స్​​ విషయంలో మేనేజర్లు ఎక్కువ కష్టపడాల్సిన పని ఉండదు! ఈ సూచీలను బీఎస్​ఈ, ఎన్​ఎస్​ఈలు నిర్ణయిస్తాయి కాబట్టి, ఒక ఇండెక్స్​ని ఎంచుకుని అందులోని స్టాక్స్​లో ఎప్పటికప్పుడు ఇన్వెస్టర్ల డబ్బులు పెడితే సరిపోతుంది. దీనిని ప్యాసివ్​ మ్యూచువల్​ ఫండ్స్​ అంటారు. అదే యాక్టివ్​ మ్యూచువల్​ ఫండ్స్​లో.. మదుపర్లకు మంచి రిటర్నులు ఇచ్చేందుకు స్టాక్స్​ని ఎప్పటికప్పుడు ఫండ్​ మేనేజర్లు ఎనలైజ్​ చేయాల్సి ఉంటుంది. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవాలి. అంటే, వారు ఎక్కువ పనిచేస్తున్నట్టు!

ఇండెక్స్​ మ్యూచువల్​ ఫండ్​- ఎవరికి​ బెస్ట్ ఆప్షన్​?

ఇటీవలి కాలంలో భారతీయులకు స్టాక్​ మార్కెట్​పై అవాహన పెరుగుతోంది. చాలా మంది మ్యూచువల్​ ఫండ్స్​ ద్వారా సిప్​ చేస్తున్నారు. అయితే.. ఈక్విటీ మార్కెట్​లో కచ్చితంగా ఇన్వెస్ట్​ చేయాలనుకుని, స్టాక్స్​ని ఎనలైజ్​ చేసేందుకు టైమ్​ లేని వారు.. సింపుల్​గా ఇండెక్స్​ మ్యూచువల్​ ఫండ్​ని పిక్​ చేసుకోవచ్చు!

యాక్టివ్​ మ్యూచువల్​ ఫండ్స్​లో అయితే.. ఫండ్​ మేనేజర్ల నిర్ణయాలు ఒక్కోసారి బెడిసికొడుతుంటాయి. అప్పుడు ఇన్వెస్టర్లకూ నష్టాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇండెక్స్​ మ్యూచువల్​ ఫండ్​లో ఫండ్​ మేనేజర్ల పాత్ర పెద్దగా ఉండదు కాబట్టి, అలాంటి భయాలు అవసరం లేదు. అందుకే ఇతర మ్యూచువల్​ ఫండ్స్​తో పోల్చితే.. ఇందులో రిస్క్​ తక్కువ!

ఎక్కువ రిటర్నులు పొందాలనుకుంటే మాత్రం మీకు ఈ తరహా ఫండ్​ సూట్​ అవ్వదు! రిటర్నులు ఎక్కువ ఉండాలంటే, రిస్క్​ ఎక్కువ ఉండాలి.

ఇండెక్స్​ మ్యూచువల్​ ఫండ్​- ఇవి తెలుసుకోండి..

రిస్క్​- రివార్డ్​:- సాధారణంగా.. స్టాక్​ మార్కెట్​ పడిపోతుంటే, ఫండ్​ మేనేజర్లు తమ నిర్ణయాలతో ఇన్వెస్టర్ల డబ్బులను ఇతర స్టాక్స్​లోకి మళ్లించే అవకాశం ఉంటుంది. కానీ ఇండెక్స్​ మ్యూచువల్​ ఫండ్​లో అలాంటి అవకాశాలు ఉండవు.

భారత స్టాక్​ మార్కెట్​లో ఇండెక్స్​ రిటర్నులు హిస్టారికల్లీ.. 12శాతం! అంత రాబడి వస్తే (ఇది బ్యాంక్​ ఎఫ్​డీ సహా ఇతర పెట్టుబడుల కన్నా చాలా ఎక్కువ) చాలు అని అనుకునే వారు ఈ తరహా ఫండ్స్​ని ఎంచుకోవడం ఉత్తమం.

ఎక్స్​పెన్స్​ రేషియో:- ఈ ఎక్స్​పెన్స్​ రేషియో గురించి కచ్చితంగా తెలుసుకోవాలి. మీ ఇన్వెస్ట్​మెంట్స్​ని మేనేజ్​ చేస్తుండటం కారణంగా ఫండ్​ హౌజ్​కు.. (మీకు వచ్చే రిటర్నుల నుంచి) మీరు కొంత మొత్తం ఇవ్వాల్సి ఉంటుంది. అదే ఎక్స్​పెన్స్​ రేషియో! ఇండెక్స్​ మ్యూచువల్​ ఫండ్ విషయంలో అతి పెద్ద లాభదాయకమైన విషయం ఇదే! ఫండ్​ మేనేజర్​ ప్రమేయం తక్కువ కాబట్టి.. ఇండెక్స్​ మ్యూచువల్​ ఫండ్​లో ఎక్స్​పెన్స్​ రేషియో కూడా చాలా అంటే చాలా తక్కువగానే ఉంటుంది.

ట్యాక్స్​ గురించి కూడా ఆలోచించాలి:- ఈక్విటీ ఫండ్​ కావడంతో ఇండెక్స్​ మ్యూచువల్​ ఫండ్​ ద్వారా వచ్చే డబ్బులపై లాంగ్​ టర్మ్​ క్యాపిటల్​ గెయిన్స్​ ట్యాక్స్​పడుతుంది. అదే సమయంలో ఫండ్​ హౌజ్​.. డివిడెండ్లు చెల్లిస్తే.. అందులో 10శాతం డివిడెండ్​ డిస్ట్రిబ్యూషన్​ ట్యాక్స్ (డీడీటీ) కూడా కట్​ అవుతుంది.

గోల్స్​ సెట్​ చేసుకోవాలి- మ్యూచువల్​ ఫండ్స్​ అంటేనే లాంగ్​ టర్మ్​ ఆప్షన్స్​! కనీసం 7 నుంచి 10ఏళ్ల వరకు పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉండాలి. అలాంటి ఇన్​వెస్టర్లకు ఈ ఇండెక్స్​ మ్యూచువల్​ ఫండ్ ఉపయోగపడుతుంది. స్వల్పకాలంలో ఏ రకమైన ఫండ్స్​లోనైనా ఒడిదొడుకులు ఉంటాయి. అందువల్ల దీర్ఘకాలం పెట్టుబడుల కోసమే​ మ్యూచువల్​ ఫండ్​ను ఎంచుకోవాలి.

(గమనిక:- ఇది కేవలం సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా పెట్టుబడి పెట్టేముందు సెబీ రిజిస్టర్డ్​ ఫైనాన్షియల్​ అడ్వైజర్లను సంప్రదించడం శ్రేయస్కరం.)

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More