కష్టాలు-కన్నీళ్లు దాటి! అద్భుతం చేసిన అమ్మాయిలు-దేశమంతా సంబరాలు- టీమిండియాదే ప్రపంచకప్- ఫైనల్లో సౌతాఫ్రికా చిత్తు
భారత కల నెరవేరింది. మహిళల క్రికెట్లో కొన్ని దశాబ్దాలుగా ఊరిస్తూ వస్తున్న ప్రపంచకప్ అందింది. మహిళల వన్డే విశ్వ విజేత ఇప్పుడు టీమిండియా. ఫైనల్లో దక్షిణాఫ్రికాను చిత్తుచేసిన మన అమ్మాయిలు దేశానికి సంబరాలు అందించారు.
కపిల్ దేవ్, ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మ.. ఇప్పుడు హర్మన్‌ప్రీత్ కౌర్. భారత మహిళల క్రికెట్ జట్టు చరిత్రలో తన పేరును లిఖించింది. సుదీర్ఘ కలను సాకారం చేసింది. తొలిసారి మహిళల ప్రపంచకప్ ను ముద్దాడింది. ఆదివారం (నవంబర్ 2) అర్ధరాత్రి ముగిసిన ఫైనల్లో దక్షిణాఫ్రికాపై 52 పరుగుల తేడాతో ఇండియా గెలిచింది.

తొలి ప్రపంచకప్
భారత మహిళల జట్టు అద్భుతం చేసింది. తొలిసారి ఓ ప్రపంచకప్ సొంతం చేసుకుంది. టీ20ల్లో అయినా వన్డేల్లో అయినా ఇండియా వుమెన్స్ టీమ్ కు ఇదే ఫస్ట్ వరల్డ్ కప్. ఈ ఫైనల్ హీరో షఫాలీ వర్మ. బ్యాటింగ్ లో 87 పరుగులు చేయడంతో పాటు, బౌలింగ్ లో రెండు కీలక వికెట్లు పడగొట్టింది. దీంతో ఫైనల్లో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచింది. మొహిందర్ అమర్ నాథ్, ఇర్ఫాన్ పఠాన్, ధోని, విరాట్ కోహ్లి వంటి దిగ్గజాల సరసన చేరింది.
దీప్తి మాయ
నవీ ముంబయిలోని డీవై పాటిల్ స్టేడియంలో ఛేజింగ్ లో స్పిన్ దెబ్బకు సౌతాఫ్రికా కుప్పకూలింది. బ్యాటింగ్ లో హాఫ్ సెంచరీతో మెరిసిన దీప్తి శర్మ, బౌలింగ్ లో అయిదు వికెట్లతో అదరగొట్టింది. షెఫాలి రెండు, శ్రీ చరణి ఒక వికెట్ దక్కించుకుంది. సౌతాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్ట్ (101) సెంచరీతో పోరాడింది. కానీ 299 పరుగుల ఛేజింగ్ లో ఆ టీమ్ 246కే ఆలౌటైంది.
బ్యాటింగ్ అదుర్స్
అంతకుముందు బ్యాటింగ్ లో టీమిండియా అదరగొట్టింది. 50 ఓవర్లలో 7 వికెట్లకు 298 పరుగులు చేసింది. షెఫాలి వర్మ (78 బంతుల్లో 87; 7 ఫోర్లు, 2 సిక్సర్లు), దీప్తి శర్మ (58; 58 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్), మంధాన (45), రిచా ఘోష్ (34) రాణించారు. ఈ ప్రపంచకప్ లో 215 పరుగులు చేయడంతో పాటు 22 వికెట్లు తీసిన దీప్తి శర్మ ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా నిలిచింది.
దేశమంతా సంబరాలు
భారత మహిళల జట్టు తొలిసారి ప్రపంచకప్ సొంతం చేసుకోవడంతో ఆదివారం అర్ధరాత్రి దేశమంతా సంబరాలు మొదలయ్యాయి. 2005, 2017, 2020 లో వరల్డ్ కప్ కు అడుగు దూరంలో ఆగిపోయిన టీమిండియా.. ఈ సారి మాత్రం పట్టు వదల్లేదు. కప్ నూ వదల్లేదు. సొంతగడ్డపై విశ్వవిజేతలుగా నిలిచారు మన అమ్మాయిలు. అసాధారణ పోరాట పటిమతో, అద్భుతమైన ప్రదర్శనతో దేశానికి మహిళల క్రికెట్లో మొట్టమొదటి వరల్డ్ కప్ అందించారు.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


