Financial rules change : మార్చి 2026 నుంచి అమల్లోకి వస్తున్న కీలక ఆర్థిక మార్పులివే..
భారత ఆర్థిక రంగంలో మార్చి 2026 కీలక మార్పులకు వేదిక కానుంది. కేంద్ర బడ్జెట్ 2026-27 ప్రతిపాదనలు, ఆర్బీఐ కొత్త నిబంధనలు నేటి నుంచి అమల్లోకి వస్తున్నాయి. బ్యాంక్ పనివేళలు, ఐటీ రిటర్న్స్ గడువు, స్టాక్ బ్రోకర్ల కాల్స్, ఫాస్టాగ్ రూల్స్‌లో వస్తున్న ఆ మార్పులేంటో ఈ కథనంలో చూద్దాము.
2025-26 ఆర్థిక సంవత్సరం ముగింపు దశకు చేరుకోవడంతో, మార్చి నెలలో అనేక ఆర్థిక, నియంత్రణ మార్పులు అమల్లోకి వస్తున్నాయి. వినియోగదారుల భద్రతను పెంచడం, పన్ను చెల్లింపుదారులకు వెసులుబాటు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయాలు తీసుకుంది. ఆ ముఖ్యాంశాలు ఇవే:

1. మార్చి 31న బ్యాంకులు తెరిచే ఉంటాయి..
సాధారణంగా మార్చి 31వ తేదీన ఇయర్ ఎండ్ అకౌంటింగ్ ఉంటుంది. అయితే, ఈసారి మార్చి 31న 'మహావీర్ జయంతి' ప్రభుత్వ సెలవు దినం అయినప్పటికీ, ప్రభుత్వ లావాదేవీలు నిర్వహించే అన్ని 'ఏజెన్సీ బ్యాంకులు' పనిచేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆదేశించింది. పన్ను వసూళ్లు, ప్రభుత్వ చెల్లింపులు సజావుగా సాగడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు.
2. స్టాక్ బ్రోకర్ల కోసం '1600' సిరీస్..
ఆర్థిక మోసాలకు చెక్ పెట్టేందుకు ట్రాయ్ కీలక గడువు విధించింది. మార్చి 15, 2026 నాటికి అన్ని అర్హత కలిగిన స్టాక్ బ్రోకర్లు (క్యూఎస్బీలు) తమ కాలింగ్ సేవలను '1600' నంబర్ సిరీస్‌కు మార్చుకోవాలి.
గుర్తించడం ఎలా?: ఇకపై మీ బ్రోకర్ నుంచి వచ్చే అధికారిక కాల్స్ 1600 తో మొదలవుతాయి.
జాగ్రత్త: ఒకవేళ సాధారణ 10 అంకెల మొబైల్ నంబర్ నుంచి బ్రోకర్ పేరుతో కాల్ వస్తే అది 'స్కామ్' అయ్యే అవకాశం ఉందని గుర్తించాలి.
- మార్చి 2026కి సంబంధించిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ బ్యాంకు సెలవుల లిస్ట్‌ని తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
3. ఐటీ రిటర్న్స్ (ఐటీఆర్) సవరణకు భారీ వెసులుబాటు
పన్ను చెల్లింపుదారులకు కేంద్ర బడ్జెట్ 2026-27 ఒక గొప్ప ఉపశమనాన్ని ఇచ్చింది. గతంలో ఆదాయపు పన్ను రిటర్న్స్‌లో తప్పులను సరిదిద్దుకోవడానికి డిసెంబర్ 31 వరకు మాత్రమే గడువు ఉండేది. ఇప్పుడు ఆ గడువును మార్చి 31 వరకు పొడిగించారు. నామమాత్రపు రుసుము చెల్లించి మీ పాత తప్పులను సరిదిద్దుకోవడం ద్వారా పెనాల్టీలు, ఐటీ నోటీసుల నుంచి తప్పించుకోవచ్చు.
4. సులభతరమైన ఫాస్టాగ్ నిబంధనలు
నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) వాహనదారులకు ఊరటనిస్తూ "నో యువర్ వెహికల్" (కేవైసీ) నిబంధనను తొలగించింది.
మార్పు ఏంటి?: పాత ఫాస్టాగ్ ఉన్నవారు ఇకపై ఎటువంటి రొటీన్ వెరిఫికేషన్ చేయించుకోవాల్సిన అవసరం లేదు.
కొత్త సదుపాయం: బజాజ్ ఫిన్‌సర్వ్ వంటి డిజిటల్ వాలెట్ వాడేవారి కోసం మార్చి 3 నుంచి 'ఫాస్టాగ్ సబ్-వాలెట్లు' అందుబాటులోకి వస్తాయి. దీనివల్ల టోల్ ఫీజు కోసం మీ సాధారణ బ్యాలెన్స్ కాకుండా ప్రత్యేకంగా నిధులను కేటాయించుకోవచ్చు.
ఆర్థిక సంవత్సరం ముగింపు కావడంతో మార్చి నెలలో బ్యాంక్ పనుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఏవైనా పెండింగ్ పనులు ఉంటే నెలాఖరు వరకు వేచి చూడకుండా ఇప్పుడే పూర్తి చేసుకోవడం ఉత్తమం.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


