Southwest Monsoon : దశాబ్దంలోనే అత్యల్ప వర్షపాతం- దెబ్బేసిన నైరుతి రుతుపవనాలు.. కరవుతో భారత్ విలవిల!

భారతదేశంలో 2026 నైరుతి రుతుపవనాల సీజన్ తీవ్ర వర్ష లోటుతో ముగిసింది. పసిఫిక్ మహాసముద్రంలో బలంగా మారిన 'ఎల్ నినో' ప్రభావంతో సాధారణం కంటే 12.6 శాతం తక్కువ వర్షపాతం నమోదై, గత దశాబ్దంలోనే దేశం అత్యల్ప వర్షపాతాన్ని నమోదు చేసింది.

Published on: Oct 4, 2026, 12:20:28 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

దేశీయ వ్యవసాయ రంగానికి, నీటి వనరులకు కీలకమైన 2026 నైరుతి రుతుపవనాల సీజన్ తీవ్ర నైరాశ్యంతో ముగిసింది. జూన్ నెలలో ప్రారంభమైన వర్షాభావ సంక్షోభాన్ని జులైలో కురిసిన వర్షాలు కొంతమేర ఉపశమనం కలిగించినప్పటికీ, ఆ తర్వాత ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో మళ్లీ లోటు వర్షపాతం కొనసాగింది. పసిఫిక్ మహాసముద్రంలో వేగంగా బలపడిన ‘ఎల్ నినో’ వాతావరణ మార్పులు ఇందుకు కారణం. ఎల్​ నినో వల్ల దేశవ్యాప్తంగా వర్షాలు గణనీయంగా తగ్గిపోయాయి.

ఎల్​ నినో ఎఫెక్ట్​తో కురవని వర్షాలు..
ఎల్​ నినో ఎఫెక్ట్​తో కురవని వర్షాలు..

భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించిన అధికారిక గణాంకాల ప్రకారం.. జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో దేశంలో సాధారణంగా నమోదు కావాల్సిన 868.6 ఎంఎం వర్షపాతానికి గాను కేవలం 759.4 ఎంఎం మాత్రమే నమోదైంది. అంటే సాధారణ వర్షపాతంలో ఇది కేవలం 87 శాతానికి సమానం. దీనితో 2001 సంవత్సరం తర్వాత దేశంలో నమోదు అత్యల్ప వర్షపాత సంవత్సరాల్లో 2026 నాల్గొవదిగా నిలిచింది. అలాగే 1901 నుంచి చూస్తే ఇది 13వ అత్యల్ప వర్షపాత సంవత్సరం కాగా, 2015 తర్వాత అంటే గత పదేళ్ల కాలంలో నమోదైన అత్యంత దారుణమైన నైరుతి సీజన్‌గా నమోదైంది. మొత్తం మీద సాధారణం కంటే 12.6 శాతం లోటు ఏర్పడటంతో, ఇది ఆల్ ఇండియా కరవు నిబంధనల పరిధిలోకి వచ్చింది.

నెలలవారీగా వర్షపాత గణాంకాల తీరు..

జూన్ నెలలో సాధారణ వర్షపాతం 165.3 ఎంఎం కాగా, కేవలం 106.8 ఎంఎం వర్షం మాత్రమే కురిసింది (65 శాతం). జులై నెల కొంత ఆశలు చిగురింపజేస్తూ 283.3 ఎంఎం (101 శాతం) నమోదై సాధారణ స్థాయిని చేరుకుంది. అయితే ఆ ఉపశమనం ఎక్కువ కాలం నిలవలేదు. ఆగస్టు నెలలో మళ్లీ వర్షాలు ముఖం చాటేసి 213.3 ఎంఎం (84 శాతం) మాత్రమే నమోదయ్యాయి. సెప్టెంబర్‌లో 155.1 ఎంఎం (92 శాతం) వర్షపాతం నమోదైంది. జులైలో వచ్చిన రికవరీ మిగిలిన మూడు నెలల లోటును పూడ్చలేకపోయింది.

ప్రాంతాల వారీగా తీవ్ర వ్యత్యాసాలు..

ఈ రుతుపవనాల ప్రభావం దేశవ్యాప్తంగా ఒకేలా లేదు. వాయవ్య భారతదేశంలో సాధారణంలో 94 శాతం, మధ్య భారతదేశంలో 97 శాతం వర్షపాతం నమోదైంది. కానీ దక్షిణాది ద్వీపకల్పంలో పరిస్థితి దారుణంగా మారి కేవలం 76 శాతం వర్షపాతం నమోదైంది. ఇక తూర్పు, ఈశాన్య భారత ప్రాంతాలు అత్యంత తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇక్కడ కేవలం 74 శాతం వర్షపాతం నమోదైంది.

తూర్పు, ఈశాన్య భారతదేశంలో నమోదైన 1,016.3 ఎంఎం వర్షపాతం 1901 తర్వాత ఆ ప్రాంతంలో నమోదైన అత్యల్ప సీజనల్ వర్షపాతం కావడం గమనార్హం. దక్షిణాది ప్రాంతం 542 ఎంఎం వర్షపాతాన్ని పొంది 1901 తర్వాత నాలుగో అత్యల్ప వర్షపాతాన్ని నమోదు చేసింది. దేశంలోని మొత్తం 36 వాతావరణ సబ్‌డివిజన్లలో 17 డివిజన్లలో లోటు వర్షపాతం నమోదు కాగా, 18 డివిజన్లలో సాధారణ వర్షపాతం నమోదైంది. ఒక్క ఒడిశా రాష్ట్రంలో మాత్రమే సమృద్ధిగా (సాధారణం కంటే ఎక్కువ) వర్షాలు కురిశాయి.

ఎల్ నినో విలయం.. న్యూట్రల్ ఐఓడీ ప్రభావం

భారత రుతుపవనాల వ్యవస్థను దెబ్బతీసిన ప్రధాన అంశం 'ఎల్ నినో'. పసిఫిక్ మహాసముద్రంలోని భూమధ్యరేఖా ప్రాంత ఉపరితల నీరు వేడెక్కడాన్ని ఎల్ నినో అంటారు. జూన్ నెలలోనే బలహీనంగా ప్రారంభమైన ఎల్ నినో పరిస్థితులు, సెప్టెంబర్ ముగిసే సమయానికి అత్యంత శక్తివంతంగా మారాయని ఐఎండీ నివేదించింది.

మరోవైపు, హిందూ మహాసముద్రపు ఉష్ణోగ్రతల వ్యత్యాసాన్ని తెలిపే 'ఇండియన్ ఓషన్ డిపోల్' సీజన్ ముగిసే సమయానికి పాజిటివ్‌గా మారుతుందని అంచనా వేసినప్పటికీ, సీజన్ అంతటా తటస్థంగానే ఉండిపోయింది. సాధారణంగా పాజిటివ్ ఐఓడీ ఏర్పడితే అది హిందూ మహాసముద్రం నుంచి తేమతో కూడిన గాలులను భారత్ వైపు నడిపించి ఎల్ నినో ప్రభావాన్ని కొంతవరకు తగ్గిస్తుంది. కానీ ఈసారి ఐఓడీ తటస్థంగా ఉండటంతో ఎల్ నినో తన తీవ్ర ప్రభావాన్ని చూపించింది.

చరిత్ర ఏం చెబుతోంది?

చారిత్రక గణాంకాలను పరిశీలిస్తే, గతంలోనూ ఎల్ నినో సంవత్సరాల్లో భారత రుతుపవనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. 1972లో సాధారణం కంటే 22.3 శాతం, 2002లో 20.9 శాతం, 2015లో 12.7 శాతం, 2023లో 5.3 శాతం వర్షపాతం లోటు నమోదైంది. 1972, 2015 సంవత్సరాల్లో పాజిటివ్ ఐఓడీ ఉన్నప్పటికీ ఎల్ నినో తీవ్రత వల్ల వర్షాభావం తప్పలేదు. దీన్ని బట్టి పాజిటివ్ ఐఓడీ ఉన్నంత మాత్రాన సాధారణ వర్షపాతం వస్తుందని చెప్పలేమని, ఎల్ నినో ప్రభావం అత్యంత తీవ్రంగా ఉంటుందని స్పష్టమవుతోంది.

ఈ వర్షాభావం రాబోయే రోజుల్లో దేశీయ వ్యవసాయం, తాగునీరు, విద్యుత్ ఉత్పత్తిపై ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More