Import duty on gold : పసిడి ప్రియులకు షాక్! బంగారం, వెండిపై దిగుమతి సుంకాలు పెంపు- ఈరోజు నుంచే అమలు..

Gold import duty hike : దేశంలో బంగారం, వెండి ధరలు మళ్లీ పెరగనున్నాయి! విలువైన లోహాల దిగుమతులను నియంత్రించి, వాణిజ్య లోటును కట్టడి చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకాన్ని భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

Published on: May 13, 2026, 07:25:12 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Gold price today : భారత ఆర్థిక వ్యవస్థపై పెరుగుతున్న ఒత్తిడిని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బంగారం, వెండిపై దిగుమతి సుంకాలను 15 శాతానికి పెంచుతున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. 2024లో బడ్జెట్ సందర్భంగా తగ్గించిన సుంకాలను రద్దు చేస్తూ, మళ్లీ పాత పన్ను విధానాన్ని పునరుద్ధరించింది. మే 13, 2026 నుంచే ఇవి అమల్లోకి వచ్చాయి.

బంగారం, వెండిపై దిగుమతి సుంకాలు పెంపు.. (Photo: AFP)
బంగారం, వెండిపై దిగుమతి సుంకాలు పెంపు.. (Photo: AFP)

ఫలితంగా దేశంలో బంగారం, వెండి ధరలు పెరగనున్నాయి.

బంగారం, వెండిపై దిగుమతి సుంకాలు పెంపు- పన్నుల నిర్మాణం ఇలా..

ప్రభుత్వ తాజా నోటిఫికేషన్ల ప్రకారం.. బంగారం, వెండికి సంబంధించిన పలు విభాగాల్లో బేసిక్ కస్టమ్స్ డ్యూటీని (బీసీడీ) 5 శాతం నుంచి ఏకంగా 10 శాతానికి పెంచారు. దీనికి అదనంగా 5 శాతం అగ్రికల్చర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్‌మెంట్ సెస్ (ఏఐడీసీ) గతంలో లాగే కొనసాగుతుంది. ఫలితంగా.. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ఈ విలువైన లోహాలపై మొత్తం పన్ను భారం 15 శాతానికి చేరుకుంది.

విలులైన లోహాల విడిభాగాలు, వ్యర్థాలకు సంబంధించి కూడా ప్రభుత్వం కొత్త రేట్లను ఖరారు చేసింది. నోటిఫికేషన్ నంబర్ 16/2026-కస్టమ్స్ ప్రకారం..

బంగారం, వెండి విడిభాగాలు : 5 శాతం కస్టమ్స్ డ్యూటీ.

ప్లాటినం విడిభాగాలు: 5.4 శాతం డ్యూటీ.

రీసైకిల్ వ్యర్థాలు/యాష్: కొన్ని నిబంధనలకు లోబడి 4.35 శాతం రాయితీ సుంకం వర్తిస్తుంది.

బంగారం, వెండిపై దిగుమతి సుంకాలు పెంపు- ఎందుకీ కఠిన నిర్ణయం?

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరగడం, దేశీయంగా బంగారం దిగుమతులు భారీగా పెరగడంతో భారత కరెంట్ అకౌంట్ లోటు (సీఏడీ) పై తీవ్ర ఒత్తిడి పడుతోంది. దీని ప్రభావంతో రూపాయి విలువ ఈ ఏడాది ఆసియాలోనే అత్యంత బలహీనమైన కరెన్సీలలో ఒకటిగా నిలిచింది. ఇటీవలే డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ ఆల్‌టైమ్ కనిష్ట స్థాయికి పడిపోవడంతో ప్రభుత్వం ఈ దిద్దుబాటు చర్యలు చేపట్టింది.

పాత నిర్ణయానికి స్వస్తి!

నిజానికి, 2024 జులైలో ప్రభుత్వం బంగారం, వెండిపై దిగుమతి సుంకాన్ని 15 శాతం నుంచి 6 శాతానికి తగ్గించింది. స్మగ్లింగ్‌ను అరికట్టడంతో పాటు దేశీయ ఆభరణాల రంగానికి ఊతమివ్వాలని అప్పట్లో ఆ నిర్ణయం తీసుకున్నారు. అయితే, తాజా పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం మళ్లీ పాత పన్ను విధానానికే మొగ్గు చూపడం గమనార్హం. విదేశీ మారక నిల్వలను కాపాడుకోవడానికి ఇది తప్పనిసరని ప్రభుత్వం భావిస్తోంది.

దిగుమతుల వెల్లువ.. పెరిగిన లోటు!

భారత్ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద బంగారం వినియోగదారుగా, అతిపెద్ద వెండి దిగుమతిదారుగా ఉంది. ఇటీవలి గణాంకాలు చూస్తే పరిస్థితి తీవ్రత అర్థమవుతుంది:

2025 గణాంకాలు: బంగారం దిగుమతులు 1.6 శాతం పెరిగి 58.9 బిలియన్ డాలర్లకు, వెండి దిగుమతులు 44 శాతం పెరిగి 9.2 బిలియన్ డాలర్లకు చేరాయి.

జనవరి 2026 షాక్: ఒక్క జనవరి నెలలోనే 12 బిలియన్ డాలర్ల విలువైన బంగారం దిగుమతి కావడంతో, వాణిజ్య లోటు మూడు నెలల గరిష్టానికి చేరుకుంది.

మరోవైపు, గత నెలలో ప్రభుత్వ అనుమతుల్లో జాప్యం, 3 శాతం ఇంటిగ్రేటెడ్ జీఎస్‌టీ (ఐజీఎస్​టీ) నిబంధనల అమలు వల్ల బ్యాంకుల్లో టన్నుల కొద్దీ బంగారం కస్టమ్స్ వద్దే నిలిచిపోయిన సంగతి తెలిసిందే.

ప్రధాని మోదీ విజ్ఞప్తి..

పశ్చిమాసియాలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల వల్ల చమురు ధరలు పెరిగే అవకాశం ఉన్నందున, దేశ ప్రయోజనాల దృష్ట్యా కనీసం ఏడాది పాటు అత్యవసరం కాని బంగారం కొనుగోళ్లకు దూరంగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల పౌరులకు పిలుపునిచ్చారు.

మళ్లీ స్మగ్లింగ్ ముప్పు?

బంగారం, వెండిపై దిగుమతి సుంకాలు పెంచుతున్నట్టు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పరిశ్రమ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. సుంకాల పెంపు వల్ల అధికారిక మార్గాల్లో వచ్చే దిగుమతులు తగ్గినప్పటికీ, మళ్లీ స్మగ్లింగ్ ముఠాలు యాక్టివ్ అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నాయి. 2024లో పన్నులు తగ్గించినప్పుడు స్మగ్లింగ్ గణనీయంగా తగ్గిందని, ఇప్పుడు మళ్లీ సుంకాలు పెరగడం వల్ల గ్రే-మార్కెట్ విస్తరించే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More