యూఏఈ చరిత్రలోనే భారీ జాక్‌పాట్- రూ. 240కోట్ల లాటరీని గెలిచిన భారతీయుడు!
UAE lottery : యూఏఈ చరిత్రలోనే భారీ జాక్పాట్ని గెలుచుకున్నారు దక్షిణ భారత దేశానికి చెందిన అనిల్‌కుమార్ బోళ్ల. లాటరీ ద్వారా రూ. 240కోట్లు పొందారు. అంతేకాదు, ఆ డబ్బును ఎలా ఉపయోగిస్తానో కూడా చెప్పుకొచ్చారు.
యూఏఈ లాటరీ చరిత్రలో ఇప్పటివరకు ఇచ్చిన అత్యంత పెద్ద లాటరీ Dh100 మిలియన్ల (దాదాపు రూ. 240 కోట్లు) జాక్‌పాట్‌ను అబుదాబిలో నివసిస్తున్న ఓ 29 ఏళ్ల భారతీయ ప్రవాసీ గెలుచుకున్నాడు! ఆయన పేరు అనిల్‌కుమార్ బోళ్ల మాధవరావ్ బోళ్ల. ఈయన దక్షిణ భారతదేశానికి చెందినవారు.

అక్టోబర్ 18న నిర్వహించిన 23వ లక్కీ డే ఈవెంట్‌లో ఈ డ్రా జరిగింది. 8.8 మిలియన్లలో ఒక్కరికి మాత్రమే లభించే ఈ లాటరీతో, ఈ 29 ఏళ్ల యువకుడు చారిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఈ విషయాన్ని యూఏఈ లాటరీ సంస్థ సోమవారం విడుదల చేసిన ఒక వీడియో ద్వారా అధికారికంగా ప్రకటించింది.
"ఉత్కంఠ నుంచి ఉత్సవం వరకు! ఈ ఒక్క ప్రకటన అన్నింటినీ మార్చేసింది! అనిల్‌కుమార్ బోళ్ల ఏఈడీ 100 మిలియన్లను ఇంటికి తీసుకెళ్తున్నారు! ఇది ఎప్పటికీ మర్చిపోలేని ఒక 'లక్కీ డే'. అనిల్‌కుమార్‌కు అక్టోబర్ 18 కేవలం ఒక రోజు కాదు, అది అన్నింటినీ మార్చిన రోజు. ఒక జీవితం రూపాంతరం చెందింది. మీ #DareToImagine (ఊహించడానికి ధైర్యం చేయండి) అనేదానికి ఇది ఒక రిమైండర్. అభినందనలు, అనిల్‌కుమార్!" అని ఇంటర్వ్యూ వీడియోను పంచుకుంటూ యూఏఈ లాటరీ సంస్థ ఎక్స్ (గతంలో ట్విట్టర్) లో పోస్ట్ చేసింది.
అనిల్‌కుమార్ బోళ్ల టికెట్‌ను ఎలా ఎంపిక చేసుకున్నారు?
యూఏఈకి వచ్చి కేవలం ఏడాదిన్నరే అయినా అనిల్‌కుమార్, తాను ‘ఈజీ పిక్’ ఎంపికను ఉపయోగించానని వీడియో క్లిప్‌లో తెలిపారు. 'డేస్ సెట్' నుంచి కంప్యూటర్ ద్వారా ఆటోమేటిక్‌గా నంబర్‌లను ఎంచుకున్నానని, అయితే, 'మంత్స్ సెట్' నుంచి మాత్రం తన తల్లి పుట్టిన నెల గౌరవార్థం 11వ నంబర్‌ను కావాలనే ఎంచుకున్నానని వివరించారు.
"నేను మ్యాజిక్ లాంటిదేమీ చేయలేదు, కేవలం ఈజీ పిక్ ఎంచుకున్నాను. చివరి నంబర్ మాత్రం చాలా ప్రత్యేకం. అది నా అమ్మ పుట్టినరోజు," అని ఆయన చెప్పారు. తాను ఒకే లావాదేవీలో 12 టిక్కెట్లు కొనుగోలు చేసినట్లు కూడా ఆయన వెల్లడించారు.
గెలిచిన విషయం తెలుసుకున్న క్షణం గురించి చెబుతూ.. "నేను షాక్‌లో ఉన్నాను. సోఫాలో కూర్చుని, 'అవును, నేను గెలిచాను' అని అనుకున్నాను," అని అన్నారు.
డబ్బుతో అనిల్‌కుమార్ బోళ్ల ప్లాన్ ఏంటి?
ఈ భారీ మొత్తాన్ని బాధ్యతాయుతంగా ఎలా ఉపయోగించాలనే దానిపై ప్రస్తుతం తాను ఆలోచిస్తున్నట్లు అనిల్‌కుమార్ తెలిపారు.
"ఈ మొత్తాన్ని ఎలా పెట్టుబడి పెట్టాలి, సరైన మార్గంలో ఎలా ఖర్చు చేయాలి అని ఆలోచిస్తున్నాను," అని ఆయన అన్నారు. "ఈ మొత్తం గెలిచిన తర్వాత, నా దగ్గర డబ్బు ఉంది అనిపించింది. ఇప్పుడు నా ఆలోచనలను సరైన దిశలో అమలు చేయాలి, నేను గొప్పగా ఏదైనా చేయాలనుకుంటున్నాను," అని చెప్పారు.
వ్యక్తిగత ఆశయాల్లో భాగంగా.. ఒక సూపర్ కార్ కొనుగోలు చేయాలని, ఒక లగ్జరీ రిసార్ట్‌లో ఈ విజయాన్ని గ్రాండ్‌గా జరుపుకోవాలని ఆయన ప్లాన్ చేసుకున్నారు. అలాగే తన కుటుంబాన్ని యూఏఈకి తరలించి, వారికి ఆర్థికంగా మద్దతు ఇవ్వాలని కూడా ఆయన వెల్లడించారు. "నా కుటుంబాన్ని యూఏఈకి తీసుకురావాలి, వారితో కలిసి నా జీవితాంతం సంతోషంగా గడపాలని కోరుకుంటున్నాను," అని అన్నారు.
"మా అమ్మ, నాన్నలకు చాలా చిన్న చిన్న కలలు ఉన్నాయి. వారి కలలన్నింటినీ నెరవేర్చాలి, వారిని జాగ్రత్తగా చూసుకోవాలి," అని ఆయన కొనసాగించారు.
ఈ అదృష్టంలో కొంత భాగాన్ని దానధర్మాలకు (చారిటీకి) కూడా అందించాలని తాను భావిస్తున్నట్టు ఈ 29 ఏళ్ల యువకుడు తెలిపారు. "డబ్బు నిజంగా అవసరమైన వారికి ఈ విరాళం చేరుతుందని నేను నమ్ముతున్నాను," అని ఆయన అన్నారు.
మిగతా లాటరీ ఆటగాళ్లకు అనిల్‌కుమార్ ఒక సందేశం ఇచ్చారు:
"ప్రతిదీ ఒక కారణం కోసమే జరుగుతుందని నేను నమ్ముతున్నాను. ప్రతీ ఒక్కరూ ఆడుతూ ఉండండి, ఖచ్చితంగా ఒక రోజు అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది," అని సలహా ఇచ్చారు.
ఇంత పెద్ద అవకాశాన్ని ఇచ్చినందుకు నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు అనిల్‌కుమార్ బోళ్ల.
"యూఏఈ లాటరీకి నేను నిజంగా ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను, ఎందుకంటే మీరు నాకు చాలా పెద్ద అవకాశాన్ని ఇచ్చారు, ఇది సంవత్సరాల తరబడి కొనసాగుతుందని ఆశిస్తున్నాను," అని ఆయన అన్నారు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


