'గుండెనొప్పితో వెళితే.. ఏమీ చేయకుండానే రూ.22 లక్షల బిల్లు' - అమెరికా వైద్య వ్యవస్థ గుట్టు విప్పిన ఎన్ఆర్‌ఐ!
అమెరికాలో అత్యవసర వైద్యం ఎంత ఖరీదో, భారతీయ వైద్య వ్యవస్థ ఎంతో మేలైనదో వివరిస్తూ ఒక ఎన్ఆర్‌ఐ షేర్ చేసిన ఇన్‌స్టాగ్రామ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గుండెనొప్పితో ఆసుపత్రికి వెళితే తనకు ఎదురైన చేదు అనుభవాలు, ఆ తర్వాత వచ్చిన రూ.22 లక్షల బిల్‌ను చూసి షాక్ తిన్నట్లు అతడు వెల్లడించాడు.
అగ్రరాజ్యం అమెరికాలో స్థిరపడాలని చాలామంది కలలు కంటారు. అయితే అక్కడి ఆరోగ్య వ్యవస్థలు, భరించలేని వైద్య ఖర్చులు చూస్తే ఎంతటివారైనా భయపడాల్సిందే అని అభిప్రాయాలు వినిపిస్తుంటాయి! తాజాగా అమెరికాలో ఉద్యోగం చేస్తున్న భారతీయుడు యువాన్ ఇబానెజ్ గర్వారే తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్న అనుభవాలు ఇప్పుడు పెద్ద చర్చకు దారితీశాయి. అమెరికాతో పోలిస్తే భారత్‌లోనే వైద్యం ఎంతో సులభంగా లభిస్తుందని, నాణ్యంగా ఉంటుందని అన్నాడు. తాను తిరిగి స్వదేశానికి వచ్చేయడానికి ప్రధాన కారణం కూడా ఇదేనని అతడు స్పష్టం చేశాడు.

భారత్‌లో వేగవంతమైన సేవలు.. అందుబాటులో ఖర్చులు!
కొన్నేళ్ల క్రితం భారత్‌లో ఉన్నప్పుడు తనకు ఎదురైన అనుభవాన్ని యువాన్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నాడు. ఒకసారి స్పృహతప్పి పడిపోవడంతో అతడిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఎటువంటి కాగితాల హడావుడి లేకుండానే క్షణాల్లో ప్రైవేట్ రూమ్ కేటాయించారు. వైద్యులు వెంటనే ఈసీజీ, ఎంఆర్‌ఐ, సిటి స్కాన్లతో పాటు అనేక రకాల రక్తం పరీక్షలు చేశారు.
ఏ చిన్న సందేహం వచ్చినా నేరుగా వైద్యుడితో మాట్లాడే వెసులుబాటు లభించింది. కొన్ని రోజుల్లోనే వ్యాధి ఏమిటో నిర్ధారించి చికిత్స అందించారు. ఈ పరీక్షలన్నింటికీ కలిపి మొత్తం బిల్లు కేవలం 500 డాలర్లు (సుమారు రూ.47,000) మాత్రమే అయిందని అతడు తెలిపాడు.
పుణేలో 16 ఏళ్ల పాటు పెరిగిన యువాన్, మన దేశంలో వైద్య సేవలు ఎంత వేగంగా అందుబాటులోకి వస్తాయో ఈ విధంగా వివరించాడు.
అమెరికాలో గుండెనొప్పి వచ్చినా అంబులెన్స్ పిలవలేని పరిస్తితి!
ఇక అమెరికాలో ఎదురైన దారుణ అనుభవాన్ని వివరిస్తూ యువాన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. ఒకరోజు బాస్కెట్‌బాల్ ఆడుతుండగా తీవ్రమైన గుండెనొప్పి వచ్చింది. "అమెరికాలో అంబులెన్స్‌ను పిలిస్తే వేలాది డాలర్ల బిల్లు వేస్తారు. అందుకే తీవ్రమైన నొప్పితో నరకం చూస్తూ కూడా కారు నడుపుకుంటూ నేనే ఆసుపత్రికి వెళ్లాను," అని యువాన్ పేర్కొన్నాడు.
ఆసుపత్రికి వెళ్లిన తర్వాత కూడా ఉపశమనం లభించలేదు. ఫారమ్‌లు పూర్తి చేయడానికి, డాక్యుమెంటేషన్ ప్రక్రియకు దాదాపు గంటన్నరకు పైగా వెయిటింగ్ రూమ్‌లోనే కూర్చోబెట్టారు. ఆ తర్వాత పరీక్షలు చేసిన వైద్యులు అతడికి 'మిని హార్ట్ ఎటాక్' వచ్చిందని చెప్పారు. కానీ ఆ తర్వాత వైద్యుడిని కలవడం గగనంగా మారింది.
"నేను డాక్టర్‌ను కలవాలని అడిగినప్పుడల్లా ఆయన బిజీగా ఉన్నారని, తర్వాత వస్తారని సిబ్బంది దాటవేసేవారు," అని అతడు ఆరోపించాడు. రక్తం నమూనాలు తీసే సమయంలో నర్స్ నరం దొరకక పదే పదే సూదితో గుచ్చడంతో నొప్పితో అరిచినట్టు, దానికి ఆ నర్స్ 'నోరు మూసుకో' అని కూడా చెప్పినట్టు అతడు గుర్తుచేసుకున్నాడు. చివరికి సరైన వ్యాధి నిర్ధారణ గానీ, తదుపరి వైద్య సూచనలు గానీ ఇవ్వకుండానే డిశ్చార్జ్ చేశారని యువాన్ వివరించాడు.
రూ.22 లక్షల బిల్లు.. ఇన్సూరెన్స్ ఉన్నా నో యూజ్
అసలు షాక్ డిశ్చార్జ్ అయ్యాక వచ్చింది. ఆసుపత్రి యాజమాన్యం ఏకంగా 23,000 డాలర్ల (సుమారు రూ.22 లక్షలు) బిల్లును యువాన్ చేతిలో పెట్టింది! అత్యుత్తమ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నప్పటికీ, నెలకు వేలాది డాలర్లు ప్రీమియం చెల్లిస్తున్నప్పటికీ, అతడు తన సొంత జేబు నుంచి 7,000 డాలర్లు (సుమారు రూ.6.67 లక్షలు) చెల్లించాల్సి వచ్చింది.
"అమెరికాలో జబ్బుపడితే ఒక శిక్షలా మారుస్తారు. ప్రజల బలహీనతలను, కష్టాలను వ్యాపారంగా మలుచుకుంటారు," అని యువాన్ మండిపడ్డాడు.
అమెరికాలో మంచి వాతావరణం, మౌలిక వసతులు ఉన్నప్పటికీ.. ఈ దారుణమైన వైద్య వ్యవస్థ వల్లే అక్కడ శాశ్వతంగా నివసించకూడదని నిర్ణయించుకున్నట్లు యువాన్ చెప్పాడు.
నెటిజన్ల మద్దతు.. మెడికల్ టూరిజంలో భారత్ హవా!
ఈ వీడియో వైరల్ కావడంతో అనేకమంది ఎన్ఆర్‌ఐలు అమెరికా వైద్య రంగంలో తమకు ఎదురైన చేదు అనుభవాలను పంచుకున్నారు. ఒక నెటిజన్ స్పందిస్తూ.. "ఎమర్జెన్సీ వార్డుకు వెళ్తే వేలకు వేలు గుంజేశారు. తీరా చూస్తే ఏం జరిగిందో తెలియదని చేతులెత్తేశారు," అని కామెంట్ చేశాడు. మరొకరు స్పందిస్తూ, "నాకు కెఫిన్ పడదని తెలియక ఆసుపత్రికి వెళ్లాను. అక్కడ కేవలం కుర్చీలో కూర్చుని నీళ్లు తాగించినందుకు 800 డాలర్లు (రూ.76,000) వసూలు చేశారు," అని వాపోయారు.
ప్రస్తుతం పాశ్చాత్య దేశాలతో పోలిస్తే భారతదేశంలో వైద్య రంగానికి విశేష ఆదరణ పెరుగుతోంది. అత్యాధునిక సాంకేతికతతో కూడిన ఆసుపత్రులు, నిపుణులైన వైద్యులు తక్కువ ఖర్చులోనే లభించడంతో విదేశీయులు సైతం మెడికల్ టూరిజం కోసం భారత్‌కే ప్రాధాన్యత ఇస్తున్నారు.
సొంత దేశంలోనే రాజాలా బతకవచ్చని, అందుకే తాము కూడా యూఎస్ వదిలి భారత్‌కు తిరిగి వచ్చేశామని మరికొందరు కామెంట్లలో మద్దతు తెలిపారు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


