...
...
Next Story

స్టాక్ మార్కెట్లో ముందస్తు దీపావళి: 1,533 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్

భారత స్టాక్ మార్కెట్లు గురువారం రికార్డు లాభాలతో మెరిశాయి. ఐటీ కంపెనీల అద్భుత త్రైమాసిక ఫలితాలు, జియో ఐపీఓ హడావుడి, ముడిచమురు ధరల తగ్గుదలతో సెన్సెక్స్ 1,500 పాయింట్లకు పైగా ఎగబాకగా, నిఫ్టీ మళ్లీ కీలకమైన 23,000 మార్కును తాకింది.

Published on: Oct 15, 2026, 15:48:41 IST
Advertisement

దేశీయ స్టాక్ మార్కెట్లలో గురువారం ముందస్తు దీపావళి వెలుగులు నిండాయి. గత కొన్ని రోజులుగా తీవ్ర అనిశ్చితిని ఎదుర్కొన్న దలాల్ స్ట్రీట్ ఒక్కసారిగా రాకెట్‌లా దూసుకెళ్లింది. బీఎస్ఈ సెన్సెక్స్ 2.11 శాతం లాభపడగా, నిఫ్టీ 1.66 శాతం లాభపడింది.

స్టాక్ మార్కెట్లో ముందస్తు దీపావళి: 1,533 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
స్టాక్ మార్కెట్లో ముందస్తు దీపావళి: 1,533 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్

ట్రేడింగ్ ఆరంభం నుంచే కొనుగోళ్ల జోరు కనిపిచింది. సెన్సెక్స్ ఏకంగా 1,533 పాయింట్లకు పైగా ఎగబాకి 74,315 వద్ద ముగియగా, నిఫ్టీ 50 సూచీ 374 పాయింట్లు లాభపడి కీలకమైన 22,997 పాయింట్ల వద్ద ముగిసింది.

పసిడి కంటే మిన్నగా మెరిసిన ఐటీ షేర్లు

మార్కెట్ల జూమ్‌కు ప్రధానంగా ఐటీ దిగ్గజాలు ఊతమిచ్చాయి. టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రా షేర్లు వరుసగా మూడో రోజు లాభాలను మూటగట్టుకున్నాయి. సెప్టెంబరు త్రైమాసికం (Q2) ఫలితాలు అంచనాలను మించి నమోదు కావడం ఇన్వెస్టర్లలో ఉత్సాహాన్ని నింపింది.

అంతర్జాతీయంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) షేర్లలో వ్యాల్యుయేషన్ల భయాలతో ఆసియా మార్కెట్లు పతనమైనప్పటికీ, భారత్‌లో మాత్రం ఐటీ స్టాక్స్ వైపే ఇన్వెస్టర్లు మొగ్గు చూపారు.

"గ్లోబల్ మార్కెట్లలో ఏఐ షేర్ల పతనం భారత మార్కెట్లకు ప్లస్ పాయింట్‌గా మారింది. ఇప్పటివరకు భారత ఐటీ షేర్లను విక్రయించి విదేశీ ఏఐ స్టాక్స్‌లో పెట్టుబడులు పెట్టిన విదేశీ ఇన్వెస్టర్లు (FIIs) మళ్లీ మన మార్కెట్ల వైపు మళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి" అని జియోజిత్ ఇన్వెస్ట్‌మెంట్స్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్ వి.కె. విజయకుమార్ విశ్లేషించారు.

మార్కెట్‌ను ఊపేస్తున్న 'జియో ఐపీఓ' హడావుడి

రిలయన్స్ ఇండస్ట్రీస్, భారతీ ఎయిర్‌టెల్ షేర్ల కొనుగోళ్లు కూడా మార్కెట్‌ను పరుగులు తీయించాయి. జియో ప్లాట్‌ఫార్మ్స్ తన భారీ ప్రారంభ పబ్లిక్ ఆఫరింగ్ (IPO) కోసం రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ (RHP) దాఖలు చేయడంతో టెలికాం రంగానికి ఒక్కసారిగా కొత్త ఊపు వచ్చింది.

కరెన్సీ, కమోడిటీ మార్కెట్ల మద్దతు కూడా దలాల్ స్ట్రీట్‌కు లభించింది. అమెరికా డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ 0.2% బలపడి 94.92 వద్ద ప్రారంభమైంది. డాలర్ సూచీ 18 నెలల గరిష్ఠం నుంచి వెనక్కి తగ్గడం రూపాయికి కలిసివచ్చింది.

మరోవైపు ముడిచమురు ధరలు తగ్గడం భారత్‌కు ఊరటనిచ్చింది. బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ 1.75% తగ్గి బ్యారెల్‌కు $104 డాలర్లకు పడిపోగా, డబ్ల్యూటీఐ (WTI) క్రూడ్ 1.07% తగ్గి $94.07 డాలర్ల వద్దకు చేరింది.

నిఫ్టీ 22,800 దాటి నిలుస్తుందా? నిపుణుల విశ్లేషణ

ప్రస్తుత ర్యాలీ ఎంతకాలం కొనసాగుతుందనేది నిఫ్టీ 22,800 స్థాయి వద్ద ఎలా స్పందిస్తుందనే దానిపై ఆధారపడి ఉంటుందని ఆనంద్ రాఠీ షేర్ అండ్ స్టాక్ బ్రోకర్స్ సీనియర్ మేనేజర్ జిగర్ ఎస్ పటేల్ తెలిపారు.

నిఫ్టీ నిరోధక స్థాయి (Resistance) అయిన 22,800ను దాటడం, గంటల ప్రాతిపదికన ఆర్‌ఎస్‌ఐ సూచీ 70 దాటడం కొనుగోళ్ల బలాన్ని సూచిస్తోంది. కరెక్షన్ సమయంలో నిఫ్టీ 22,800 మద్దతు స్థాయి (Support) కంటే పైన నిలబడితే, ఇది కేవలం తాత్కాలిక ర్యాలీ (Dead-cat bounce) కాదని, పూర్తిస్థాయి ట్రెండ్ రివర్సల్ అని నిర్ధారించుకోవచ్చని పటేల్ స్పష్టం చేశారు. ఒకవేళ 22,800 కంటే దిగువకు పడిపోతే మాత్రం బుల్లిష్ ట్రెండ్ బలహీనపడే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు.

 
ABOUT THE AUTHOR
Praveen Kumar Lenkala

ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks