Ind vs Nz: జయహో భారత్.. చరిత్ర సృష్టించిన ఇండియా.. టీ20 ప్రపంచకప్ కైవసం.. ఫైనల్లో ఓటమితో కివీస్ కన్నీళ్లు
Ind vs Nz: అద్భుతం.. ఇండియా టీమ్ గురించి చెప్పేందుకు ఈ పదం సరిపోదు. టీమిండియా సాధించింది. అవును.. చరిత్ర సృష్టించింది. అమేజింగ్ ఆటతీరుతో టీ20 ప్రపంచకప్ 2026 ఛాంపియన్ గా నిలిచింది. ఫైనల్లో న్యూజిలాండ్ ను చిత్తు చేసింది. ఓటమి బాధలో కివీస్ ఆటగాళ్లు కన్నీళ్లు పెట్టుకున్నారు.
టీమిండియా అదరగొట్టింది. కొత్త చరిత్ర సృష్టించింది. హిస్టరీ అందుకుంది. వరుసగా రెండు సార్లు టీ20 ప్రపంచ ఛాంపియన్ గా నిలిచిన తొలి జట్టుగా రికార్డు ఖాతాలో వేసుకుంది. ఆదివారం అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్ ను ఇండియా 96 రన్స్ తేడాతో ఓడించింది.

విశ్వ విజేత భారత్
టీమిండియా మరోసారి విశ్వ విజేతగా నిలిచింది. ఆదివారం (మార్చి 8) టీ20 ప్రపంచకప్ ఫైనల్లో భారత్ అదరగొట్టింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఇండియా 5 వికెట్లకు 255 పరుగుల భారీ స్కోరు చేసింది. సంజు శాంసన్ (46 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్సర్లతో 89), ఇషాన్ కిషన్ (25 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 54), అభిషేక్ శర్మ (21 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 52), శివమ్ దూబె (8 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 26 నాటౌట్) చెలరేగారు.
కివీస్ ఛేజింగ్
ఛేజింగ్ లో న్యూజిలాండ్ ను భారత బౌలర్లు గొప్పగా కట్టడి చేశారు. డేంజరస్ బ్యాటర్లతో నిండిన కివీస్ కు బ్రేక్ వేశారు. ఛేజింగ్ లో న్యూజిలాండ్ 19 ఓవర్లలో 159 పరుగులకు ఆలౌటైంది. బుమ్రా 4 వికెట్లతో చెలరేగాడు. అక్షర్ పటేల్ 3 వికెట్లు పడగొట్టాడు.
స్పిన్ తో బ్రేక్
న్యూజిలాండ్ ఓపెనర్లు ఫిన్ అలెన్, టిమ్ సీఫర్ట్ ఈ ప్రపంచకప్ లోనే మోస్ట్ డేంజరస్ ఓపెనింగ్ పెయిర్ గా పేరు తెచ్చుకున్నారు. కానీ వీళ్లకు తెలివిగా స్పిన్నర్ అక్షర్ పటేల్ తో ఇండియా బ్రేక్ వేసింది. అలెన్ (9)ను అక్షర్ ఔట్ చేశాడు. ఆ వెంటనే రచిన్ (1)ను బుమ్రా, ఫిలిప్స్ (5)ను అక్షర్ పెవిలియన్ చేర్చారు. ఓ ఎండ్ లో సీఫర్ట్ (26 బంతుల్లో 52) పోరాడాడు. కానీ చాప్ మన్ (3)ను హార్దిక్, సీఫర్ట్ ను వరుణ్ వరుస ఓవర్లలో ఔట్ చేశారు.
గెలుపు ఖాయం
న్యూజిలాండ్ 11 ఓవర్లలో 103/5తో నిలవడంతో ఇండియా విక్టరీ ఖాయమైంది. కానీ మిచెల్ శాంట్నర్, డరిల్ మిచెల్ కలిసి కొన్ని భారీ షాట్లు కొట్టారు. అయితే మిచెల్ ను అక్షర్ బుట్టలో వేసుకున్నాడు. చివరకు కివీస్ ఆలౌటైంది.
ఇండియా రికార్డులు
టీ20 ప్రపంచకప్ ఫైనల్లో గెలిచిన ఇండియా కొన్ని రికార్డులు ఖాతాలో వేసుకుంది. వరుసగా రెండు టీ20 ప్రపంచకప్ లు గెలిచిన ఫస్ట్ టీమ్ భారత్. అలాగే టీ20 ప్రపంచకప్ నెగ్గిన తొలి ఆతిథ్య దేశం కూడా ఇండియానే. ఈ పొట్టి కప్ ను అత్యధిక సార్లు (3) గెలుచుకున్న టీమ్ భారత్. 2007, 2024లోనూ భారత్ గెలిచింది. ధోని, రోహిత్ శర్మ తర్వాత ఇండియాకు టీ20 ప్రపంచకప్ అందించిన కెప్టెన్ గా సూర్యకుమార్ నిలిచాడు.
కివీస్ కన్నీళ్లు
టీ20 ప్రపంచకప్ ఫైనల్లో ఇండియా చేతిలో ఓటమితో కివీస్ ఆటగాళ్లు కన్నీళ్లలో మునిగిపోయారు. న్యూజిలాండ్ టీమ్ ఇప్పటివరకూ ఒక్కసారి కూడా ప్రపంచకప్ గెలుచుకోలేదు. ఇప్పుడు తుదిపోరులో మళ్లీ ఓడింది. కివీస్ ఫ్యాన్స్ కూడా ఈ బాధ తట్టుకోలేకపోయారు.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


