‘ఇండిగో’ గందరగోళం : దిల్లీ విమానాశ్రయంలో సాధారణ స్థితికి చేరుకుంటున్న సేవలు!
ఇండిగో విమానాల రద్దుపై ఉద్రిక్తత నేపథ్యంలో దిల్లీ ఎయిర్‌పోర్ట్ నుంచి కీలక ప్రకటన వెలువడింది. ఇండిగో కార్యకలాపాలు సాధారణ స్థితికి చేరుకుంటున్నాయని ఆ ప్రకటన పేర్కొంది. అయితే ప్రజలు తమ ఫ్లైట్ స్టేటస్ చెక్ చేసుకున్న తర్వాత విమానాశ్రయానికి రావాలని సూచించడం జరిగింది.
ఇండిగో విమాన కార్యకలాపాలు "స్థిరంగా మళ్లీ ప్రారంభమవుతూ, సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి" అని దిల్లీ విమానాశ్రయం ఒక ప్రకటన విడుదల చేసింది. శుక్రవారం ఇండిగో ఎయిర్‌లైన్స్ దాదాపు 1,000 విమానాలను రద్దైన తరుణంలో దిల్లీ విమానాశ్రయం నుంచి ఈ ప్రకటన వెలువడటం ప్రయాణికులకు ఊరటనిచ్చే విషయం.
అయితే ప్రయాణికులు ఇంటి నుంచి బయలుదేరే ముందు తమ ఫ్లైట్ స్టేటస్‌ని తప్పనిసరిగా తనిఖీ చేసుకోవాలని విమానాశ్రయం సూచించింది.
“కొద్దిపాటి అంతరాయం తర్వాత ఇండిగో విమాన కార్యకలాపాలు ఇప్పుడు స్థిరంగా పుంజుకుంటూ, సాధారణ స్థితికి వస్తున్నాయని తెలియజేయడానికి సంతోషిస్తున్నాము. ఇంటి నుంచి బయలుదేరే ముందు దయచేసి మీ బుకింగ్, ఫ్లైట్ స్టేటస్‌ని తనిఖీ చేసుకోండి," అని దిల్లీ విమానాశ్రయం వెల్లడించింది.
శుక్రవారం అర్ధరాత్రి వరకు దిల్లీ విమానాశ్రయం నుంచి బయలుదేరాల్సిన అన్ని దేశీయ విమానాలను ఇండిగో రద్దు చేసింది. శుక్రవారం తమకు అత్యంత “తీవ్రమైన అంతరాయం ఏర్పడిన రోజు”గా ఎయిర్‌లైన్ అంగీకరించింది.
ఇండిగో సీఈఓ క్షమాపణలు: పూర్తి సాధారణ స్థితికి ఎప్పుడు?
కొత్త నిబంధనలతో పైలట్ల కొరత ఏర్పడం సహా పలు ఇతర కారణాల వల్ల ఇండిగో కార్యకలాపాలు చితికిపోయాయి! గత కొన్ని రోజులుగా వేలాది విమానాలు రద్దు అవుతున్నాయి లేదా ఆలస్యంగా నడుస్తున్నాయి. ఈ క్రమంలో ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ ఈ పరిస్థితిపై స్పందిస్తూ, డిసెంబర్ 10- 15 మధ్య పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకోవచ్చని చెప్పారు.
"డిసెంబర్ 5వ తేదీ మాకు అత్యంత తీవ్రమైన ప్రభావితమైన రోజు. వెయ్యికి పైగా ఇండిగో విమానాలు రద్దు అయ్యాయి. దీనివల్ల మా వినియోగదారులకు కలిగిన అసౌకర్యానికి మా హృదయపూర్వక క్షమాపణలు తెలియజేస్తున్నాను. పరిస్థితి పూర్తిగా సాధారణ స్థితికి రావడానికి కొంత సమయం పడుతుంది. డిసెంబర్ 10- 15 మధ్య ఇది జరుగుతుందని మేము ఆశిస్తున్నాము," అని ఎల్బర్స్ ఒక వీడియో సందేశంలో తెలిపారు.
పౌర విమానయాన మంత్రి రామమోహన్ నాయుడు ఏమన్నారు?
దేశవ్యాప్తంగా ప్రధాన విమానాశ్రయాల్లో ఏర్పడిన ఈ విస్తృత ఆలస్యాలు, రద్దీకి ఎయిర్‌లైన్ సిబ్బంది నిర్వహణ లోపమే కారణమని, అలాగే డీజీసీఏ (డీజీసీఏ) కొత్త ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్ (ఎఫ్డీటీఎల్) నిబంధనలను ఇండిగో సరిగా నిర్వహించకపోవడం వల్లే ఈ సమస్య తలెత్తిందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామమోహన్ నాయుడు ఆరోపించారు.
సాధారణ కార్యకలాపాలను పునరుద్ధరించడానికి, చిక్కుకుపోయిన ప్రయాణికులకు సహాయం చేయడానికి ఇండిగోకు ఎఫ్డీటీఎల్ నిబంధనల నుంచి తాత్కాలిక ఉపశమనం ఇవ్వాల్సి వచ్చిందని ఆయన వివరించారు.
"నవంబర్ 1 నుంచి, డీజీసీఏ కొత్త ఎఫ్డీటీఎల్ (ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్) నిబంధనలను తీసుకొచ్చింది. కనీసం 6 నెలల పాటు ఎయిర్‌లైన్స్‌తో నిరంతరం సంప్రదింపుల ప్రక్రియను కూడా మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. కొత్త ఎఫ్డీటీఎల్ నిబంధనపై గతంలో ఎటువంటి సమస్య లేదు. ఎయిర్ ఇండియా, స్పైస్ జెట్‌తో పాటు ఇతర విమానయాన సంస్థలు ఈ నిబంధనలకు అనుగుణంగా మారాయి. అయితే, ఇండిగో తన సిబ్బంది నిర్వహణలో లోపం కారణంగానే ఈ పరిస్థితి తలెత్తింది. సాధారణ స్థితిని నిర్ధారించడానికి మేము ఇండిగోకు ఎఫ్డీటీఎల్ నిబంధనలకు సంబంధించి కొంత తాత్కాలిక మినహాయింపు ఇచ్చాం," అని నాయుడు పేర్కొన్నారు.
తాజా పరిణామాల మధ్య, దాదాపు 63% మార్కెట్ వాటాతో ఇండిగో చెలాయిసతున్న దేశీయ విమాన రంగంలో కంపెనీ గుత్తాధిపత్యం ఆందోళనగా మారింది. ఇటీవల విమానాలు రద్దు కావడం వల్ల వేలాది మంది ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఇది పార్లమెంటులో కూడా తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. అంతరాయాలను పరిష్కరించడానికి, ప్రయాణికులకు వాపసు అందేలా చూడాలని కేంద్రం విమానయాన సంస్థలను ఆదేశించింది.
డీజీసీఏ ఉపశమనం ఎందుకంటే..
కొత్త పైలట్ డ్యూటీ-గంటల నిబంధనలను అమలు చేయడంలో ఇండిగో "తప్పుడు అంచనా, ప్రణాళికలో అంతరం" కారణంగానే ఈ అంతరాయాలు ఏర్పడ్డాయని డీజీసీఏ పేర్కొంది.
ఈ ఒక-సమయం మినహాయింపు ఫిబ్రవరి 10, 2026 వరకు చెల్లుబాటులో ఉంటుంది. దీని కింద, రాత్రి డ్యూటీకి సంబంధించిన కొన్ని డీజీసీఏ నిబంధనలను – ప్రత్యేకించి 0000 మరియు 0650 గంటల మధ్య విమాన ప్రయాణ, విశ్రాంతి సమయాలను కవర్ చేసే వాటిని – తాత్కాలికంగా పాటించకుండా ఉండేందుకు ఇండిగోకు అనుమతి లభించింది. అలాగే, పైలట్ సెలవును వారపు విశ్రాంతిగా లెక్కించకుండా నిరోధించే నిబంధనను కూడా డీజీసీఏ వెనక్కి తీసుకుంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


