ఇండిగోను వెంటాడుతున్న ‘డొమినో ఎఫెక్ట్’- సంక్షోభానికి పరిష్కారం ఏది?
దేశంలోనే అతిపెద్ది విమానయాన సంస్థ ఇండీగో, ఇప్పుడు అతిపెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. క్షణక్షణానికి విమాన సేవలు నిలిచిపోతున్నాయి, విమానాలు రద్దు అవుతున్నాయి. ఆలస్యాలు అవుతున్నాయి. దీని వెనుక ఒక్క చాలా కారణాలు ఉన్నాయి. ఇవి డొమినో ఫెక్ట్లా ఇండిగోను వెంటాడుతున్నాయి!
ఇండిగో విమానాల రద్దు, ఆలస్యాల ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. అయితే వీటి వెనుక అనేక కారణాలు ఉన్నాయి. ఇవి డొమినో ఎఫెక్ట్‌లా మారి, దేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థను తీవ్ర సంక్షోభంలోకి నెట్టేశాయి.
ఎయిర్‌బస్ ఏ320లోని సాంకేతిక సమస్యల కారణంగా మొదలైన అంతరాయాలు.. ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్స్ (ఎఫ్డీటీఎల్) నిబంధనలను అమలు చేయాలన్న కోర్టు ఆదేశాలు గందరగోళానికి దారితీశాయి. విమాన కార్యకలాపాల మధ్య పైలట్లు, సిబ్బందికి తగిన విశ్రాంతిని అందించే ఈ నిబంధనలను జనవరి 2024లో ప్రవేశపెట్టినప్పటికీ, నవంబర్ 1, 2025 నుంచి అమలులోకి వస్తుండగా, విమానయాన సంస్థలు మరో పొడిగింపును ఆశించాయి. కానీ అది జరగలేదు.
(తాజా సమాచారం ప్రకారం ఇండిగో సంస్థ దిల్లీ, చెన్నై విమానాశ్రయాల్లో తమ డిపార్చర్ సేవలను నిలిపివేసింది.)
ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్స్ అంటే ఏంటి?
పైలట్, సిబ్బంది అలసటను అడ్డుకోవడానికి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) అమలు చేసిన ఎఫ్డీటీఎల్ నిబంధనలు ఇండిగో విమానాల రద్దుకు ముఖ్య కారణంగా మారాయి. ఆ నిబంధనలు..
వారపు విశ్రాంతి పీరియడ్ పెంపు: విమాన సిబ్బందికి తప్పనిసరిగా ఉండే వారపు విశ్రాంతి పీరియడ్ 36 వరుస గంటల నుంచి 48 వరుస గంటలకు పెంచడం జరిగింది. ఇది సిబ్బంది రోస్టరింగ్ కోసం అందుబాటులో ఉండే సమయాన్ని గణనీయంగా తగ్గిస్తుంది.
రాత్రి కార్యకలాపాలపై కఠిన పరిమితులు:
'నైట్ డ్యూటీ' నిర్వచనం 00:00 నుంచి 06:00 గంటల వరకు పొడిగించడం జరిగింది (గతంలో ఇది 00:00 నుంచి 05:00 గంటల వరకు ఉండేది).
ఒక పైలట్‌కు వారానికి అనుమతించిన గరిష్ట నైట్ ల్యాండింగ్‌ల సంఖ్య ఆరు నుంచి రెండుకు తగ్గించేశారు!
పైలట్లను వరుసగా గరిష్టంగా రెండు నైట్ డ్యూటీలకు మాత్రమే పరిమితం చేయాలి.
గరిష్ట విమాన సమయం తగ్గింపు (రాత్రి కార్యకలాపాలకు): రాత్రి సమయాన్ని (00:00 నుంచి 06:00) అతిక్రమించే కార్యకలాపాల కోసం గరిష్ట విమాన సమయం రోజుకు 8 గంటలకు పరిమితం చేయడం జరిగింది. గరిష్ట డ్యూటీ పీరియడ్ 10 గంటలుగా ఉంది.
ఈ కఠినమైన నిబంధనలు సిబ్బంది ఆపరేట్ చేయగల మొత్తం విమాన గంటలను, రాత్రి విమానాల సంఖ్యను తగ్గిస్తాయి. ఇది ముఖ్యంగా రాత్రి వేళల్లో, తెల్లవారుజామున నడిచే "రెడ్-ఐ" సర్వీసులకు అధిక ప్రాధాన్యత ఇచ్చే ఇండిగో వంటి విమానయాన సంస్థపై తీవ్ర ఒత్తిడిని పెట్టింది.
కొత్త పరిమితుల కారణంగా ఏర్పడిన పైలట్ల కొరత ఇండిగో విమానాల రద్దులు, ఆలస్యాలకు ప్రధాన కారణంగా మారాయి.
ఎయిర్‌బస్ ఏ320 సాఫ్ట్‌వేర్ సమస్య..
నిజానికి, కొన్ని రోజుల క్రితం ఎయిర్‌బస్ ఏ320 సాఫ్ట్‌వేర్ హెచ్చరిక తెరపైకి వచ్చినప్పుడే ఇండిగో ఇప్పటికే సమస్యల అంచున ఉంది. అత్యవసర అప్‌డేట్ విమానాల ఆలస్యానికి దారితీసింది. కానీ ఆ వారాంతంలో విమానాల రద్దులను ఎయిర్‌లైన్ నివారించగలిగింది.
అప్పుడు కూడా అనేక విమానాలు టైమ్‌కి గమ్యస్థానాలకు చేరుకోలేదు. అంటే చాలా విమానాలు అర్ధరాత్రి తర్వాత ల్యాండ్ అయ్యాయి లేదా టేకాఫ్ అయ్యాయి. ఇప్పుడు, ఎఫ్డీటీఎల్ నిబంధనలు అమల్లోకి రావడంతో, పెద్ద సంఖ్యలో విమాన సిబ్బంది తమ తప్పనిసరి విరామాన్ని తీసుకున్నారు. దీనివల్ల వారు ఈ సోమవారం విమానాలకు అందుబాటులో లేకుండా పోయారు.
ఈ విధంగా ఎయిర్‌బస్ ఏ320 లోపం కారణంగా వారాంతంలో జరిగిన విమానాల ఆలస్యాలు, వారంలో ఎఫ్డీటీఎల్ నిబంధనల ప్రభావం వల్ల రద్దులకు దారితీశాయి. ఈ వ్యవస్థ డొమినో (పేక మేడ కూలినట్టుగా అనుకోవచ్చు)లు పడిపోయినట్లుగా పూర్తిగా కుప్పకూలింది.
అక్టోబరు 26 నుండి అమలులోకి వచ్చిన వింటర్ షెడ్యూల్ కారణంగా విమానాల సంఖ్య పెరగడం ఈ పరిస్థితిని మరింత తీవ్రతరం చేసింది.
మరి ఇండిగో ఏం చేసి ఉండాల్సింది?
ఈ పరిస్థితి వస్తుందని ఇండిగో ముందే గుర్తించి ఉండాలి.
ఈ సంక్షోభానికి ముందు రోజుల్లోనే, ఇండిగో ఆన్-టైమ్ పనితీరు 50% కంటే తక్కువగా నమోదవుతోంది. డిలే- క్యాన్సిలేషన్లను ప్రయాణికులు ఫిర్యాదు చేస్తూనే ఉన్నారు. ఎఫ్డీటీఎల్ నిబంధనల కారణంగా పైలట్లు అందుబాటులో లేరని గ్రౌండ్ సిబ్బంది కూడా చెబుతూనే ఉన్నారు.
నిజానికి పైలట్ల కొరతను ముందే ఊహించడం, ఎయిర్‌లైన్ ఐటీ సిస్టమ్‌లలో ఒక క్లిక్ అంత సులభం! కానీ అది జరగలేదని స్పష్టమవుతోంది. కార్యకలాపాలు పూర్తిగా ఆగిపోకుండా ఉండేందుకు దిద్దుబాటు చర్యలు తీసుకుంటున్నప్పటికీ, జవాబుదారీతనం ఎయిర్‌లైన్‌లోని ఎవరో ఒకరిపై కచ్చితంగా ఉండాలి.
నెక్ట్స్ ఏంటి?
ఇండిగోకు ఉన్న ఏకైక ఊరట దాని మార్కెట్ వాటా! ప్రయాణికులకు ఇండిగో లేదా ఎయిర్ ఇండియాని ఎంచుకోవడం తప్ప వేరే మార్గం లేదు.
ఎఫ్డీటీఎల్ నిబంధనల ప్రకారం విమానయాన సంస్థలు కార్యకలాపాలను ఇంకా క్రమబద్ధీకరించనప్పుడు, అదే సమయంలో అదనపు విమానాలను ఆమోదించినందుకు డీజీసీఏపై కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది!
మొత్తం మీద చూసుకుంటే ఇదొక వ్యవస్థాగత వైఫల్యంగా కనిపిస్తోంది. ఈ సమయంలో ఎఫ్డీటీఎల్ నిబంధనలను వెనక్కి తీసుకోవడం కూడా దీనికి పరిష్కారం కాదు.
మరి ఇండిగో ఈ సంక్షోభం నుంచి ఎలా బయటపడుతుందా? భవిష్యత్తులో ఇలాంటి సంక్షోభాలను ఎలా అడ్డుకుంటుంది? అన్నది వేచి చూడల్సిన విషయం.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


