Vande Bharat : రైలేమో అత్యాధునికం- వడ్డించే భోజనంలో మాత్రం బొద్దింక!

అత్యాధునిక వందే భారత్ రైలులో నాణ్యమైన భోజనం లభిస్తుందని భావించిన ప్రయాణికులకు చేదు అనుభవం ఎదురైంది. ముంబైకి చెందిన ఒక ప్రయాణికుడు అహ్మదాబాద్ నుంచి వందే భారత్ రైలులో ప్రయాణిస్తుండగా, తనకు వడ్డించిన దాల్-చావల్ మీల్ బాక్స్‌లో బొద్దింకని గమనించారు.

Published on: Apr 7, 2026, 16:00:25 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మన ఇండియా ఒకవైపు టెక్నాలజీ పరంగా ముందుకు దూసుకెళ్లేందుకు ప్రయత్నిస్తుంటే.. మరోవైపు కొందరి నిర్లక్ష్యం వల్ల మన దేశం వందల ఏళ్ల వెనక్కి వెళ్లిపోతోంది! ఇందుకు ఉదాహరణగా తాజాగా ఒక సంఘటన వెలుగులోకి వచ్చింది. అహ్మదాబాద్-ముంబై వందే భారత్ రైలులో ప్రయాణిస్తున్న ఒక ముంబై వాసికి వడ్డించిన భోజనం (దాల్​-చావల్)లో బొద్దింక కనిపించింది. సదరు ప్రయాణికుడు ఈ విషయాన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్​' (గతంలో ట్విట్టర్) వేదికగా వీడియో, ఫోటోలతో పాటు వెల్లడించడంతో అది వైరల్‌గా మారింది.

వందే భారత్​ భోజనం బొద్దింక..
వందే భారత్​ భోజనం బొద్దింక..

దీనిపై తక్షణమే స్పందించిన ఐఆర్‌సీటీసీ.. సదరు వెండర్‌పై రూ. 10 లక్షల జరిమానా విధించడమే కాకుండా కాంట్రాక్ట్ రద్దు నోటీసు జారీ చేసింది.

వందే భారత్​ భోజనంలో బొద్దింక- ప్రయాణికుడి ఆవేదన..

తన కోచ్‌లో కనీసం ఇలాంటివి రెండు కేసులు నమోదయ్యాయని, అది చూసిన తర్వాత ఎవరూ భోజనం చేయలేకపోయారని సదరు ప్రయాణికుడు ‘ఎక్స్​’లో పోస్ట్ చేశారు. భోజనాన్ని సరఫరా చేసిన వెండర్ 'ఎం/ఎస్​ బృందావన్ ఫుడ్ ప్రొడక్ట్స్' (ఆర్​కే గ్రూప్‌లో భాగం) అని వెల్లడించారు.

"ఈ ఆహారం ఎఫ్‌ఎస్‌ఎస్ఏఐ ప్రమాణాల ప్రకారం తయారు చేయడం లేదని నాకు ఖచ్చితంగా అనిపిస్తోంది. వెండర్ లైసెన్స్‌ను రద్దు చేయాలి. కేవలం క్షమాపణలతో సరిపెట్టకుండా కఠిన చర్యలు తీసుకోవాలి," అని ఆయన అధికారులను కోరారు.

వందే భారత్​ భోజనంలో బొద్దింక- ఐఆర్​సీటీసీ కఠిన చర్యలు..

వందే భారత్​ భోజనంలో బొద్దింక ఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రైల్వే శాఖ, ఐఆర్​సీటీసీ వెంటనే స్పందించాయి.

భారీ జరిమానా: నిబంధనల ఉల్లంఘనకు గాను సర్వీస్ ప్రొవైడర్‌కు రూ. 10 లక్షల భారీ జరిమానా విధించారు.

కాంట్రాక్ట్ రద్దు: సదరు వెండర్ కాంట్రాక్ట్‌ను రద్దు చేసే దిశగా టెర్మినేషన్ నోటీసు జారీ చేశారు.

కిచెన్ సీజ్: భోజనం తయారైన కిచెన్‌ను అధికారులు సీజ్ చేసి, అక్కడ డీప్ క్లీనింగ్, పెస్ట్ కంట్రోల్ చర్యలు చేపట్టారు.

"ప్రయాణికుల భద్రత, పరిశుభ్రత మా మొదటి ప్రాధాన్యత. జరిగిన అసౌకర్యానికి విచారం వ్యక్తం చేస్తున్నాము," అని ఐఆర్​సీటీసీ వెల్లడించింది.

వందే భారత్​ భోజనంలో బొద్దింక- సోషల్ మీడియాలో స్పందన..

వందే భారత్​ భోజనంలో బొద్దింక ఘటనపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు.

"నేను ఎప్పుడూ నా సొంత ఆహారాన్ని వెంట తీసుకెళ్తాను, బయటి వెండర్లను నమ్మను," అని ఒక వినియోగదారుడు కామెంట్ చేశారు.

"ఇది ఏకైక ఘటన కాదు, తరచుగా జరుగుతోంది. కేవలం క్షమాపణలు చెబితే సరిపోదు, ప్రజల ఆరోగ్యంపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుంది," అని మరొకరు మండిపడ్డారు.

ప్రయాణికులు టికెట్ బుక్ చేసుకునేటప్పుడే 'నో' ఆప్షన్ ఎంచుకోవడం మేలని, ఇంటి నుండి తెచ్చుకున్న ఆహారమే సురక్షితమని పలువురు అభిప్రాయపడుతున్నారు.

తరచూ అడిగే ప్రశ్నలు-

1. వందే భారత్ రైలులో భోజనం నాణ్యతపై ఫిర్యాదు చేయడానికి ఐఆర్‌సీటీసీ ఏ చర్య తీసుకుంది?

బొద్దింక కనిపించిన ఘటనపై విచారణ జరిపిన ఐఆర్‌సీటీసీ, సదరు వెండర్‌కు రూ. 10 లక్షల జరిమానా విధించింది, వారి కాంట్రాక్ట్‌ను రద్దు చేసేందుకు నోటీసు ఇచ్చింది.

2. ప్రయాణికులు రైలు భోజనంపై ఫిర్యాదు చేయాలనుకుంటే ఎక్కడ చేయవచ్చు?

ప్రయాణికులు ఐఆర్‌సీటీసీ అధికారిక వెబ్‌సైట్, 'RailMadad' యాప్ లేదా సోషల్ మీడియా వేదికల ద్వారా అధికారులను ట్యాగ్ చేస్తూ ఫిర్యాదు చేయవచ్చు.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More