Online shopping : ఇండియాలో ‘రీల్స్’ చూసే కొనుక్కుంటున్నారు! మెట్రో సిటీలకు దీటుగా పల్లెల్లోనూ..
Instagram Reels : భారతదేశంలో వీడియోల వినియోగం కేవలం మెట్రో నగరాలకే పరిమితం కాలేదని, పల్లెల్లోనూ భారీగా పెరిగిందని మెటా సంస్థ వెల్లడించింది. ఇన్‌స్టాగ్రామ్ ‘రీల్స్’ ద్వారా కస్టమర్లు కొత్త వస్తువులను కనుగొనడమే కాకుండా, కొనుగోలు నిర్ణయాలు కూడా తీసుకుంటున్నట్లు తాజా సర్వేలో తేలింది.
Online shopping trends in India : భారతదేశంలో స్మార్ట్‌ఫోన్, ఇంటర్నెట్ విప్లవం తర్వాత సోషల్ మీడియా వినియోగం ఊహించని స్థాయికి చేరుకుంది! ముఖ్యంగా వీడియోలు చూడటం అనేది కేవలం హైదరాబాద్, ముంబై, దిల్లీ వంటి మెట్రో నగరాలకే పరిమితం కాలేదని ప్రముఖ సాంకేతిక దిగ్గజం మెటా స్పష్టం చేసింది. మరీ ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో వచ్చే షార్ట్ వీడియో కంటెంట్ 'రీల్స్' ఇప్పుడు సరికొత్త ట్రెండ్‌ను సృష్టిస్తోంది. కస్టమర్లు సరికొత్త విషయాలను తెలుసుకోవడానికి, నచ్చిన క్రియేటర్లతో కనెక్ట్ అవ్వడానికి, ఆన్‌లైన్ షాపింగ్ నిర్ణయాలు తీసుకోవడానికి ఈ రీల్స్ అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నాయని మెటా తన తాజా అధ్యయనంలో వెల్లడించింది.

మెట్రో నగరాలు, టైర్-2, టైర్-3 పట్టణాలతో పాటు గ్రామీణ భారతంలోనూ ప్రతిరోజూ వీడియోలు చూసే వారి సంఖ్య దాదాపు ఒకేలా ఉందని, ఫలితంగా పట్టణ- గ్రామీణ ప్రాంతాల మధ్య ఉన్న వ్యత్యాసం క్రమంగా తగ్గిపోతోందని కంపెనీ పేర్కొంది.
షాపింగ్ ప్లాట్‌ఫారమ్‌గా మారుతున్న రీల్స్!
మెటా సంస్థ ఆదేశాల మేరకు ప్రముఖ మార్కెట్ రీసెర్చ్ సంస్థ ‘ఇప్సోస్’ భారతదేశంలోని 23 నగరాలు, పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు 4,000 మందికి పైగా వినియోగదారులపై ఈ సర్వే నిర్వహించింది. ఈ అధ్యయనం ప్రకారం.. మనదేశంలో సర్వేలో పాల్గొన్న వారిలో ఏకంగా 97 శాతం మంది వినియోగదారులు ప్రతిరోజూ మెటా ప్లాట్‌ఫారమ్‌ల (ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్)లో వీడియోలు చూస్తున్నారు.
పట్టణ, గ్రామీణ ప్రాంతాల మధ్య వీడియోల వినియోగంలో తేడా చాలావరకు తగ్గిపోయింది. నగరాల్లో రోజువారీ వీడియోల వినియోగం 98 శాతంగా ఉంటే, గ్రామాల్లో ఇది 94 శాతంగా నమోదైంది. ఈ సర్వేలో తేలిన మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. నేటి యువత (జెన్ జీ)లో 97 శాతం మంది, మహిళల్లో 97 శాతం మంది, ప్రీమియం ఎన్‌సీసీఎస్-ఏ కేటగిరీకి చెందిన సమాజంలో ఉన్నత వర్గాల వారిలో 98 శాతం మంది ప్రతిరోజూ మెటా యాప్స్‌లో వీడియోలను వీక్షిస్తున్నారు.
ఈ మారుతున్న ట్రెండ్ వల్ల ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ విపరీతమైన ఆదరణ పొందుతున్నాయి. యువతలో 89 శాతం మంది, మహిళల్లో 85 శాతం మంది, ఎన్‌సీసీఎస్-ఏ ఆడియన్స్‌లో 88 శాతం మంది ప్రతిరోజూ రీల్స్ చూస్తున్నట్లు సర్వే స్పష్టం చేసింది. ఈ షార్ట్ వీడియో ప్లాట్‌ఫారమ్ ఇప్పుడు కేవలం వినోదానికే కాకుండా, కొత్త విషయాలను కనుగొనడానికి, ట్రెండ్స్ సృష్టించడానికి ఒక ముఖ్యమైన వేదికగా మారిందని కంపెనీ తెలిపింది.
కల్చర్, క్రియేటర్స్, కామర్స్ కలయిక..
ఈ అధ్యయనంపై మెటా ఇండియా (సీపీజీ, డీ2సీ, ఆటోమోటివ్) డైరెక్టర్ సౌగతో భౌమిక్ మాట్లాడుతూ.. “క్రియేటర్లు, సంస్కృతి, వ్యాపారం (కామర్స్) అనేవి రీల్స్ వేదికపై గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకదానితో ఒకటి కలిసిపోతున్నాయి. బ్రాండ్ల విషయానికి వస్తే.. ఇది కేవలం ఒక కంటెంట్ ప్రదర్శన మాత్రమే కాదు, ఇది నిరంతరాయంగా సాగే 'కంటెంట్-టు-కామర్స్' (వ్యాపార) ప్రక్రియ. రీల్స్ ద్వారానే కస్టమర్లకు కొత్త వస్తువుల గురించి తెలుస్తుంది, నమ్మకం ఏర్పడుతుంది, చివరకు వస్తువులను కొనుగోలు చేసేలా నిర్ణయాలు మారుతున్నాయి,” అని వివరించారు.
భారతీయ శ్రోతలను ఎక్కువగా ఎలాంటి కంటెంట్ ఆకట్టుకుంటుందో కూడా ఈ నివేదిక వెల్లడించింది. రీల్స్‌లో ముఖ్యంగా బ్యూటీ అండ్ మేకప్, ఫ్యాషన్, లైఫ్‌స్టైల్, ఫిట్‌నెస్, కామెడీ, స్పోర్ట్స్ కేటగిరీలు అత్యంత ప్రజాదరణ పొందినట్లు తేలింది. దీనివల్ల కంటెంట్ క్రియేటర్లకు భారీగా లబ్ధి చేకూరుతోంది. ఇతర షార్ట్ వీడియో ప్లాట్‌ఫారమ్‌లతో పోలిస్తే, మెటా రీల్స్ ద్వారా క్రియేటర్లకు దాదాపు 60 శాతం ఎక్కువ ఎంగేజ్‌మెంట్ (ఆదరణ) లభిస్తోందని కంపెనీ పేర్కొంది.
వినియోగదారుల కొనుగోలు నిర్ణయాలను రీల్స్ ఏ స్థాయిలో ప్రభావితం చేస్తున్నాయో ఈ గణాంకాలు నిరూపిస్తున్నాయి. సర్వే ప్రకారం.. రీల్స్ ప్లాట్‌ఫారమ్ ద్వారా 81 శాతం మంది కొత్త ప్రొడక్ట్స్‌ను కనుగొంటుండగా, 66 శాతం మంది ఆ వస్తువులను కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అంతేకాకుండా, 47 శాతం మంది కస్టమర్ల కొనుగోలు నిర్ణయాలను రీల్స్ నేరుగా ప్రభావితం చేస్తున్నాయి. ముఖ్యంగా ఈ-కామర్స్, ఆటోమొబైల్ (వాహనాలు), ఫైనాన్షియల్ సర్వీసెస్ (ఆర్థిక సేవలు) రంగాలలో ఈ ప్రభావం మరింత ఎక్కువగా ఉందని సర్వే నివేదిక స్పష్టం చేసింది.
ఈ లిస్ట్‌లో మీరు కూడా ఉన్నారా? రీల్స్ ద్వారా మీ కొనుగోళ్లను నిర్ణయించుకుంటున్నారా?
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


