...
...
Next Story

iQoo Neo 12 : గేమింగ్ లవర్స్​కి అదిరిపోయే వార్త! 9000ఎంఏహెచ్​ బ్యాటరీతో ఐక్యూ కొత్త స్మార్ట్​ఫోన్..

మొబైల్ గేమింగ్ ప్రియుల కోసం ఐక్యూ సంస్థ సరికొత్త పవర్ హౌస్‌ను సిద్ధం చేసింది. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్, 9,000ఎంఏహెచ్ భారీ బ్యాటరీ, ఇన్‌బిల్ట్ యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో కూడిన 'ఐక్యూ నియో 12' స్మార్ట్‌ఫోన్ అక్టోబర్ 28న అధికారికంగా మార్కెట్లోకి రానుంది. వివరాల్లోకి వెళితే..

Published on: Oct 20, 2026, 09:59:15 IST
Advertisement

గేమింగ్ స్మార్ట్‌ఫోన్ విభాగంలో పవర్‌ఫుల్ ప్రాసెసర్లు, అత్యుత్తమ పర్ఫార్మెన్స్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ‘ఐక్యూ’ బ్రాండ్.. మరో సంచలనానికి తెరదీసింది. గత కొద్దిరోజులుగా టెక్ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతున్న ‘ఐక్యూ నియో 12’ లాంచ్ తేదీపై కంపెనీ అధికారిక స్పష్టత ఇచ్చింది. అక్టోబర్ 28న చైనా మార్కెట్లో ఈ ఫ్లాగ్‌షిప్ గేమింగ్ ఫోన్‌ను గ్రాండ్‌గా ఆవిష్కరించడంతో పాటు అదే రోజు నుంచి విక్రయాలు కూడా ప్రారంభించనున్నట్లు సంస్థ ప్రకటించింది. మునుపటి నియో 11 మోడల్‌తో పోలిస్తే ప్రాసెసింగ్ పవర్, డిస్‌ప్లే, బ్యాటరీ, కూలింగ్ వ్యవస్థల్లో భారీ అప్‌గ్రేడ్‌లతో ఈ ఫోన్‌ను తీర్చిదిద్దారు.

ఐక్యూ నియో 12 లాంచ్ డేట్ ఇదే..
ఐక్యూ నియో 12 లాంచ్ డేట్ ఇదే..

ఈ నేపథ్యంలో ఈ ఐక్యూ నియో 12 స్మార్ట్​ఫోన్​పై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ డీటైల్డ్​గా తెలుసుకోండి..

కొత్త డిజైన్​తో ఐక్యూ నియో 12- ఇన్‌బిల్ట్ యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్!

ఐక్యూ నియో 12 స్మార్ట్​ఫోన్ డిజైన్ పరంగా గత మోడళ్ల కంటే పూర్తి భిన్నంగా కనిపిస్తోంది. వెనుక భాగంలో సరికొత్తగా రౌండెడ్-స్క్వేర్ కెమెరా మాడ్యూల్‌ను అందించారు. ఈ మాడ్యూల్‌లోనే వర్టికల్ కెమెరా లెన్స్‌లతో పాటు ‘మాన్​స్టర్ ఇన్‌సైడ్’ బ్యాడ్జింగ్, అంతర్నిర్మితంగా ఉండే చిన్న కూలింగ్ ఫ్యాన్ గ్రిల్‌ను అమర్చడం విశేషం. ఫోన్ వేడెక్కకుండా లోపలి వేడిని బయటకు పంపేందుకు మెటల్ సైడ్ ఫ్రేమ్‌పై ప్రత్యేకంగా ఎగ్జాస్ట్ వెంట్లను కూడా పొందుపరిచారు.

గతంలో ఉన్న కేవలం లిక్విడ్ కూలింగ్ స్థానంలో హార్డ్‌వేర్ ఆధారిత 'ఐస్ డోమ్' యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్ మోటార్‌ను ఉపయోగించడం వల్ల గంటల తరబడి భారీ గేమ్‌లు ఆడినా ఫోన్ వేడెక్కే అవకాశం ఉండదు. పెయిల్ సిల్వర్-బ్లూ ఫినిషింగ్‌తో పాటు బ్రష్-స్ట్రోక్ పాటర్న్ డిజైన్ ఫోన్‌కు మరింత ప్రీమియం, ప్రొఫెషనల్ గేమింగ్ లుక్‌ను తీసుకొచ్చింది.

ఐక్యూ నియో 12- డిస్​ప్లే, ప్రాసెసర్..

డిస్‌ప్లే నాణ్యత విషయంలో ఐక్యూ సరికొత్త ప్రమాణాలు నెలకొల్పింది. ఈ నియో 12 స్మార్ట్​ఫోన్‌లో 2,200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, ఏకంగా 185హెచ్​జెడ్ రీఫ్రెష్ రేట్‌తో కూడిన 2కే అమోలెడ్ ప్యానెల్‌ను అమర్చారు. చీకటి వాతావరణంలో కళ్లకు శ్రమ తగ్గించేలా బ్రైట్‌నెస్‌ను కేవలం 1 నిట్‌కు తగ్గించుకునే వెసులుబాటు ఉంది. రాత్రి వేళల్లో నిరంతరం గేమింగ్ ఆడేవారికి లేదా కంటెంట్ చూసేవారికి ఇది ఎంతగానో మేలు చేస్తుంది.

సాధారణంగా గేమింగ్ ఫోన్లలో బ్యాటరీ త్వరగా అయిపోతుందనే ఫిర్యాదులు ఎక్కువగా ఉంటాయి. దానికి శాశ్వత పరిష్కారం చూపుతూ ఐక్యూ ఈ నియో 12 మోడల్‌లో ఏకంగా 9,000ఎంఏహెచ్ సింగిల్ సెల్ 'బ్లూ ఓషన్' భారీ బ్యాటరీని పొందుపరిచింది. దీనికి తోడు 100డబ్ల్యూ వేగవంతమైన ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా అందుబాటులో ఉంది. లీక్ అయిన గీక్‌బెంచ్ నివేదికల ప్రకారం ఈ ఫోన్ 16జీబీ ర్యామ్, ఆండ్రాయిడ్ 17 ఆధారిత ఓరిజిన్ ఓఎస్ 7 సాఫ్ట్‌వేర్‌పై పనిచేయనుంది.

అంతర్జాతీయ మార్కెట్లకు ఈ ఫోన్ ‘ఐక్యూ 16ఆర్’ పేరుతో విడుదలయ్యే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. భారత మార్కెట్లో చివరిగా 2025లో 'ఐక్యూ నియో 10' లాంచ్ కాగా, నియో 11 భారత్‌కు రాలేదు! అయితే మన దేశంలో మొబైల్ గేమర్ల నుంచి ఉన్న విపరీతమైన డిమాండ్ దృష్ట్యా, ఈ సరికొత్త నియో 12 మోడల్‌ను 'నియో' సిరీస్ పొడిగింపుగా గానీ లేదా 'ఐకూ 16ఆర్' బ్రాండింగ్ కింద గానీ భారత విపణిలోకి త్వరలోనే తీసుకొచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని సమాచారం.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks