iQOO 15 Ultra : గేమింగ్ వరల్డ్‌లో కొత్త సెన్సేషన్- ఐక్యూ స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు ఇవే..
గేమింగ్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఐక్యూ 15 అల్ట్రా త్వరలో విడుదల కానుంది. ఇందులో మొట్టమొదటిసారిగా ఇన్‌బిల్ట్ 'యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్', 165హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్ వంటి విప్లవాత్మక ఫీచర్లు ఉండబోతున్నాయి.
గేమింగ్ ప్రియులకు పండగ లాంటి వార్త! ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఐక్యూ తన సరికొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ ‘ఐక్యూ 15 అల్ట్రా’ విడుదలకు రంగం సిద్ధం చేసింది. 2026 ఫిబ్రవరి ప్రారంభంలో ఈ ఫోన్ మార్కెట్లోకి అడుగుపెట్టబోతోంది. ఇప్పటికే చైనాలో ఈ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్లు కూడా మొదలయ్యాయి.

ఐక్యూ 15 అల్ట్రా- ఆకట్టుకునే డిజైన్.. గేమింగ్ లుక్
ప్రీ-ఆర్డర్ ఫోటోల ప్రకారం.. ఈ ఐక్యూ 15 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ డిజైన్ చాలా డిఫరెంట్‌గా ఉంది. వెనుక వైపు వృత్తాకారంలో ఉన్న కెమెరా మాడ్యూల్, లెన్స్‌ల చుట్టూ ఉన్న రింగ్ లేఅవుట్ దీనికి ఒక ప్రీమియం లుక్‌ను ఇస్తున్నాయి. ఫోన్ బాడీపై అక్కడక్కడ మెరిసే ఆరెంజ్ కలర్ హైలైట్స్ ఇది ఒక పక్కా గేమింగ్ ఫోన్ అని చాటిచెబుతున్నాయి. ఫోన్ కింది భాగంలో బయటకు కనిపించేలా ఉన్న కూలింగ్ ఫ్యాన్ ఈ ఫోన్‌కే ప్రత్యేక ఆకర్షణ అని చెప్పుకోవచ్చు.
ఐక్యూ 15 అల్ట్రా- ఐదేళ్ల వరకు భరోసా..
ఈ ఫోన్లో కూలింగ్ ఫ్యాన్ పాడైపోతుందేమో అన్న భయం అక్కర్లేదు. ఎందుకంటే, ఈ ఫ్యాన్ కోసం ఐదేళ్ల వరకు ప్రత్యేక ప్రొటెక్షన్ ప్లాన్‌ను కూడా కంపెనీ ఆఫర్ చేస్తోంది. అంటే ఈ కూలింగ్ సిస్టమ్ ఫోన్లో ఒక ముఖ్యమైన భాగమే తప్ప, ఏదో హంగు కోసం పెట్టింది కాదని అర్థమవుతోంది.
ఐక్యూ 15 అల్ట్రా- పర్ఫార్మెన్స్ అదిరిపోతుంది!
ఈ స్మార్ట్‌ఫోన్‌లో క్వాల్కమ్ నుంచి రాబోతున్న అత్యంత శక్తివంతమైన ‘స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5’ ప్రాసెసర్‌ను వాడుతున్నారు.
డిస్‌ప్లే: 6.85-ఇంచ్ 2కే ఎల్టీపీఓ ఓఎల్ఈడీ డిస్‌ప్లే.
రిఫ్రెష్ రేట్: గేమింగ్ స్మూత్‌గా ఉండటం కోసం 165హెచ్‌జెడ్ హై రిఫ్రెష్ రేట్ సపోర్ట్.
కంట్రోల్స్: గేమింగ్ కన్సోల్ లాంటి అనుభవం కోసం ప్రత్యేకంగా షోల్డర్ ట్రిగ్గర్ బటన్లు.
ఐక్యూ 15 అల్ట్రా- బ్యాటరీ, కెమెరా..
వార్తల ప్రకారం ఇందులో 7,000ఎంఏహెచ్ కంటే పెద్దదైన భారీ బ్యాటరీ ఉండే అవకాశం ఉంది. ఇది గంటల తరబడి ఛార్జింగ్ లేకుండా గేమ్స్ ఆడుకోవడానికి సహకరిస్తుంది. ఇక కెమెరా విషయానికి వస్తే, 50 మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్‌తో కూడిన ట్రిపుల్ కెమెరా సెటప్ ఉండొచ్చు. అంతేకాకుండా ఐపీ68 రేటింగ్‌తో వాటర్, డస్ట్ రెసిస్టెన్స్‌ను కూడా అందిస్తున్నారు.
మొత్తానికి, కేవలం స్మార్ట్‌ఫోన్‌లా కాకుండా ఒక పోర్టబుల్ గేమింగ్ కన్సోల్‌లా ఈ ఐక్యూ 15 అల్ట్రా ఉండబోతోంది. ఫిబ్రవరిలో దీని అసలు ధర ఎంతనేది తెలియనుంది. ఇండియా లాంచ్పైనా కంపెనీ అప్డేట్ చేయాల్సి ఉంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


