...
...
Next Story

Strait of Hormuz : ‘హర్ముజ్​ జలసంధి నుంచి ఒక్క ఓడ కూడా వెళ్లదు’- ఇరాన్​ వార్నింగ్​!

Iran War : హర్ముజ్​ జలసంధి వ్యవహారంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన 48 గంటల డెడ్‌లైన్‌పై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. తమ విద్యుత్ కేంద్రాలపై దాడి చేస్తే, ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హిర్ముజ్ జలసంధిని శాశ్వతంగా మూసివేస్తామని హెచ్చరించింది.

Published on: Mar 23, 2026, 05:28:05 IST
Advertisement

గల్ఫ్ దేశాల్లో ఉద్రిక్తతలు ఇప్పట్లో తగ్గే సూచనలు ఏమాత్రం కనిపించడం లేదు! ఇరాన్-అమెరికా మధ్య మాటల యుద్ధం ఇప్పటికే అంతర్జాతీయ ఇంధన భద్రతను వణికించే స్థాయికి చేరుకుంది. ఈ తరుణంలో.. ప్రపంచ ఇంధన సరఫరాకు జీవనాధారంగా చూసే స్ట్రెయిట్​ ఆఫ్​ హర్ముజ్​ (హర్ముజ్​ జలసంధి)పై ఇరాన్​ సంచలన వ్యాఖ్యలు చేసింది. తమ విద్యుత్​ ప్లాంట్లపై అమెరికా దాడి చేస్తే, హర్ముజ్​ జలసంధిని పూర్తిగా మూసివేస్తామని హెచ్చరికలు జారీ చేసింది.

మళ్లీ తెరిచే ప్రసక్తే లేదు: ఇరాన్

హర్ముజ్​ జలసంధిలో ఓడ.. (AP)
హర్ముజ్​ జలసంధిలో ఓడ.. (AP)

ఇరాన్‌కు చెందిన ఖాదం అల్-అన్బియా సెంట్రల్ హెడ్ క్వార్టర్స్ ప్రతినిధి ఇబ్రహీం జోల్ఫాగారి ఈ హెచ్చరికలు జారీ చేశారు. "ఒకవేళ అమెరికా గనుక మా విద్యుత్ కేంద్రాలను ధ్వంసం చేస్తే, హర్ముజ్ జలసంధిని మేం పూర్తిగా మూసివేస్తాం. కూలిపోయిన మా ప్లాంట్లను తిరిగి నిర్మించే వరకు ఆ మార్గాన్ని మళ్లీ తెరిచే ప్రసక్తే లేదు," అని ఆయన స్పష్టం చేశారు.

ఈ ప్రకటన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది.

ప్రస్తుతానికి ఈ కీలక నౌకా రవాణా మార్గం తమ నియంత్రణలోనే ఉందని, అయితే శత్రువులకు, తమ ప్రయోజనాలకు విఘాతం కలిగించే ట్రాఫిక్‌కు మాత్రమే దీన్ని మూసివేస్తున్నామని జోల్ఫాగారి వివరించారు. సామాన్య రవాణాకు మాత్రం అంతర్జాతీయ నిబంధనల ప్రకారం అనుమతి ఉంటుందని చెప్పారు.

ట్రంప్ 48 గంటల అల్టిమేటం..

ఇరాన్​ ఈ హెచ్చరికలు జారీ చేయడానికి కారణం.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​! హర్ముజ్ జలసంధిని ఇరాన్ వెంటనే పూర్తిగా తెరవకపోతే, ఆ దేశంలోని ప్రధాన విద్యుత్ కేంద్రాలను అమెరికా నేలమట్టం చేస్తుందని ట్రంప్ 'ట్రూత్ సోషల్' వేదికగా హెచ్చరించారు. ఇందుకు ఆయన ఇరాన్‌కు 48 గంటల గడువు ఇచ్చారు.

ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే చమురులో దాదాపు ఐదవ వంతు ఈ హర్ముజ్ జలసంధి ద్వారానే వెళుతుంది. ఒకవేళ ఇరాన్ ఈ మార్గాన్ని మూసివేస్తే ప్రపంచ మార్కెట్‌లో చమురు ధరలు ఆకాశాన్ని తాకడంతో పాటు, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉంది.

టార్గెట్‌లో ఇజ్రాయెల్, అమెరికా స్థావరాలు.

ఇరాన్ హెచ్చరికలు కేవలం జలసంధి మూసివేతతోనే ఆగలేదు. ప్రతీకార చర్యలు ఇతర ప్రాంతాలకు కూడా విస్తరిస్తాయని జోల్ఫాగారి హెచ్చరించారు. "ఇజ్రాయెల్‌లోని అన్ని విద్యుత్ కేంద్రాలు, ఇంధన మౌలిక సదుపాయాలు, సమాచార సాంకేతిక (ఐసీటీ) వ్యవస్థలను మేము లక్ష్యంగా చేసుకుంటాం. అంతేకాకుండా, అమెరికా సైనిక స్థావరాలకు ఆశ్రయం కల్పిస్తున్న ప్రాంతీయ దేశాల విద్యుత్ ప్లాంట్లు కూడా మాకు లీగల్ టార్గెట్స్ అవుతాయి," అని ఆయన బాంబు పేల్చారు.

పశ్చిమ ఆసియాలో అమెరికాకు ఉన్న ఆర్థిక ప్రయోజనాలను పూర్తిగా దెబ్బతీసేందుకు సిద్ధంగా ఉన్నామని, అమెరికా వాటాలున్న కంపెనీలను నామరూపాలు లేకుండా చేస్తామని ఇరాన్ ప్రతినిధి ఘాటుగా వ్యాఖ్యానించారు.

అయితే, తాము యుద్ధాన్ని కోరుకోవడం లేదని, కానీ ఆత్మరక్షణ కోసం ఎంతటి సాహసానికైనా సిద్ధమని ఆయన పేర్కొన్నారు.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks