నేటి కాలంలో రూ. 1 కోటి టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడం చాలామందికి ఒక పెద్ద ఆర్థిక రక్షణ కవచంలా కనిపిస్తుంది. మన తదనంతరం కుటుంబానికి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఈ మొత్తం కాపాడుతుందని భావిస్తుంటారు. అయితే నిజంగానే రూ.కోటి బీమా మీ కుటుంబ భవిష్యత్తుకు సరిపోతుందా అన్నదే అసలైన ప్రశ్న. దీనికి సమాధానం మీ ప్రస్తుత ఆర్థిక పరిస్థితి, నెలవారీ ఇంటి ఖర్చులు, తీర్చాల్సిన అప్పులు, కుటుంబ బాధ్యతలు, దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలపై ఆధారపడి ఉంటుంది. అందుకే గుడ్డిగా అందరూ తీసుకుంటున్నారని రూ.కోటి పాలసీ వైపు వెళ్లకుండా, మీ కుటుంబ వాస్తవ అవసరాలను ముందుగా అంచనా వేసుకోవాలి.

“వ్యక్తిగత అవసరాలను బేరీజు వేసుకోకుండా పాపులర్ కవరేజీ మొత్తాన్ని ఎంచుకుంటే కుటుంబాలు తక్కువ బీమా రక్షణ ప్రమాదంలో చిక్కుకుంటాయి,” అని హరీపట్టి సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ గుర్లీన్ కౌర్ టిక్కు తన యూట్యూబ్ వీడియోలో వివరించారు.
రెండు కుటుంబాలు.. ఒకే రూ.కోటి పాలసీ.. తేడా ఏంటంటే..
ఈ విషయాన్ని లోతుగా అర్థం చేసుకోవడానికి ఒకే రకమైన రూ.కోటి టర్మ్ ఇన్సూరెన్స్ ఉన్న రెండు వేర్వేరు కుటుంబాలను ఉదాహరణగా తీసుకుందాం. మొదటి కుటుంబంలో పెద్దగా అప్పులు గానీ, రుణ బాధ్యతలు గానీ లేవు. పైగా జీవిత భాగస్వామి కూడా ఉద్యోగం చేస్తూ సంపాదిస్తున్నారు. తగినంత పొదుపు, పెట్టుబడులు ఉండటంతో పాటు పిల్లల చదువులకు కొంతమేర నిధులు ఇప్పటికే సిద్ధంగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆ కుటుంబ పెద్దకు ఏదైనా జరగరానిది జరిగితే, వచ్చే రూ.కోటి బీమా మొత్తం ఆ కుటుంబానికి సరిపోయే అవకాశం ఉంది.
కానీ రెండో కుటుంబాన్ని పరిశీలిస్తే పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. వీరికి ప్రస్తుతం రూ.60 లక్షల హోమ్ లోన్ ఉంది. ఇంట్లో సంపాదించే వ్యక్తి ఒక్కరే కావడంతో జీవిత భాగస్వామి ఆర్థికంగా పూర్తిగా వీరిపైనే ఆధారపడి ఉన్నారు. వీరికి ఇద్దరు చిన్న పిల్లలు కూడా ఉన్నారు. ఒకవేళ ఆ కుటుంబ పెద్దకు అనుకోని ప్రమాదం జరిగితే, ఇన్సూరెన్స్ ద్వారా వచ్చే రూ.కోటిలో రూ.60 లక్షలు నేరుగా బ్యాంకు అప్పు తీర్చడానికే సరిపోతాయి. మిగిలేది కేవలం రూ.40 లక్షలు మాత్రమే. ఆ డబ్బుతో రోజువారీ ఇంటి ఖర్చులు నెట్టుకురావడం, ఇద్దరు పిల్లల ఉన్నత చదువులు, పెళ్లిళ్లు, ఇతర భవిష్యత్ అవసరాలను తీర్చడం ఆ కుటుంబానికి పెను సవాలుగా మారుతుంది. కుటుంబాల ఆకాంక్షలు, బాధ్యతలు వేర్వేరుగా ఉంటాయి కాబట్టి, ఒకరికి సరిపోయిన మొత్తం మరొకరికి ఏమాత్రం చాలదని ఈ ఉదాహరణ స్పష్టం చేస్తోంది.
సరైన టర్మ్ కవరేజీని ఎలా లెక్కించాలి?
సరైన టర్మ్ ఇన్సూరెన్స్ మొత్తాన్ని నిర్ణయించుకోవడానికి ముందుగా ఒక వ్యక్తి తన 'హ్యూమన్ లైఫ్ వాల్యూ' (హెచ్ఎల్వీ) ఎంతో తెలుసుకోవాలి. మీ కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఎంత రక్షణ అవసరమో ఈ హెచ్ఎల్వీ అంచనా వేస్తుంది. ఇందుకోసం భవిష్యత్తులో అయ్యే ఇంటి ఖర్చుల ప్రస్తుత విలువను, పిల్లల చదువులు, పెళ్లిళ్లు వంటి ప్రధాన ఆర్థిక లక్ష్యాలను, ప్రస్తుతం ఉన్న అప్పులను కలపాలి. ఆ తర్వాత ఆ మొత్తం నుంచి మీకు ఇప్పటికే ఉన్న జీవిత బీమా పాలసీలు, అవసరమైనప్పుడు వెంటనే నగదుగా మార్చుకోగల ఆస్తుల విలువను తీసివేయాలి.
{{/usCountry}}సరైన టర్మ్ ఇన్సూరెన్స్ మొత్తాన్ని నిర్ణయించుకోవడానికి ముందుగా ఒక వ్యక్తి తన 'హ్యూమన్ లైఫ్ వాల్యూ' (హెచ్ఎల్వీ) ఎంతో తెలుసుకోవాలి. మీ కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఎంత రక్షణ అవసరమో ఈ హెచ్ఎల్వీ అంచనా వేస్తుంది. ఇందుకోసం భవిష్యత్తులో అయ్యే ఇంటి ఖర్చుల ప్రస్తుత విలువను, పిల్లల చదువులు, పెళ్లిళ్లు వంటి ప్రధాన ఆర్థిక లక్ష్యాలను, ప్రస్తుతం ఉన్న అప్పులను కలపాలి. ఆ తర్వాత ఆ మొత్తం నుంచి మీకు ఇప్పటికే ఉన్న జీవిత బీమా పాలసీలు, అవసరమైనప్పుడు వెంటనే నగదుగా మార్చుకోగల ఆస్తుల విలువను తీసివేయాలి.
{{/usCountry}}దీన్ని సులభంగా అర్థం చేసుకోవడానికి ఆర్థిక నిపుణులు ఒక ప్రాథమిక సూత్రాన్ని సూచిస్తున్నారు:
హెచ్ఎల్వీ = (వార్షిక కుటుంబ ఖర్చులు × 20) + తీర్చాల్సిన అప్పులు + కుటుంబ భవిష్యత్ లక్ష్యాలు - ఇప్పటికే ఉన్న జీవిత బీమా పాలసీలు - ప్రస్తుత ఆస్తుల విలువ.
ఉదాహరణకు, మీ ఇంటి వార్షిక ఖర్చు రూ.6 లక్షలు అనుకుంటే, 20 ఏళ్లకు అది రూ.1.20 కోట్లు అవుతుంది. దీనికి మీకున్న గృహ రుణం, పిల్లల చదువుల ఖర్చు కలిపి, మీ వద్ద ఉన్న ఆస్తులు, పాత పాలసీల విలువను తీసివేస్తే అసలైన బీమా అవసరం ఎంతో స్పష్టంగా తేలుతుంది.
అర్హత నిబంధనలు.. ఆర్థిక సలహాదారు పాత్ర కీలకం
మరోవైపు హ్యూమన్ లైఫ్ వాల్యూ (హెచ్ఎల్వీ), బీమా సంస్థలు ఇచ్చే అర్హత ఎప్పుడూ ఒకేలా ఉండవు. బీమా కంపెనీలు పాలసీదారుడి వార్షిక ఆదాయాన్ని బట్టి గరిష్ట కవరేజీ పరిమితులను విధిస్తాయి. ఈ నిబంధనలు ఒక్కో బీమా సంస్థకు, ఒక్కో పాలసీకి వేర్వేరుగా ఉంటాయి. కేవలం వార్షిక ఆదాయానికి ఒక స్థిర నిష్పత్తి ప్రకారం గానీ, అందరూ తీసుకుంటున్నారని రూ.కోటి రౌండ్ ఫిగర్ అని గానీ పాలసీ ఎంచుకోవడం సరైన పద్ధతి కాదు. దానివల్ల కుటుంబం తక్కువ రక్షణతో ఇబ్బంది పడే ప్రమాదం ఉంది.
మీ తదనంతరం కూడా మీ కుటుంబ సభ్యులు ఎలాంటి ఆర్థిక ఒడిదుడుకులు లేకుండా గౌరవప్రదమైన జీవితాన్ని గడపాలంటే, వారి వాస్తవ అవసరాలు, బాధ్యతలు, లక్ష్యాలకు అద్దం పట్టేలా టర్మ్ కవరేజీ ఉండాలి. ఇలాంటి కీలక ఆర్థిక నిర్ణయాలు తీసుకునే ముందు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా తీసుకోవడం ఎంతో ఉత్తమం. తద్వారా మీ ప్రస్తుత ఆర్థిక వాస్తవాలకు, దీర్ఘకాలిక ఆశయాలకు అనుగుణంగా సరైన టర్మ్ ఇన్సూరెన్స్ ప్రణాళికను రూపొందించుకోవచ్చు.
(గమనిక- ఇది సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ఇన్సూరెన్స్ తీసుకునేందుకు అడ్వైజర్‌ని సంప్రదించడం శ్రేయస్కరం.)
ABOUT THE AUTHOR
శరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.