ఐటీఆర్ డెడ్‌లైన్ పొడిగింపు కష్టమే.. ఈ 5 కారణాలు తెలుసుకోండి

అసెస్‌మెంట్ ఇయర్ (AY) 2026-27కు సంబంధించి ఆదాయపు పన్ను రిటర్నుల (ITR) దాఖలు గడువు పొడిగింపు ఉండకపోవచ్చు. ఐటీ ఈ-ఫైలింగ్ వ్యవస్థ స్థిరంగా పనిచేస్తుండటం, రికార్డు స్థాయిలో ఫైలింగ్స్ జరుగుతుండటమే ఇందుకు కారణం. ఆ 5 ముఖ్యమైన కారణాలు, పన్ను చెల్లింపుదారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇక్కడ చూద్దాం.

Published on: Jun 22, 2026, 15:58:47 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గతేడాది ఆదాయపు పన్ను శాఖ పలు కీలక సవరణల నేపథ్యంలో ఐటీఆర్ దాఖలు గడువును రెండుసార్లు పొడిగించింది. దీంతో ఈ ఏడాది (2026) కూడా పన్ను చెల్లింపుదారులు, ఆడిటర్లు, కార్పొరేట్ సంస్థలు గడువు పెరుగుతుందని ఆశిస్తున్నారు. అయితే, ఈసారి అలాంటి ఉపశమనం లభిస్తుందని ఆశలు పెట్టుకోకపోవడమే మంచిదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అసెస్‌మెంట్ ఇయర్ (AY) 2026-27కు సంబంధించి ఆదాయపు పన్ను రిటర్నుల (ITR) దాఖలు గడువు పొడిగింపు ఉండకపోవచ్చు.
అసెస్‌మెంట్ ఇయర్ (AY) 2026-27కు సంబంధించి ఆదాయపు పన్ను రిటర్నుల (ITR) దాఖలు గడువు పొడిగింపు ఉండకపోవచ్చు.

ఇందుకు ప్రధాన కారణం.. ఈసారి ఈ-ఫైలింగ్ పోర్టల్ చాలా స్థిరంగా, ముందస్తు అంచనాలకు తగ్గట్టుగా పనిచేస్తోంది. ఫైలింగ్ ఫీచర్లు, యుటిలిటీస్ అన్నీ సజావుగా అందుబాటులో ఉన్నాయి. రిటర్నుల దాఖలు కూడా ఊపందుకుంది. ఈ ఏడాది ఐటీ రిటర్నుల దాఖలుకు గడువు జులై 31 వరకు ఉంది.

ఈ నేపథ్యంలో గడువు పొడిగింపు ఎందుకు సాధ్యం కాకపోవచ్చో ఆ ఐదు కారణాలు పరిశీలిద్దాం.

1. కొందరికి ఇప్పటికే అదనపు సమయం

నాన్-ఆడిట్ పన్ను చెల్లింపుదారులు, సంస్థల భాగస్వాములు, నిర్దిష్ట నిపుణుల కోసం ఆదాయపు పన్ను శాఖ గడువును ఇప్పటికే 2026 ఆగస్టు 31 వరకు పొడిగించింది. ఈ మార్పు వల్ల అందరికీ సాధారణంగా గడువు పెంచాల్సిన అవసరం చాలా వరకు తగ్గింది.

2. ముందే విడుదలైన ఐటీఆర్ యుటిలిటీస్

పన్ను చెల్లింపుదారులలో అత్యధికులు ఉపయోగించే ఐటీఆర్-1, ఐటీఆర్-2, ఐటీఆర్-3, ఐటీఆర్-4 యుటిలిటీస్ ఈసారి ముందే అందుబాటులోకి వచ్చాయి. మిగిలిన కొద్దిమందికి అవసరమైన ఫారాల విడుదల ఆలస్యమైనా, అది అందరికీ గడువు పెంచడానికి బలమైన కారణం కాబోదు. గడువు పొడిగించాలంటే ఐటీ శాఖకు గట్టి కారణం ఉండాలి.

3. సాంకేతిక అంతరాయాలు లేకపోవడం

గతేడాది 2024 బడ్జెట్ సవరణల మార్పుల వల్ల ఐటీ పోర్టల్‌లో కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దాంతో గడువు పెంచాల్సి వచ్చింది. కానీ ఈసారి ఫైలింగ్ సీజన్ ఎటువంటి పెద్ద ఇబ్బందులు లేకుండా సాఫీగా సాగుతోంది. పన్ను చెల్లింపుదారుల నుంచి పెద్దగా ఫిర్యాదులు లేనప్పుడు గడువు పెంచే యోచన ఐటీ శాఖ చేయకపోవచ్చు.

4. స్థిరపడిన పన్ను నిబంధనలు

గత కొన్ని ఏళ్లతో పోలిస్తే పన్ను నిబంధనలు ఈసారి చాలా స్పష్టంగా ఉన్నాయి. ఈక్విటీలపై షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ (STCG), లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ (LTCG) పన్నుల పెంపుదల, ఇండెక్సేషన్ రూల్స్ వంటి మార్పులపై పన్ను చెల్లింపుదారులకు, ఐటీ శాఖకు పూర్తి అవగాహన వచ్చింది. దీంతో పెండింగ్ రిటర్నులను సకాలంలో దాఖలు చేయడానికి ఇరువర్గాలూ సిద్ధంగా ఉన్నాయి.

5. జోరందుకున్న ఐటీఆర్ ఫైలింగ్స్

2026 జూన్ 21 నాటికే దేశంలో 56 లక్షల కు పైగా ఐటీఆర్లు దాఖలు కాగా, అందులో 53 లక్షలకు కు పైగా వెరిఫికేషన్ కూడా పూర్తయింది. ఈ వేగం చూస్తుంటే పన్ను నియమపాలన సజావుగా సాగుతోందని అర్థమవుతోంది. సాధారణ ప్రజల్లో అవగాహన పెరగడం వల్లే రిటర్నులు వేగంగా దాఖలవుతున్నాయి.

ఇంకా ఐటీఆర్ ఫైల్ చేయలేదా? ఈ 5 పనులు వెంటనే చేయండి

ఆఖరి నిమిషం వరకు వేచి చూడకుండా పన్ను చెల్లింపుదారులు ఈ జాగ్రత్తలు తీసుకోవడం అవసరం.

పత్రాలను సిద్ధంగా ఉంచుకోండి: ఐటీఆర్ ఫైలింగ్ ప్రారంభించే ముందే ఫారమ్ 16, ఇంటరెస్ట్ సర్టిఫికెట్లు, క్యాపిటల్ గెయిన్స్ స్టేట్‌మెంట్లు, ఇతర ఆదాయ వనరుల పత్రాలన్నింటినీ ఒకచోట చేర్చండి. అవసరమైతే ట్యాక్స్ ప్రొఫెషనల్స్ సాయం తీసుకోండి.

AIS, ఫారమ్ 26AS వివరాలను సరిపోల్చండి: మీ ఐటీఆర్ లో చూపే ఆదాయం, టీడీెస్ (TDS) వివరాలు.. యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్‌మెంట్ (AIS), ఫారమ్ 26AS లోని సమాచారంతో ఖచ్చితంగా సరిపోలాలి. ఈ వివరాలలో తేడాలు ఉంటే ఐటీ శాఖ నుంచి నోటీసులు వచ్చే ప్రమాదం ఉంది.

పన్ను విధానాన్ని (Tax Regime) పునఃపరిశీలించండి: గతేడాది ఎంచుకున్న పన్ను విధానాన్నే గుడ్డిగా ఫాలో అవ్వకండి. పాత, కొత్త పన్ను విధానాలలో దేనివల్ల ఎక్కువ లాభం ఉందో లెక్కలు వేసుకోండి. సర్టిఫైడ్ ట్యాక్స్ ప్లానర్ సలహాతో మీకు సరిపోయే విధానాన్ని ఎంచుకోండి.

ముందే ఫైల్ చేసి ఒత్తిడి తగ్గించుకోండి: గడువు ముగిసే ఆఖరి వారాల్లో పోర్టల్‌పై ట్రాఫిక్ విపరీతంగా పెరుగుతుంది. దీనివల్ల వెబ్‌సైట్ నెమ్మదించడం, సాంకేతిక లోపాలు తలెత్తడం సహజం. ఆ ఒత్తిడిని అధిగమించడానికి ముందే ఐటీఆర్ దాఖలు చేయడం ఉత్తమం.

ఈ-వెరిఫికేషన్ పూర్తి చేయండి: ఐటీఆర్ దాఖలు చేసినంత మాత్రాన ప్రక్రియ పూర్తి కాదు. దానిని ఈ-వెరిఫై చేసినప్పుడే ఆ రిటర్న్ చెల్లుబాటు అవుతుంది. ఈ-వెరిఫికేషన్ ముందే పూర్తి చేస్తే రీఫండ్ కూడా త్వరగా వచ్చే అవకాశం ఉంటుంది.

ప్రస్తుత పరిస్థితులు, ఐటీ పోర్టల్ పనితీరును బట్టి చూస్తే గడువు పొడిగింపుపై ఆశలు పెట్టుకోకుండా ప్రస్తుత గడువు లోపలే ఐటీఆర్ దాఖలు చేయడం పన్ను చెల్లింపుదారులకు శ్రేయస్కరం. ఐటీఆర్ ఫైలింగ్ కోసం ఆదాయపు పన్ను శాఖ అధికారిక వెబ్‌సైట్ https://www.incometax.gov.in/iec/foportal/ ను సందర్శించవచ్చు.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

ప్రశ్న 1: AY 2026-27 ఐటీఆర్ గడువు పొడిగించే అవకాశం ఉందా?

జవాబు: ప్రస్తుతానికి ఐటీ పోర్టల్ స్థిరంగా పనిచేస్తుండటం, భారీగా ఫైలింగ్స్ నమోదు అవుతుండటంతో ఈ ఏడాది గడువు పొడిగించే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి.

ప్రశ్న 2: నాన్-ఆడిట్ పన్ను చెల్లింపుదారులకు గడువు ఎప్పటి వరకు ఉంది?

జవాబు: కొంతమంది నాన్-ఆడిట్ పన్ను చెల్లింపుదారులు, సంస్థల భాగస్వాములకు గడువును ఇప్పటికే 2026 ఆగస్టు 31 వరకు పొడిగించారు.

ప్రశ్న 3: ఐటీఆర్ దాఖలు చేసిన తర్వాత ఈ-వెరిఫికేషన్ చేయడం తప్పనిసరా?

జవాబు: అవును, ఐటీఆర్ ఫైల్ చేసిన తర్వాత ఈ-వెరిఫికేషన్ పూర్తి చేస్తేనే ఆ రిటర్న్ చెల్లుబాటు అవుతుంది. లేదంటే మీ ఫైలింగ్ తిరస్కరణకు గురయ్యే ప్రమాదం ఉంది.

  • Praveen Kumar Lenkala
    ABOUT THE AUTHOR
    Praveen Kumar Lenkala

    ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More