ITR Filing : ఐటీఆర్​ ఫైలింగ్​లో కొత్త రూల్స్​- ఇక ఫామ్​ 16 ఉండదు! ఏప్రిల్​ 1 నుంచే అమలు..

ITR Filing Form 16 : భారతదేశంలో ఆదాయపు పన్ను దాఖలు విధానం ఏప్రిల్ 1, 2026 నుంచి సమూలంగా మారబోతోంది! కొత్త 'ఆదాయపు పన్ను నిబంధనలు-2026' అమల్లోకి రానుండటంతో, ఉద్యోగులకు ఇచ్చే ఫామ్ 16 రద్దు కానుంది. దాని స్థానంలో మరింత పకడ్బందీగా ఉండే 'ఫామ్ 130' రాబోతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

Published on: Mar 25, 2026, 14:40:10 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

భారతదేశంలో పన్ను చెల్లింపుదారులకు ఏప్రిల్ 1, 2026 ఒక చారిత్రక మార్పుగా నిలవనుంది. కొత్త ఆదాయపు పన్ను నిబంధనలు, 2026 అమల్లోకి రావడంతో ఐటీఆర్ ఫైలింగ్ ప్రక్రియ పూర్తిగా రూపుమార్చుకోనుంది. ఐటీఆర్ ఫారమ్‌లు, ఫామ్ 16 స్థానంలో కొత్త 'ఫామ్ 130' ప్రవేశపెట్టడం, మరింత స్వయంచాలక ఫైలింగ్ సిస్టమ్ ద్వారా పన్నుల లెక్కింపులో ఖచ్చితత్వాన్ని పెంచడమే ఈ మార్పుల ప్రధాన ఉద్దేశ్యం.

ఐటీఆర్​ ఫైలింగ్​పై బిగ్​ అప్డేట్​..
ఐటీఆర్​ ఫైలింగ్​పై బిగ్​ అప్డేట్​..

ఫామ్ 16 స్థానంలో ఫామ్ 130: దీని ప్రత్యేకత ఏంటి?

కొత్త పన్ను సైకిల్​లో అత్యంత కీలకమైన మార్పు 'ఫామ్ 130' పరిచయం. ఇప్పటివరకు యజమానులు తమ ఉద్యోగులకు ఇచ్చే ఫామ్ 16 ఇకపై ఉండదు. దీని స్థానంలో వచ్చే ఫామ్ 130 కూడా టీడీఎస్ సర్టిఫికేట్‌గానే పనిచేస్తుంది. కానీ ఇది మరింత వివరణాత్మకమైన, నిర్మాణాత్మకమైన ఫార్మాట్‌లో ఉంటుంది.

ఫామ్ 130 అంటే ఏంటి?: ఇది యజమాని తన జీతం పొందే ఉద్యోగులకు, పెన్షనర్లకు ఇచ్చే వార్షిక టీడీఎస్ సర్టిఫికేట్. ఇందులో సంపాదించిన జీతం, మినహాయించిన పన్ను (టీడీఎస్​), డిపాజిట్ చేసిన పన్ను, వర్తించే మినహాయింపుల పూర్తి సారాంశం ఉంటుంది.

ఆధార పత్రం: మీ జీతం నుంచి పన్ను మినహాయించి ప్రభుత్వం వద్ద డిపాజిట్ చేశారనడానికి ఇది అధికారిక నిరూపణ. అలాగే, ఆదాయపు పన్ను చట్టం 2025 లోని సెక్షన్ 402(39) ప్రకారం నిర్దేశించిన సీనియర్ సిటిజన్లు పొందే వడ్డీ ఆదాయాన్ని కూడా ఇది కవర్ చేస్తుంది.

జనరేషన్ విధానం: ఫామ్ 130ని మాన్యువల్‌గా జారీ చేయడానికి వీల్లేదు. దీనిని కేవలం TRACES పోర్టల్ ద్వారా మాత్రమే జనరేట్ చేయాలి. టీడీఎస్ రిటర్నులు దాఖలై, ప్రాసెస్ అయిన తర్వాతే ఇది అందుబాటులోకి వస్తుంది. ఇందులో జీతం బ్రేకప్, టీడీఎస్/టీసీఎస్ వివరాలు వంటి కీలక అంశాలు ఉంటాయి.

ఐటీఆర్ ఫారమ్‌లలో మరిన్ని వివరాలు..

కొత్త నిబంధనల ప్రకారం, ఐటీఆర్ ఫారమ్‌లు 'ఆదాయపు పన్ను చట్టం, 2025'కు అనుగుణంగా మార్చబడ్డాయి.

పన్ను చెల్లింపుదారులు తమ ఆదాయం, మినహాయింపులను మరింత పకడ్బందీగా నివేదించాల్సి ఉంటుంది.

మూలధన లాభాలను (క్యాపిటల్​ గెయిన్స్​) షార్ట్-టర్మ్, లాంగ్-టర్మ్ కేటగిరీలుగా స్పష్టంగా వర్గీకరించాలి.

విదేశీ ఆస్తులు లేదా సంక్లిష్టమైన ఆర్థిక లావాదేవీలు ఉన్నవారు అదనపు వివరాలను వెల్లడించాల్సి ఉంటుంది.

ఆటోమేటెడ్ ఫైలింగ్ వైపు అడుగులు..

కొత్త వ్యవస్థలో 'ప్రీ-ఫిల్డ్' (ముందే నింపిన) డేటా, ఆటోమేటెడ్ చెక్స్‌పై ఎక్కువ ఆధారపడతారు. దీనివల్ల పొరపాట్లు తగ్గుతాయి, పన్ను చెల్లింపుదారులు సమర్పించిన వివరాలకు, ప్రభుత్వ రికార్డులకు మధ్య తేడాలు ఉంటే వెంటనే గుర్తించవచ్చు. సాధారణ జీతం పొందే వారికి ఫైలింగ్ సులభం కావచ్చు, కానీ ఇన్వెస్టర్లు, అధిక ఆదాయం ఉన్నవారు మరిన్ని వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది.

రీఫండ్‌లు, పన్ను చెల్లింపుదారులపై ప్రభావం..

ఐటీఆర్​ రీఫండ్ సమయపాలనలో అధికారికంగా ఎటువంటి మార్పు లేదు. అయితే, వివరాల్లో ఎటువంటి వ్యత్యాసాలు లేకపోతే రీఫండ్‌లు మరింత వేగంగా ప్రాసెస్ అవుతాయని నిపుణులు భావిస్తున్నారు. తప్పులు ఉంటే మాత్రం ఆలస్యం కావచ్చు. వేతన జీవులు, ఇన్వెస్టర్లు, ఎన్నారైలు, సీనియర్ సిటిజన్లపై ఈ మార్పుల ప్రభావం వేర్వేరుగా ఉంటుంది.

ఈ కొత్త పన్ను సైకిల్​ని ఆదాయ రిపోర్టింగ్‌ను మరింత పారదర్శకంగా, ప్రమాణీకరించడానికి రూపొందించారు. పన్ను చెల్లింపుదారులు తమ జీతం, పెట్టుబడులు, మినహాయింపుల వివరాలను ఖచ్చితంగా ఉంచుకోవడం సజావుగా ఫైలింగ్ పూర్తి చేయడానికి, సకాలంలో రీఫండ్ పొందడానికి ఎంతో అవసరం.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More