Jio IPO : జియో ఐపీఓ అలాట్ అవ్వకపోతే డబ్బులు ఎప్పుడు పడతాయి? అలాట్ అయితే షేర్లు ఎప్పుడు వస్తాయి?
జియో ఐపీఓ అలాట్మెంట్ ప్రక్రియ నేడు జరగనుంది. మరి ఐపీఓ అలాట్ అయితే జియో షేర్లు ఎప్పుడు డీమ్యాట్‌లో కనిపిస్తాయి? ఒకవేళ అలాట్ అవ్వకపోతే డబ్బులు ఎప్పుడు వెనక్కి వస్తాయి? జియో లిస్టింగ్ డేట్, జీఎంపీ వివరాలేంటి? ఇక్కడ తెలుసుకోండి..
భారతీయ స్టాక్ మార్కెట్ చరిత్రలోనే అత్యంత ఆసక్తికరమైన ఐపీఓల్లో ఒకటిగా నిలిచిన జియో ప్లాట్‌ఫామ్స్‌కు రికార్డు స్థాయి స్పందన లభించిన విషయం తెలిసిందే. ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ మద్దతు ఉన్న ఈ మెగా ఐపీఓ ఏకంగా 22 రెట్లకు పైగా సబ్‌స్క్రైబ్ అయి దలాల్ స్ట్రీట్‌లో కొత్త చరిత్ర సృష్టించింది. దేశవ్యాప్తంగా లక్షలాది మంది రీటైల్ ఇన్వెస్టర్లు ఈ ఐపీఓ కోసం పోటీపడ్డారు. ఇక ఈరోజు, సోమవారం ఈ జియో ఐపీఓ అలాట్మెంట్ ప్రక్రియ జరగనుంది. జియో ఐపీఓకు విపరీతమైన పోటీ నెలకొన్న నేపథ్యంలో ఇన్వెస్టర్లకు ఎన్ని లాట్లు దక్కే అవకాశం ఉంది? షేర్లు రాకపోతే డబ్బులు ఏమవుతాయి? లిస్టింగ్ రోజు ఎలాంటి లాభాలు రావచ్చు? అసలు లిస్టింగ్ ఎప్పుడు? వంటి వివరాలను ఇక్కడ డీటైల్డ్‌గా తెలుసుకోండి..

జియో ఐపీఓ అలాట్మెంట్- దక్కితే ఏంటి? దక్కకపోతే ఏంటి?
సబ్‌స్క్రిప్షన్ రికార్డు స్థాయిలో జరగడంతో, దరఖాస్తు చేసిన ప్రతి ఒక్కరికీ షేర్లు దక్కడం దాదాపు అసాధ్యం! ఇక్కడ కంపెనీ రూపొందించిన కేటాయింపు విధానాల ప్రకారం మూడు రకాల పరిస్థితులు తలెత్తుతాయి:
1: ఒక్క లాట్ కూడా దక్కకపోతే
ఇష్యూ భారీగా ఓవర్‌సబ్‌స్క్రైబ్ అయినందున చాలామంది ఇన్వెస్టర్లకు జియో ఐపీఓకు చెందిన ఒక్క లాట్ కూడా అలాట్ అవ్వకపోవచ్చు. ఒకవేళ మీకు ఏ లాట్ కూడా అలాట్ అవ్వకపోతే, మీ బ్యాంక్ ఖాతాలో యూపీఐ లేదా ఆస్బాద్వారా బ్లాక్ అయిన మొత్తం సొమ్ము పూర్తిగా అన్‌బ్లాక్ అవుతుంది. మీ ఖాతా నుంచి ఒక్క రూపాయి కూడా కట్ కాదు.
అయితే దీనికి ఒకరోజు సమయం పడుతుంది. అంటే.. అక్టోబర్ 27 నుంచి డబ్బుల రీఫండ్ ప్రాసెస్ మొదలవుతుంది.
2: ఒక లాట్ మాత్రమే కేటాయిస్తే
ఒక లాట్ దక్కితే, సంబంధిత మొత్తం మాత్రమే మీ బ్యాంక్ ఖాతా నుంచి డెబిట్ అవుతుంది. జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓ ప్రైస్ బ్యాండ్ రూ. 1,065 నుంచి రూ. 1,119గా నిర్ణయించారు. ఒక లాట్‌లో 12 షేర్లు ఉంటాయి. గరిష్ట ధర ఆధారంగా ఒక లాట్ కోసం రూ. 13,428 బ్లాక్ అయి ఉంటాయి. మీకు ఒక్క లాట్ వస్తే, సరిగ్గా రూ. 13,428 మాత్రమే కట్ అయి, మిగిలిన సొమ్ము (అదనంగా ఏమైనా అప్లై చేసి ఉంటే) అన్‌బ్లాక్ అవుతుంది.
జియో ఐపీఓ అలాట్మెంట్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలో తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
3: మల్టిపుల్ లాట్లు దక్కే అవకాశం ఉందా?
రీటైల్ విభాగంలో ఇన్వెస్టర్లు గరిష్టంగా 14 లాట్ల వరకు (రూ. 1,87,992) దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉంది. అలాగే ఆర్‌ఐఎల్ షేర్‌హోల్డర్ కోటా, ఎంప్లాయీ కోటా కింద కూడా అప్లై చేసి ఉండవచ్చు. అయితే, ఇష్యూ 22 రెట్లకు పైగా సబ్‌స్క్రైబ్ అవ్వడంతో రీటైల్ కేటగిరీలో డ్రా పద్ధతిన లక్కీ ఇన్వెస్టర్లకు ఒక లాట్ మాత్రమే దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మల్టిపుల్ లాట్లు దక్కడం చాలా అరుదుగా జరుగుతుంది.
అలా జరిగితే మాత్రం సదరు ఇన్వెస్టర్‌కు పండగే!
ఏదైమానా ఐపీఓ అలాట్ అయితే మాత్రం.. జియో షేర్లు మంగళవారం నాటికి డీమ్యాట్ అకౌంట్లో కనిపిస్తాయి.
జియో ఐపీఓ జీఎంపీ, లిస్టింగ్ అంచనా..
అక్టోబర్ 26 ఉదయం నాటి సమాచారం ప్రకారం గ్రే మార్కెట్‌లో జియో ప్లాట్‌ఫామ్స్ షేరు రూ. 247 వద్ద ట్రేడ్ అవుతోంది. ఐపీఓ గరిష్ట ధరల శ్రేణి రూ.1,119 కాగా, జీఎంపీ అంచనాల ప్రకారం స్టాక్ దాదాపు రూ.1,366 వద్ద లిస్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇది ఇష్యూ ధర కంటే సుమారు 22.07 శాతం లాభాన్ని సూచిస్తోంది.
జియో ఐపీఓ లిస్టింగ్ తేదీ, టైమింగ్స్..
జియో ప్లాట్‌ఫామ్స్ షేర్లు అక్టోబర్ 28, 2026 (బుధవారం) ఉదయం 10 గంటలకు స్టాక్ ఎక్స్ఛేంజీల్లో ట్రేడింగ్‌కు అందుబాటులోకి రానున్నాయి.
ఉదయం 9:00 - 9:45: స్పెషల్ ప్రీ-ఓపెన్ సెషన్ (ఆర్డర్లు నమోదు చేయడం, సవరించడం)
ఉదయం 9:45 - 9:55: ఆర్డర్ మ్యాచింగ్, తొలి లిస్టింగ్ ధర నిర్ణయం
ఉదయం 10:00: సాధారణ ట్రేడింగ్ ప్రారంభం
రూ. 10 లక్షల కోట్లకు చేరనున్న మార్కెట్ క్యాప్!
ఈ ఐపీఓ ద్వారా కంపెనీ రూ. 30,213 కోట్ల విలువైన 27 కోట్ల కొత్త షేర్లను జారీ చేస్తోంది. ఐపీఓ అనంతరం జియో ప్లాట్‌ఫామ్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ దాదాపు రూ. 10 లక్షల కోట్లకు చేరుకునే అవకాశం ఉంది. దీని ద్వారా భారత కార్పొరేట్ చరిత్రలోనే అత్యధిక మార్కెట్ విలువ కలిగిన దిగ్గజ కంపెనీల జాబితాలో జియో నేరుగా స్థానం సంపాదించనుంది!
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


