...
...
Next Story

JSW Motors : జేఎస్‌డబ్ల్యూ కొత్త ఎస్‌యూవీ 'కాంబాట్'.. 1,100 కి.మీ రేంజ్​తో! ఇంకొన్ని రోజుల్లో లాంచ్

భారత ప్యాసింజర్ వాహన విపణిలోకి జేఎస్‌డబ్ల్యూ మోటార్స్ సొంత బ్రాండ్‌తో అడుగుపెడుతోంది. డిసెంబర్ 4న విడుదల కానున్న తొలి ఎస్‌యూవీ 'కాంబాట్'లో ప్లగ్-ఇన్ హైబ్రిడ్ ఇంజిన్, 1,100 కిలోమీటర్ల భారీ రేంజ్ ఉండనున్నాయి. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి..

Published on: Nov 17, 2026, 05:30:02 IST
Advertisement

భారత ఆటోమొబైల్ రంగంలో మరో కొత్త అధ్యాయం మొదలుకాబోతోంది. ఉక్కు, ఇంధన రంగాల్లో దిగ్గజంగా ఉన్న జేఎస్‌డబ్ల్యూ గ్రూప్.. ఇప్పుడు 'జేఎస్‌డబ్ల్యూ మోటార్స్' పేరుతో స్వతంత్ర ప్యాసింజర్ వాహన బ్రాండ్‌గా దేశీయ మార్కెట్లోకి అడుగుపెడుతోంది. డిసెంబర్ 4న ఈ సంస్థ తన మొట్టమొదటి ఎస్‌యూవీని భారత్‌లో ఆవిష్కరించనుంది. అంతర్జాతీయ మార్కెట్లో ప్రసిద్ధి చెందిన ‘జెటూర్ టీ2’ ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ కారుకు 'కాంబాట్' అనే పేరు పెట్టనున్నట్లు సమాచారం. ఐదుగురు ప్రయాణించే వీలున్న ఈ ప్లగ్-ఇన్ హైబ్రిడ్ ఎస్‌యూవీని మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో ఉన్న జేఎస్‌డబ్ల్యూ మోటార్స్ ప్లాంట్‌లో ఉత్పత్తి చేయనున్నారు.

జేఎస్‌డబ్ల్యూ కాంబాట్: పవర్, రేంజ్..

డిసెంబర్ 4న జేఎస్‌డబ్ల్యూ కొత్త ఎస్‌యూవీ 'కాంబాట్'.. 1,100 కి.మీ రేంజ్!
డిసెంబర్ 4న జేఎస్‌డబ్ల్యూ కొత్త ఎస్‌యూవీ 'కాంబాట్'.. 1,100 కి.మీ రేంజ్!

భారత మార్కెట్లోకి రానున్న జేఎస్‌డబ్ల్యూ కాంబాట్ ఎస్‌యూవీలో అత్యంత శక్తివంతమైన ప్లగ్-ఇన్ హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌ను అందిస్తున్నారు. ఇందులో 1.5-లీటర్ డైరెక్ట్-ఇంజెక్షన్ టర్బోచార్జ్‌డ్ పెట్రోల్ ఇంజిన్‌తో పాటు 18.4-కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్, ముందు చక్రాలకు శక్తినిచ్చే రెండు ఎలక్ట్రిక్ మోటార్లు ఉంటాయి. ఈ వ్యవస్థకు త్రీ-స్పీడ్ డెడికేటెడ్ హైబ్రిడ్ ట్రాన్స్‌మిషన్ (డీహెచ్​టీ) గేర్‌బాక్స్‌ను జతచేశారు. పెట్రోల్ ఇంజిన్, ఎలక్ట్రిక్ మోటార్లు కలిసి ఏకంగా 360 హెచ్‌పీ శక్తిని, 610 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తాయి.

మైలేజీ, రేంజ్ విషయంలోనూ ఈ ఎస్‌యూవీ అంచనాలను పెంచుతోంది. ఎన్‌ఈడీసీ పరీక్షా ప్రమాణాల ప్రకారం, ఒక్కసారి బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేస్తే కేవలం ఎలక్ట్రిక్ మోడ్‌లోనే 90 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. ఇక పెట్రోల్ ట్యాంక్ నింపి, బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేస్తే ఏకంగా 1,100 కిలోమీటర్ల సుదీర్ఘ రేంజ్ అందిస్తుందని అంచనా. అంతర్జాతీయ మార్కెట్లో జెటూర్ టీ2 మోడల్ వివిధ రకాల ప్లగ్-ఇన్ హైబ్రిడ్ ఇంజిన్ ఆప్షన్లతో అందుబాటులో ఉంది.

ఆకట్టుకునే బాక్సీ డిజైన్.. బయటి హంగులివే!

జెటూర్ టీ2 సొంతం చేసుకున్న దర్పమైన బాక్సీ ఆకృతిని కొనసాగిస్తూనే, భారత రోడ్లకు తగ్గట్టుగా జేఎస్‌డబ్ల్యూ కొన్ని మార్పులు చేస్తోంది. ఇటీవల రోడ్లపై పరీక్షలు నిర్వహిస్తుండగా కనిపించిన స్పై చిత్రాలను బట్టి, ఈ ఎస్‌యూవీలో కొత్త తరహా హెడ్‌ల్యాంప్‌లు, మార్పులు చేసిన ముందు వెనుక బంపర్లు రానున్నాయి.

డిసెంబర్ 4న ఆవిష్కరించనున్న జేఎస్‌డబ్ల్యూ కాంబాట్ లోపలి భాగం అత్యాధునిక సాంకేతికతతో నిండి ఉంటుంది. నిటారుగా ఉండే డ్యాష్‌బోర్డ్ లేఅవుట్‌పై 15.6-అంగుళాల భారీ ఇన్ఫోటైన్‌మెంట్ టచ్‌స్క్రీన్, 10.25-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ అమర్చారు. 4 స్పోక్‌ స్టీరింగ్ వీల్‌పై జేఎస్‌డబ్ల్యూ మోటార్స్ లోగో ఉండనుంది. అంతర్జాతీయ జెటూర్ టీ2 మోడల్‌లో ఉన్నట్లుగానే ఆరు రకాలుగా ఎలక్ట్రికల్‌గా సర్దుబాటు చేసుకునే డ్రైవర్ సీటు, నాలుగు రకాలుగా సర్దుబాటు చేసుకునే ముందు ప్యాసింజర్ సీటు ఇందులో రానున్నాయి. ముందు సీట్లకు వెంటిలేషన్, మెమరీ ఫంక్షన్లతో పాటు అద్భుతమైన ఆడియో అనుభూతి కోసం 12-స్పీకర్ల సోనీ సౌండ్ సిస్టమ్‌ను అందిస్తున్నారు.

భద్రతా పరంగానూ ఈ కారులో రాజీ పడలేదు. ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, కారు చుట్టూ పరిసరాలతో పాటు కారు అడుగు భాగాన్ని కూడా స్పష్టంగా చూపించే 540-డిగ్రీ కెమెరా వ్యవస్థ, లెవల్-2 అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (అడాస్) ఇందులో ఉన్నాయి. గుంతల రోడ్లు, ఆఫ్-రోడింగ్ సమయాల్లో 540-డిగ్రీ కెమెరా డ్రైవర్లకు ఎంతో ఉపయోగపడుతుంది.

భారత మోడల్‌లోనూ ఇవే ఫీచర్లు రానున్నప్పటికీ, డిసెంబర్ 4న జరిగే అధికారిక ఆవిష్కరణ కార్యక్రమంలో తుది జాబితాపై పూర్తి స్పష్టత రానుంది. సాంప్రదాయ పెట్రోల్, డీజిల్ ఎస్‌యూవీలకు భిన్నంగా శక్తివంతమైన ప్లగ్-ఇన్ హైబ్రిడ్ పరిజ్ఞానంతో వస్తున్న జేఎస్‌డబ్ల్యూ కాంబాట్, భారత ప్రీమియం ఎస్‌యూవీ విభాగంలో గట్టి పోటీని ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks