...
...
Next Story

Kabul Hospital attack : అఫ్గానిస్థాన్​ ఆసుపత్రిపై దాడులు- 400 మంది మృతి! పాక్​ పనేనా?

Afghanistan Pakistan war : అఫ్గానిస్థాన్​, పాకిస్థాన్ మధ్య సరిహద్దు వివాదం చిలికి చిలికి గాలివానలా మారింది. తాజాగా కాబుల్‌లోని ఒక డ్రగ్ ట్రీట్‌మెంట్ ఆసుపత్రిపై జరిగిన దాడిలో 400మంది మరణించారు. ఇది పాక్​ పనే అని తాలిబన్లు చెబుతున్నారు. తాను పౌరులపై దాడి చేయ్యమని పాకిస్థాన్​ అంటోంది.

Published on: Mar 17, 2026, 05:26:18 IST
Advertisement

అఫ్గానిస్థాన్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్నాయి. కాబుల్‌లోని మాదకద్రవ్య విముక్తి కేంద్రం (ఆసుపత్రి) లక్ష్యంగా పాకిస్థాన్ సైన్యం సోమవారం వైమానిక దాడులకు తెగబడిందని అఫ్ఘాన్ ప్రభుత్వం తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ భీకర దాడిలో 400 మందికి పైగా మరణించారని, 200మందికిపైగా ప్రజలు గాయపడ్డారని తాలిబన్లు తెలిపారు. ఇది ఇటీవలి కాలంలో జరిగిన అత్యంత ఘోరమైన సంఘటన అని పేర్కొన్నారు.

కాబుల్​ ఆసుపత్రిపై దాడులు- తాలిబన్లు ఏం చెప్పారంటే..

కాబుల్​ ఆసుపత్రి దగ్గర పరిస్థితి.. (AFP)
కాబుల్​ ఆసుపత్రి దగ్గర పరిస్థితి.. (AFP)

ఈ దాడిపై అఫ్గానిస్థాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి షరాఫత్ జమాన్ స్థానిక మీడియాతో మాట్లాడుతూ సంచలన విషయాలు వెల్లడించారు.

"పాక్ జరిపిన దాడుల్లో ఆసుపత్రి పూర్తిగా నేలమట్టమైంది. 200 మందికి (మృతుల సంఖ్యను సవరించకముందు) పైగా అమాయకులు ప్రాణాలు కోల్పోయారు," అని ఆయన ధృవీకరించారు. ఆసుపత్రిలోని అన్ని విభాగాలు ధ్వంసమయ్యాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

అఫ్గానిస్థాన్ ప్రభుత్వ ప్రతినిధి జబివుల్లా ముజాహిద్ సైతం ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. ఇది తమ దేశ సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించడమేనని మండిపడ్డారు.

"మరణించిన వారిలో మెజారిటీ బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులే," అని ఆయన ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ధ్వంసమైన భవన శిథిలాల నుంచి ఎగిసిపడుతున్న మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది శ్రమిస్తున్న దృశ్యాలు స్థానిక టీవీల్లో కనిపిస్తున్నాయి.

పౌర ప్రాంతాలపై దాడి చేయలేదు: పాకిస్థాన్ వివరణ..

కాబుల్​ ఆసుపత్రిపై పాకిస్థాన్​ దాడి చేసిందని అఫ్గానిస్థాన్ చేస్తున్న ఆరోపణలను పాక్​ ప్రభుత్వం తిరస్కరించింది. తాము కేవలం ఉగ్రవాద మౌలిక సదుపాయాలను మాత్రమే లక్ష్యం చేసుకున్నామని, పౌర నివాసాలపై దాడులు చేయలేదని స్పష్టం చేసింది. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రతినిధి మొషారఫ్ జైదీ మాట్లాడుతూ.. ఆసుపత్రిపై దాడి మా పనే అన్న వార్తల్లో నిజం లేదన్నారు.

వైమానిక దాడులకు కొన్ని గంటల ముందే సరిహద్దుల్లో ఇరు దేశాల సైన్యాల మధ్య కాల్పులు జరిగాయి. ఖోస్ట్ ప్రావిన్స్‌లోని గ్రామలపై పాక్ జరిపిన మోర్టార్ దాడుల్లో ఇద్దరు పిల్లలతో సహా నలుగురు మరణించగా, అటు అఫ్గానిస్థాన్ వైపు నుంచి జరిగిన కాల్పుల్లో బాజౌర్ జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారని ఇరు దేశాలు పరస్పర ఆరోపణలు చేసుకున్నాయి. గత కొన్నేళ్లలో ఇరు దేశాల మధ్య ఇంతటి భారీ స్థాయిలో ఘర్షణలు జరగడం ఇదే మొదటిసారి.

అప్రమత్తమైన ఐక్యరాజ్యసమితి..

మరోవైపు, అఫ్గానిస్థాన్ గడ్డపై ఉగ్రవాదాన్ని అణిచివేసేందుకు తాలిబన్ ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి పిలుపునిచ్చింది. ఉగ్రవాద కార్యకలాపాలను ఖండిస్తూ ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించడంతో పాటు అఫ్గానిస్థాన్​లో ఐరాస రాజకీయ మిషన్ (యూనామా) గడువును మరో మూడు నెలలు పొడిగించింది.

ఫిబ్రవరి చివరలో మొదలైన ఈ సరిహద్దు పోరు ఇప్పుడు 'బహిరంగ యుద్ధం'లా మారిందని పాక్ అభివర్ణిస్తుండగా, దేశ గౌరవాన్ని కాపాడుకోవడం తమ బాధ్యతని తాలిబన్లు స్పష్టం చేస్తున్నారు. పౌరుల మరణాలపై అఫ్గానిస్థాన్ ఉప ప్రధాని అబ్దుల్ సలామ్ హనాఫీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, ఈ యుద్ధం తమపై రుద్దారని మండిపడ్డారు.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe