Success story : ఐఐటీ ట్యాగ్ లేదు.. కానీ రూ. 2.6కోట్ల ప్యాకేజీ వచ్చింది! అద్భుతం చేసి కర్ణాటక కుర్రోడు..
Pruthviraj P Nvidia salary : ఐఐటీ డిగ్రీ ఉంటేనే గ్లోబల్ టెక్ కంపెనీల్లో స్థానం లభిస్తుందనే నమ్మకాన్ని పటాపంచలు చేశాడు కర్ణాటకకు చెందిన పృథ్విరాజ్. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా, కేవలం సొంత నైపుణ్యాలతోనే ఏకంగా రూ. 2.6 కోట్ల ప్యాకేజీతో ఉద్యోగం సంపాదించాడు.
భారతదేశంలో సగటు మధ్యతరగతి ఇంజనీరింగ్ విద్యార్థి కల.. ఎలాగైనా ఐఐటీలో సీటు సాధించడం, ఆ తర్వాత మంచి ప్యాకేజీతో ఉద్యోగంలో చేరడం! గ్లోబల్ టెక్నాలజీ కంపెనీల్లో స్థిరపడాలన్నా, భారీ ప్యాకేజీ అందుకోవాలన్నా ఐఐటీ ట్యాగ్ ఒక్కటే ఏకైక మార్గమని మెజారిటీ విద్యార్థులు నమ్ముతారు. అయితే, ప్రతిభకు ఏ కాలేజీ బ్రాండ్ అవసరం లేదని, పట్టుదల ఉంటే ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీని సైతం శాసించవచ్చని నిరూపించాడు ఓ కర్ణాటక వాసి. అతనే పీ పృథ్విరాజ్.

ఇటీవల ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో ప్రపంచాన్ని శాసిస్తున్న మైక్రోచిప్ దిగ్గజం ‘ఎన్వీడియా’కు చెందిన కాలిఫోర్నియాలోని శాంటా క్లారా ప్రధాన కార్యాలయంలో పృథ్విరాజ్ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఇంజనీర్ (డీప్ లెర్నింగ్)గా చేరాడు. అతని ప్యాకేజీ అక్షరాలా రూ. 2.6కోట్లు! ఈ విషయాన్ని ఆయన స్వయంగా తన లింక్డ్‌ఇన్ ఖాతా ద్వారా పంచుకోవడంతో, ఈ విజయగాథ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. కేవలం ప్రీమియం ఇన్‌స్టిట్యూట్‌ల విద్యార్థులకే ఇలాంటి అవకాశాలు వస్తాయనే అపోహలను ఈ ప్రయాణం పూర్తిగా బద్దలు కొట్టింది.
పల్లెటూరు నుంచి సిలికాన్ వ్యాలీ వరకు..
పృథ్విరాజ్ ప్రయాణం అంత సులువుగా సాగలేదు. కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాకు చెందిన 'కటందేవరకోట' అనే ఒక చిన్న గ్రామం ఆయన స్వస్థలం. కనీస సాంకేతిక వనరులు, ఆధునిక విద్యావకాశాలు లేని ఆ పల్లెటూరు నుంచి ఆయన తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. తండ్రి ఒక సాధారణ బ్యాంక్ ఉద్యోగి. మధ్యతరగతి కుటుంబ నేపథ్యం కావడంతో ఎలాంటి అదనపు సదుపాయాలు లేవు. కేవలం సొంత శ్రమ, పట్టుదలనే పెట్టుబడిగా మార్చుకున్నాడు.
బెంగళూరులోని పీఈఎస్ యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన పృథ్విరాజ్, కాలేజీ క్యాంపస్ సెలక్షన్స్ లేదా థియరీ చదువులకే పరిమితం కాలేదు. భవిష్యత్తు అంతా కృత్రిమ మేధస్సు, డీప్ లెర్నింగ్ చుట్టూనే తిరగబోతోందని ముందుగానే గుర్తించి, ఆయా రంగాల్లో ప్రాక్టికల్ నైపుణ్యాలను పెంచుకోవడంపై దృష్టి పెట్టాడు.
"ఒక చిన్న టౌన్‌లో నిశ్శబ్దంగా మొదలైన నా కల, ఈరోజు నిజమైంది," అని పృథ్విరాజ్ తన లింక్డ్‌ఇన్ పోస్ట్‌లో రాసుకొచ్చాడు.
సాంకేతికత అందుబాటులో లేని వాతావరణంలో పెరగడం వల్ల మొదట్లో ఈ కలలు అసాధ్యంగా అనిపించేవని, ప్రయాణంలో ఎన్నో అడ్డంకులు, సొంత సామర్థ్యంపై అనుమానాలు వ్యక్తమైనా ఏనాడూ వెనకడుగు వేయలేదని ఆయన గుర్తుచేసుకున్నాడు.
కోచింగ్‌లు లేవు.. సొంతంగానే ప్రయోగాల పాఠాలు
ఖరీదైన కోచింగ్ సెంటర్లు, బడా కాలేజీల రెప్యుటేషన్‌పై ఆధారపడకుండా, పృథ్విరాజ్ ఆన్‌లైన్ కోర్సులు, సొంత ప్రాజెక్టులు, నిరంతర సాధన ద్వారా ఏఐ, డీప్ లెర్నింగ్ టెక్నాలజీలపై పట్టు సాధించాడు. డిగ్రీ పూర్తయిన తర్వాత ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు. అక్కడ కూడా ఆయనకు ఏ పెద్ద యూనివర్సిటీలోనూ సీటు రాలేదు. ఒక సాధారణ టైర్-3 విశ్వవిద్యాలయంలోనే మాస్టర్స్ పూర్తి చేశాడు. ఆ సమయంలో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ, కెరీర్ ప్లానింగ్ కోసం సరైన గైడెన్స్ లేకపోయినా ఒంటరిగానే పోరాడాడు.
అనంతరం ఎన్వీడియా సంస్థ నిర్వహించే అత్యంత కఠినమైన రిక్రూట్‌మెంట్ ప్రక్రియను తన అసాధారణ సాంకేతిక పరిజ్ఞానంతో సులువుగా చేధించాడు. ప్రస్తుతం అతను ఎన్వీడియాలో అత్యాధునిక డీప్ లెర్నింగ్ టెక్నాలజీలపై పనిచేస్తూ, ఏడాదికి దాదాపు 2,75,000 డాలర్లు (మన భారత కరెన్సీలో సుమారు రూ. 2.6 కోట్లు) వేతనంగా అందుకుంటున్నాడు. ప్రపంచంలోని అత్యంత ప్రతిభావంతులైన మేధావులతో కలిసి పనిచేసే అవకాశం రావడం తన అదృష్టమని పృథ్విరాజ్ పేర్కొన్నాడు.
చివరగా తోటి విద్యార్థులకు ఆయన ఒకటే సందేశం ఇచ్చాడు.. కాలేజీల బ్రాండ్ల కంటే మీ నైపుణ్యాలను నిరంతరం మెరుగుపరుచుకోవడంపైనే దృష్టి పెట్టండి, ఓపికగా ఉండండి, విజయం ఎంత దూరంలో ఉన్నా ప్రయత్నాన్ని మాత్రం ఆపకండి.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


