Kerala Assembly Elections 2026 : కేరళలో ఎల్​డీఎఫ్​ హ్యాట్రిక్ సాధించేనా? కాంగ్రెస్​, బీజేపీ పరిస్థితేంటి?

Kerala elections : కేరళ ఎన్నికలు ఎప్పుడూ ప్రత్యేకమే! ఒకే పార్టీకి ఎప్పుడూ వరుసగా రెండోసారి అధికారం ఇవ్వని కేరళ ప్రజలు.. గత ఎన్నికల్లో రూట్​ మార్చారు. ఎల్​డీఎఫ్​కి పట్టంగట్టారు. మరి ఇప్పుడు ఎల్​డీఎఫ్​ హ్యాట్రిక్​ కొడుతుందా? లేక కాంగ్రెస్​ పుంజుకుంటుందా? వీటి మధ్య బీజేపీ పరిస్థితేంటి? పూర్తి విశ్లేషణ

Published on: Mar 28, 2026, 12:18:55 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కేరళ రాజకీయాలపై ఎన్నో దశాబ్దాలుగా ఒక స్థిరమైన అభిప్రాయం ఉంది. ఏ ఒక్కరికీ వరుసగా అధికారం ఇవ్వకుండా అక్కడి ఓటరు రాష్ట్రంలో ప్రతి ఐదేళ్లకు ఒకసారి అధికారాన్ని మార్చేస్తారు. వామపక్ష కూటమి, కాంగ్రెస్ కూటముల మధ్య అధికార మార్పిడి జరుగుతూ కేరళ రాష్ట్రం ప్రజాస్వామ్యానికి ప్రత్యేకతగా నిలిచింది. అయితే ప్రభుత్వ మార్పు సంప్రదాయానికి 2021లో అక్కడి ప్రజలు తెరదించారు! వామపక్ష కూటమి (ఎల్‌డీఎఫ్) వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చి చరిత్ర సృష్టించింది. ఇప్పుడు రాజకీయ వర్గాల ముందున్న ప్రశ్న ఒక్కటే.. ఈసారి ఎల్‌డీఎఫ్ ముచ్చట‌గా మూడోసారి అధికారంలోకి వస్తుందా..? లేదా కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ దానికి పగ్గాలేస్తుందా..?

కేరళ సీఎం పినరయి విజయన్​..
కేరళ సీఎం పినరయి విజయన్​..

కేరళ ఎన్నికలు 2026- ఎల్​డీఎఫ్​ వర్సెస్​ కాంగ్రెస్​..

జాతీయ స్థాయిలో ‘ఇండియా’ కూటమిలో ఒకటైన ఈ రెండు కూటములు కేరళలో మాత్రం ప్రత్యర్థులుగా తలపడుతుండడంతో దేశవ్యాప్తంగా రాష్ట్ర ఎన్నికలపై ఆసక్తి నెలకొంది. గత గణాంకాలను పరిశీలిస్తే 51 నియోజకవర్గాల్లో ఎల్​డీఎఫ్​కు గట్టి పునాదులున్న నేపథ్యంలో 140 స్థానాలున్న కేరళలో మెజార్టీకి కావాల్సిన 71 స్థానాల్లో వామపక్ష ఎల్డీఎఫ్‌ కూటమి గెలిచి హ్యాట్రిక్ సాధిస్తుందా వేచి చూడాలి.

రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపై క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించడంతో పాటు గత గణాంకాలను కూడా క్షుణ్ణంగా విశ్లేషించిన పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ అధ్యయనంలో పలు ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. క్షేత్రస్థాయిలో రాజకీయ ప్రకటనలు, సభలు, వాగ్దానాలు ఎలా ఉన్నా వీటన్నిటికంటే ఎక్కువగా వాస్తవ గణాంకాలే నిజాలు చెబుతాయి. రాష్ట్రంలో 2011, 2016, 2021 అసెంబ్లీ ఎన్నికల‌ ఫలితాలను గమనిస్తే కేరళ ఓటరు తీర్పులో స్థిరమైన ధోరణి కనిపిస్తుంది. రాష్ట్రంలో మొత్తం 140 అసెంబ్లీ స్థానాల్లో సుమారు 51 నియోజకవర్గాలు ఒకే కూటమికి వరుసగా మద్దతు ఇస్తూ వచ్చాయి. ఈ సంఖ్య సాధారణమైనది కాదు. ఇవి మొత్తం స్థానాల్లో దాదాపు 35 శాతం. ఈ 51 స్థానాల్లో 39 స్థానాలు సీపీఎం పూర్తి ఆధిపత్యం కొనసాగిస్తుండగా, మిగతా 12 స్థానాలు దాని మిత్రపక్షం సీపీఐకి కంచుకోటలుగా నిలవడంతో మొత్తం మీద ఎల్‌డీఎఫ్ కూటమికి తిరుగులేని పునాదిగా మారాయి.

కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ చేతిలో కేవలం 26 స్థానాలు మాత్రమే స్ధిరంగా ఉన్నాయి! కాంగ్రెస్ 12 స్థానాల్లో మిగతా 14 స్థానాల్లో ఆ పార్టీ మిత్రపక్షం ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఆధిపత్యం సాగిస్తున్నాయి. ఈ గణాంకాలను పరిశీలిస్తే వాస్తవ బలాబలాలు తెలుస్తున్నాయి. రాష్ట్రంలో ఎల్‌డీఎఫ్‌కు ఉన్న స్థిరమైన ఒటు బ్యాంకు యూడీఎఫ్‌తో పోలిస్తే దాదాపు రెట్టింపు!

రాష్ట్రంలో ఈ ఆధిపత్య ధోరణి ఒక్కసారిగా ఏర్పడింది కాదు. 1982 నుంచి 2006 వరకు కూడా కొన్ని నియోజకవర్గాలు నిరంతరం ఒకే కూటమికి మద్దతు ఇస్తూ వచ్చాయి. అయితే ఆ కాలంలో ఆ సంఖ్య కేవలం 26 మాత్రమే. కేరళలో 2008 డిలిమిటేషన్ తర్వాత నియోజకవర్గాల పునర్విభజనతో పాటు రాజకీయాలు కూడా మారాయి. కొత్తగా ఏర్పడిన నియోజకవర్గాల్లో వామపక్ష నాయకత్వం బలపడింది. ఫలితంగా ఎల్‌డీఎఫ్ స్థిర స్థానాల సంఖ్య 51కి పెరిగింది.

భౌగోళికంగా చూస్తే రాష్ట్రంలో ఎల్‌డీఎఫ్, యూడీఎఫ్ కూటముల మధ్య ప్రాంతీయంగా ఏర్పడిన రాజకీయ విభజన కూడా ఆసక్తికరమే. కన్నూర్, అలప్పుజ ప్రాంతాలు వామపక్ష పార్టీలకు పటిష్టమైన కేంద్రాలుగా కొనసాగుతున్నాయి. మైనార్టీలు అధికంగా ఉండే మలబార్ ప్రాంతంలో ముస్లిం లీగ్ తన పట్టును నిలబెట్టుకుంది. మధ్య కేరళలో స్థిరంగా కాంగ్రెస్ ఆధిపత్యం సాగుతోంది. అయితే దక్షిణ కేరళలో మాత్రం పూర్తిగా భిన్నమైన రాజకీయ వాతావరణం నెలకొంది. ఈ ప్రాంతంలో ఏ ఒక్క కూటమికీ పూర్తి ఆధిపత్యం కనిపించడం లేదు. ఏ కూటమికి ఏకపక్షంగా ఉండని దక్షిణ కేరళ ఓటర్ల తీర్పు రాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటును నిర్ణయిస్తుంది. అందుకే అసలు పోరు దక్షిణ కేరళలోనే జరగబోతోందని కచ్చితంగా చెప్పవచ్చు.

కేరళ ఎన్నికలు 2026- ముచ్చటగా మూడోసారి?

అధికారంలో ఉన్న పక్షంపై ప్రభుత్వ వ్యతిరేకత ఉండడం దేశ రాజకీయాల్లో సర్వసాధారణం. ప్రత్యేకించి కేరళలో 2021ఎన్నికల ముందు వరకు ఇదే ధోరణీ కొనసాగడంతో వరుసగా ఎవరూ రెండో సారి అధికారంలోకి రాలేదు. అయితే 2021లో ముఖ్యమంత్రి పినరయి విజయన్ అధికారం మార్పిడి సంప్రదాయానికి బ్రేక్ వేస్తూ అధికారాన్ని నిలబెట్టుకోవడం రాష్ట్ర రాజకీయాల్లో చరిత్రగా నిలిచిపోయింది. ప్రస్తుత 2026 శాసనసభ ఎన్నికల్లో పినరయి విజయన్ యాంటీ ఇంకంబెన్సీని ప్రో ఇంకంబెన్సీగా మార్చేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవైపు స్థానిక ఎమ్మెల్యేల పనితీరు, ప్రజలతో వారికున్న సత్సంబంధాలు బేరీజు వేసుకుంటూ, అదే సమయంలో మరోవైపు తమ ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ కార్యక్రమాలపై విస్తృతంగా ప్రచారం చేస్తూ ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించి మూడోసారి పగ్గాలు చేపట్టేందుకు పినరయి వ్యూహాలు రచిస్తున్నారు.

ఎన్నికల విశ్లేషణను పూర్తిగా గత ఫలితాల గణాంకాల ఆధారంగానే చేయలేము. కనిపించే గణాంకాలు ఎంత బలంగా ఉన్నా రాజకీయాల్లో ఏది శాశ్వతం కాదు. “ష్యూర్ షాట్‌”గా భావించే కొన్ని స్థానాలు గతంలో కూడా మారినట్టు చరిత్ర చెబుతోంది. 2012లో నెయ్యాటింకర ఉప ఎన్నికల్లో సీపీఎం ఓడిపోవడం, 2019లో అరూర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడం ఇందుకు ఉదాహరణలు.

ప్రస్తుతం క్షేత్రస్థాయిలో గమనిస్తే ఇప్పుడూ కొన్ని నియోజకవర్గాల్లో పరిస్థితులు మారుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. అంబలపుజ నియోజకవర్గాన్నే తీసుకుంటే ఇక్కడ గతంలో మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి 2021లో పోటీ చేయని సీపీఐ(ఎం) సీనియర్ నేత జి. సుధాకరన్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తుండడంతో ఆయనకు యూడీఎఫ్ మద్దతిస్తోంది. అలాగే పయ్యనూరు సీపీఐ(ఎం) సిట్టింగ్ ఎమ్మెల్యే మధూసూదనన్‌పై పార్టీలో విభేదాలు బయటపడుతున్నాయి. కొట్టారక్కర నియోజకవర్గంలో ఆసక్తికరమైన రాజకీయాలు నడుస్తున్నాయి. ఇక్కడ 2016లో సీపీఐ(ఎం) ఎమ్మెల్యేగా గెలిచిన ఐషా పొట్టి ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగుతుండడంతో తీవ్ర పోటీ నెలకొంది. గతంలో పటిష్టంగా ఉన్న ఎల్‌డీఎఫ్ కూటమికి ఈ స్థానాల్లో గట్టి పోటీ ఎదురవుతుండడంతో రాజకీయ సమీకరణలు మారే అవకాశాలున్నాయి.

వామపక్షల ఎల్‌డీఎఫ్ కూటమే కాదు యూడీఎఫ్ కూడా బలమైన స్థానాల్లో కఠిన పరీక్షనే ఎదుర్కొంటోంది. పెరువూరు నియోజకవర్గంలో 2011, 2016, 2021లో వరుసగా మూడు సార్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన సన్నీ జోషఫ్‌కు స్థానికంగా సొంత పార్టీ నేతలతో ఉన్న విభేదాలతో వారు పూర్తిగా సహకరించకపోవడంతో ఆయనకు సీసీఐ(ఎం) అభ్యర్థి శైలజతో గట్టి పోటీ ఎదురవుతోంది. పాలక్కాడ్ నియోజకవర్గంలో కాంగ్రెస్ తీవ్ర త్రిముఖ పోటీ ఎదుర్కొంటోంది. ఇక్కడ బీజేపీ కాంగ్రెస్‌కు గట్టి పోటీ ఇస్తోంది. అధికార ఎల్డీఎఫ్ కూడా ఈ స్థానాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో కాంగ్రెస్ విజయం అంత సులభం కాదు. ఇటీవల జరిగిన పాలక్కాడ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్‌డీఏ ఆధిక్యత కనబర్చడంతో అసెంబ్లీ ఎన్నికల్లో విజయానికి బీజేపీ సర్వ శక్తులు ఒడ్డుతోంది. ఈ తాజా పరిణామాలు పరిశీలిస్తే గతంలో పటిష్టంగా ఉన్న స్థానాల్లో కూడా యూడీఎఫ్‌కు విజయం తేలిక కాదని స్పష్టమవుతోంది.

కేరళ ఎన్నికలు 2026- బీజేపీ ప్రభావం ఎంత?

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ కూటమి కేరళలో బలమైన పోటీ ఇవ్వడం కోసం శ్రమిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో బీజేపీకి సంప్రదాయంగా ఉన్న కొంత బలాన్ని విజయాలుగా మల్చుకోవాలని ఆ పార్టీ ప్రణాళికలు రూపొందిస్తోంది. ప్రధానంగా సీపీఐ బలమైన కొన్ని నియోజకవర్గాల్లో బీజేపీ గట్టి సవాల్ విసురుతోంది. బీజేపీ ఈ స్థానాల్లో ప్రత్యక్షంగా గెలుపు సాధించకపోయినా చాలా చోట్ల ఓట్లను చీల్చడం ద్వారా గెలుపోటములను శాసించే స్థితిలో ఉంది.

శాసనసభ ఎన్నికల ముందు 2025 డిసెంబర్‌లో జరిగన కేరళ రాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు ఆసక్తికరంగా ఉన్నాయి. వామపక్ష ఎల్‌డీఎఫ్ కంచుకోటల్లో ప్రభుత్వ వ్యతిరేకతతో యూడీఎఫ్ మెరుగైన ఫలితాలు సాధించింది. స్థానిక ఎన్నికల ఫలితాలను పరిగణలోకి తీసుకుంటే ఎల్‌డీఎఫ్‌కు బలమైన స్థానాలుగా భావిస్తున్న 51 నియోజకవర్గాల్లో గట్టి పోటీ ఎదురయ్యే అవకాశాలున్నాయి. గత గణాంకాల ప్రకారం 51 చోట్ల బలమైన పునాదితో ఎల్‌డీఎఫ్ ఆధికత్య కనినిస్తున్నా క్షేత్రస్థాయిలో గట్టి పోటీ ఎదురవడం ఖాయం. మరోవైపు రాష్ట్రంలో ఉన్న 14 ఎస్సీ నియోజకవర్గాల్లో 12 చోట్ల ఎల్డీఎఫ్ కూటమి, 2 ఎస్టీ నియోజకవర్గాల్లో యూడీఎఫ్ కూటమి బలంగా ఉన్నాయని గత గణాంకాలు చెబుతున్నాయి.

కేరళ ఎన్నికలు 2026- ఓటర్లు ఎటువైపు?

గణాంకాలు ఎలా ఉన్నా కేరళ ఓటర్ల స్వభావం మారుతూ ఉంటుందని గత చరిత్రతో పాటు స్థానిక ఎన్నికల ఫలితాలు నిరూపిస్తున్నాయి. పరిస్థితుల దృష్ట్యా ఓటర్ల అభిప్రాయం మారతుంటుంది. ఎల్డీఎఫ్ బలంగా కనిపిస్తున్నా స్థానిక ఎన్నికల ఫలితాలు, రాష్ట్రంలో బలపడుతున్న బీజేపీ వంటి పరిణామాలు కేరళలో ఎల్​డీఎఫ్​ఎఫ్‌ను హ్యాట్రిక్ వైపు తీసుకెళతాయా..? వామపక్ష ప్రభుత్వానికి బ్రేకులేస్తాయా..? మే 4వ తేదీన వెలువడే ఎన్నికల ఫలితాలే తేలుస్తాయి!

-జి.మురళీ కృష్ణ, రీసెర్చర్, పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ.

జి.మురళీ కృష్ణ
జి.మురళీ కృష్ణ

(గమనిక- ఇవి పూర్తిగా రచయిత అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు.)

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More