మరో అద్భుతం చేసిన కేరళ! తీవ్ర పేదరికాన్ని నిర్మూలించిన తొలి రాష్ట్రంగా..
కేరళ రాష్ట్రం మరోసారి అద్భుతం సృష్టించింది! భారతదేశంలో 'తీవ్ర పేదరికాన్ని నిర్మూలించిన మొదటి రాష్ట్రం'గా ఆవిర్భవించింది. ఈ మేరకు కీలక ప్రకటన చేశారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్.
విద్య, అభివృద్ధి సహా అనేక రంగాల్లో దూసుకెళుతూ దేశవ్యాప్తంగా నిత్యం వార్తల్లో నిలిచే కేరళ రాష్ట్రం మరో అద్భుతం చేసింది! భారత దేశంలో.. అతి పేదరికాన్ని నిర్మూలించిన తొలి రాష్ట్రంగా చరిత్రకెక్కింది. ఈ మేరకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ శనివారం కీలక ప్రకటన చేశారు. కేరళ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర అసెంబ్లీలో జరిగిన ప్రత్యేక సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు.

నేటి సాయంత్రం 5 గంటలకు తిరువనంతపురం సెంట్రల్ స్టేడియంలో జరిగే బహిరంగ సభలో ఈ ఘనతను అధికారికంగా ప్రకటించనున్నారు ముఖ్యమంత్రి. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులందరూ హాజరుకావాల్సి ఉంది. ప్రతిపక్ష నాయకుడిని కూడా ఈ వేడుకకు ఆహ్వానించారు.
ఈ ఈవెంట్‌కు ప్రముఖ సినీ నటులు కమల్ హాసన్, మమ్ముట్టి, మోహన్‌లాల్ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు.
రూ. 1,000 కోట్ల పెట్టుబడితో పేదరికంపై పోరాటం..
దేశంలో పేదరికం రేటు అత్యల్పంగా ఉన్న రాష్ట్రం కేరళ (0.7శాతం) అని గతంలో నీతి ఆయోగ్ అధ్యయనం గుర్తించింది. ఆ తర్వాత.. అతి పేదరికాన్ని నిర్మూలించేందుకు కేరళ ప్రభుత్వం 2021లో ప్రత్యేక ప్రాజెక్టును ప్రారంభించింది. అతి పేదరికంలో ఉన్న 64,006 కుటుంబాలను గుర్తించి, 4ఏళ్ల పాటు ప్రోత్సహకాలను అందించింది.
రాష్ట్ర ప్రభుత్వం పేదరికాన్ని నిర్మూలించేందుకు రూ. 1,000 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టిందని ముఖ్యమంత్రి ఇంతకుముందు వెల్లడించారు. ఈ నిధులతో:
- కేరళలో 20,648 కుటుంబాలకు రోజువారీ ఆహారాన్ని అందించారు. ఇందులో 2,210 కుటుంబాలకు తాజాగా వండిన భోజనాన్ని సరఫరా చేశారు.
- 85,721 మందికి అవసరమైన వైద్య చికిత్స, మందులను అందించారు.
- వేలాది మందికి గృహ నిర్మాణానికి సహాయం చేశారు.
ఇంటి నిర్మాణం, పునరుద్ధరణ వివరాలు:
- 5,400కు పైగా కొత్త ఇళ్ల నిర్మాణం పూర్తయింది లేదా నిర్మాణంలో ఉంది.
- 5,522 ఇళ్లకు మరమ్మతులు చేశారు.
- 2,713 మంది భూమి లేని కుటుంబాలకు సొంత ఇల్లు నిర్మించుకోవడానికి భూమిని అందించారు.
ముఖ్యమంత్రి పినరయి విజయన్ మరింత సమాచారాన్ని అందిస్తూ.. 21,263 మందికి రేషన్ కార్డులు, ఆధార్, పింఛన్లు వంటి అవసరమైన పత్రాలు మొదటిసారిగా లభించాయని తెలిపారు. అలాగే, 4,394 కుటుంబాలకు జీవనోపాధి ప్రాజెక్టుల ద్వారా సహాయం అందించామని వివరించారు.
‘సామాజిక న్యాయమే కేరళ మోడల్’
"ఇది స్థానిక స్వపరిపాలన సంస్థలు, కుటుంబశ్రీ, వివిధ ప్రభుత్వ శాఖల ఉమ్మడి కృషి ఫలితం. ఇది సామాజిక న్యాయం, సమానత్వం, కరుణతో కూడిన పాలనను ఆచరణలో చూపించే కేరళ మోడల్. నవ కేరళాన్ని నిర్మించడం అంటే.. ఎవరినీ విడిచిపెట్టకపోవడం," అని ముఖ్యమంత్రి విజయన్ ఎక్స్ వేదికగా ఒక పోస్ట్‌లో పేర్కొన్నారు.
‘అదంతా నిజం కాదు’
అయితే అతి పేదరిక నిర్మూలనపై రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలను.. కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్ష యూడీఎఫ్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ప్రభుత్వం అబద్ధాలు చెబుతోందని, మోసం చేస్తోందని విమర్సించింది. ఈ మేరకు శనివారం జరిగిన ప్రత్యేక అసెంబ్లీ సెషన్ నుంచి వాకౌట్ చేసింది.
“ముఖ్యమంత్రి చెబుతోందంతా మోసమే! మేము ఆయనతో చేరలేము. అందుకే ఈ సెషన్‌ని బహిష్కరిస్తున్నాము,” అని అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వీడీ సతీశన్ తెలిపారు.
సతీశన్ విమర్శలను పినరయి విజయన్ తిప్పికొట్టారు.
“మేము అమలు చేయగలిగినవే చెబుతాను. చెప్పిందే అమలు చేస్తాము. ప్రతిపక్ష నేతకు ఇదే నా సమాధానం,” అని అన్నారు.

E-Paper












