...
...
Next Story

Rain Alert : హీట్​వేవ్​ వార్తలు బంద్- ఇక జోరుగా వర్షాలు.. అక్కడ రెడ్​ అలర్ట్

Monsoon rains : నైరుతి రుతుపవనాలు వేగంగా కదులుతూ మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాల్లోకి ప్రవేశించాయి. అటు కేరళలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తుండగా, ఇప్పటికే ఆరు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. జూన్ మూడో వారంలో రుతుపవనాలు దిల్లీకి చేరుకోనున్నాయి.

Published on: Jun 7, 2026, 08:14:59 IST
Advertisement

Andhra Pradesh rains : దేశవ్యాప్తంగా ఎండలతో అల్లాడుతున్న ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. నైరుతి రుతుపవనాలు దేశంలోని పలు ప్రాంతాల్లోకి చకచకా విస్తరిస్తున్నాయి. పశ్చిమ రాష్ట్రమైన మహారాష్ట్రలోకి రుతుపవనాలు అధికారికంగా ప్రవేశించాయని, అక్కడ సాధారణ సమయానికే వర్షాలు మొదలయ్యాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. దీనితో పాటు మధ్య-పశ్చిమ, తూర్పు-మధ్య అరేబియా సముద్రం, కర్ణాటక, గోవా పూర్తిగా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులోని కొన్ని ప్రాంతాలు, నైరుతి బంగాళాఖాతంలోకి రుతుపవనాలు విజయవంతంగా ముందుకు సాగాయి.

కేరళ సహా అనేక రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. (PTI)
కేరళ సహా అనేక రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. (PTI)

మరోవైపు దేశ రాజధాని దిల్లీ పరిసర ప్రాంతాల ప్రజలు రుతుపవనాల రాక కోసం జూన్ మూడో వారం వరకు వేచి చూడాల్సిందే. ఐఎండీ వాతావరణ మ్యాప్ ప్రకారం, జూన్ 25 నుంచి 30 తేదీల మధ్య దిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలోకి రుతుపవనాలు అడుగుపెట్టే అవకాశం ఉంది. ఈ సమయంలోనే నోయిడా, గురుగ్రామ్, ఘజియాబాద్ వంటి పరిసర నగరాల్లోనూ వర్షాలు పడతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆ తర్వాత ఇవి మరింత వాయువ్య దిశగా కదులుతూ హరియాణా, పంజాబ్, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్, లడఖ్, జమ్మకశ్మీర్ ప్రాంతాలకు విస్తరిస్తాయి.

మరోవైపు రుతుపవనాల కదలికల వల్ల పశ్చిమ తీర ప్రాంతం తీవ్రంగా ప్రభావితమవుతోంది. కేరళ, తీరప్రాంత కర్ణాటక, గోవాతో పాటు మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా కేరళలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. అనేక చోట్ల రోడ్లపై నీరు నిలిచిపోగా, చెట్లు విరిగిపడ్డాయి. ఈ వర్షాల కారణంగా రాష్ట్రంలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. త్రిసూర్ జిల్లాలోని మనలూరు ప్రాంతంలో తాత్కాలిక షెడ్డుపై చెట్టు విరిగిపడటంతో, అందులో నిద్రిస్తున్న 29 ఏళ్ల యువకుడు మరణించినట్లు పీటీఐ వార్తా సంస్థ పేర్కొంది.

కేరళలో రెడ్ అలర్ట్ జిల్లాల వివరాలు..

రుతుపవనాల ప్రభావం పెరుగుతుండటంతో మహారాష్ట్రలోని పూణె, థానే, నాసిక్ జిల్లాలకు ఆదివారం నాడు 'యెల్లో అలర్ట్' ప్రకటించారు. జూన్ 7 నుంచి ఉత్తర, మధ్య మరియు పశ్చిమ భారతదేశంలోని పలు ప్రాంతాలలో ఉరుములు, మెరుపులు, బలమైన ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది.

ముఖ్యంగా కొంకణ్, గోవా ప్రాంతాల్లో జూన్ 7 నుంచి 12 వరకు విస్తారంగా వర్షాలు పడనున్నాయి, అందులోనూ జూన్ 10 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ ప్రాంతాలతో పాటు మధ్య మహారాష్ట్ర, మరఠ్వాడాలలో జూన్ 10 వరకు గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తూ, ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

జూన్ 12 వరకు ఉత్తర భారతంలో వానలు..

జమ్ముకశ్మీర్, లడఖ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో రాబోయే కొన్ని రోజుల పాటు అక్కడక్కడా వర్షాలు కురుస్తాయి. అలాగే జూన్ 7 నుంచి 12 మధ్య హరియాణా, దిల్లీ, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. జూన్ 11, 12 తేదీల్లో హర్యానా, ఢిల్లీ, పంజాబ్, ఉత్తరాఖండ్ ప్రాంతాలలో గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తూ, మెరుపులతో కూడిన వానలు పడవచ్చు. తూర్పు రాజస్థాన్‌లో జూన్ 7 నుంచి 12 వరకు గంటకు 30 నుండి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది.

మధ్య భారతదేశంలో ఉరుముల హెచ్చరిక..

మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, విదర్భ ప్రాంతాల్లో జూన్ 12 వరకు అక్కడక్కడా వర్షాలు కురుస్తాయి. మధ్యప్రదేశ్‌లో జూన్ 10 వరకు, ఛత్తీస్‌గఢ్‌లో జూన్ 8 నుంచి 12 వరకు గంటకు 40 నుండి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తూ, ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. జూన్ 8న విదర్భ ప్రాంతంలో గంటకు 50 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో తీవ్రమైన గాలులు వీస్తూ భారీ వర్షం పడవచ్చని ఐఎండీ అంచనా వేసింది.

మొత్తం మీద చూసుకుంటే.. 3,4 నెలల పాటు ఎండలకు అల్లాడిపోయిన ప్రజలకు ఇక హీట్​వేవ్​ వార్తలు వినాల్సని పని ఉండదు.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe