Dharmendra Pradhan : మీ విద్యా మంత్రి గురించి మీకెంత తెలుసు? ధర్మేంద్ర ప్రధాన్ ఎడ్యుకేషన్, కేసులు, ఆస్తులు..
Dharmendra Pradhan : నీట్ పేపర్ లీక్ వివాదంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన రాజకీయ ప్రస్థానం, ఎన్నికల అఫిడవిట్ ప్రకారం ఆస్తులు, కేసుల పూర్తి వివరాలు ఇవే..
దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన నీట్ పేపర్ లీక్ వివాదం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. దిల్లీలో విద్యార్థుల పోరాటంగా ప్రారంభమైన ఈ ఆందోళనలు ప్రస్తుతం దేశమంతటా విస్తరించాయి. కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆధ్వర్యంలో, విపక్షాలు, పలువురు బాలీవుడ్ ప్రముఖుల మద్దతుతో జరుగుతున్న ఈ నిరసనల్లో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే ప్రధాన డిమాండ్ వినిపిస్తోంది.

అయితే, పేపర్ లీక్ వ్యవహారంలో మంత్రిని నేరుగా నిందించలేమని కేంద్ర ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ధర్మేంద్ర ప్రధాన్ తన కేంద్ర కేబినెట్ పదవిలో కొనసాగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని పీటీఐ వార్తా సంస్థ పేర్కొంది.
57 ఏళ్ల ధర్మేంద్ర ప్రధాన్ భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో అత్యంత ప్రభావవంతమైన నాయకుల్లో ఒకరు. జూన్ 2024లో కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించడానికి ముందు ఆయన కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ, నైపుణ్యాభివృద్ధి శాఖలకు మంత్రిగా కూడ బాధ్యతలు నిర్వహించారు.
విద్యార్థి నాయకుడి నుంచి కేబినెట్ మంత్రి వరకు..
విద్యార్థి రాజకీయం నుంచి కేంద్ర కేబినెట్ మంత్రిగా ధర్మేంద్ర ప్రధాన్ ఎదిగిన తీరు ఆయన సంస్థాగత నైపుణ్యానికి నిదర్శనం. తూర్పు భారతదేశంలో బీజేపీ బలోపేతానికి, పలు కీలక విధానాల అమలుకు ఆయన కృషి చేశారని మద్దతుదారులు ప్రశంసిస్తుంటారు. అయితే, ఇటీవల కాలంలో విద్యాశాఖ నిర్వహణపై ఆయన విమర్శలు ఎదుర్కొంటున్నారు.
ధర్మేంద్ర ప్రధాన్ 1969 జూన్ 26న ఒడిశాలోని అంగుల్ జిల్లా తాల్చేర్‌లో రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి దేవేంద్ర ప్రధాన్ బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి. ధర్మేంద్ర ప్రధాన్‌కు భార్య మృదుల ఠాకూర్, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ అనుబంధ విద్యార్థి సంఘమైన అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ద్వారా ఆయన తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించారు.
2000లోనే ఎమ్మెల్యేగా విజయం..
ప్రధాన్ 2000 సంవత్సరంలో ఒడిశా అసెంబ్లీకి పల్లహర నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2004లో దేవ్‌గఢ్ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఎన్నికై, 2009 వరకు ప్రాతినిధ్యం వహించారు. 2004 నుంచి 2006 వరకు భారతీయ జనతా యువమోర్చా (బీజేవైఎం జాతీయ అధ్యక్షుడిగా, ఆ తర్వాత బీజేపీ జాతీయ కార్యదర్శి, ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ వంటి పలు పదవులను నిర్వహించారు. ప్రస్తుతం ఆయన 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఒడిశాలోని సంబల్‌పూర్ స్థానం నుంచి ఎంపీగా విజయం సాధించారు.
కుటుంబ ఆస్తులు – నెట్ వర్త్ వివరాలు
ఇటీవల దాఖలు చేసిన ఎన్నికల అఫిడవిట్ ఆధారంగా ధర్మేంద్ర ప్రధాన్ కుటుంబ మొత్తం నికర ఆస్తుల విలువ (నెట్) రూ. 6.38 కోట్లుగా ఉంది.
2022-23 ఆర్థిక సంవత్సరంలో ఆయన వార్షిక ఆదాయం రూ. 12.74 లక్షలు కాగా, ఆయన భార్య మృదుల ఠాకూర్ ఆదాయం రూ. 49 లక్షలుగా ఉంది. అదే ఏడాది వారి కుమార్తె నైమిష ఆదాయం రూ. 4.6 లక్షలుగా అఫిడవిట్‌లో పేర్కొన్నారు.
వ్యక్తిగత ఆస్తులు :
ధర్మేంద్ర ప్రధాన్ : మొత్తం ఆస్తుల విలువ రూ. 1,99,23,471.
చరాస్తులు : రూ. 1,39,53,332
స్థిరాస్తులు : రూ. 92,50,000
అప్పులు : రూ. 32,79,861
మృదుల ఠాకూర్ (భార్య) : మొత్తం ఆస్తుల విలువ రూ. 4,12,65,655.
చరాస్తులు : రూ. 2,95,48,575
స్థిరాస్తులు : రూ. 1,37,75,000
అప్పులు : రూ. 20,57,920
నైమిష ప్రధాన్ (కుమార్తె ): చరాస్తులు రూ. 25,29,474.
నిశాంత్ ప్రధాన్ (కుమారుడు ): చరాస్తులు రూ. 1,62,809.
నగదు, బ్యాంక్ డిపాజిట్లు, పెట్టుబడులు:
ధర్మేంద్ర ప్రధాన్ వద్ద రూ. 35,000 నగదు ఉండగా, ఆయన భార్య వద్ద రూ. 40,000 నగదు ఉంది. వారి పిల్లల వద్ద వరుసగా రూ. 10,000, రూ. 7,000 నగదు రూపంలో ఉంది.
ప్రధాన్ కుటుంబానికి సంబంధించి బ్యాంక్ డిపాజిట్లు, పీపీఎఫ్, ఫిక్స్డ్ డిపాజిట్లు కలిపి సుమారు రూ. 2.47 కోట్లు ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్లలో రూ. 80.40 లక్షలు, ఇన్సూరెన్స్ పాలసీల్లో రూ. 67.72 లక్షల పెట్టుబడులు పెట్టారు. ప్రధాన్‌కు పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఐడీబీఐ బ్యాంకుల్లో రూ. 31.38 లక్షల రుణాలు ఉన్నాయి. అలాగే ఆయన తన భార్యకు రూ. 10 లక్షల అడ్వాన్స్, తండ్రి దేవేంద్ర ప్రధాన్‌కు రూ. 5 లక్షలు, ఇతర బంధువులకు మరికొంత వ్యక్తిగత రుణాలు ఇచ్చారు.
భూములు, ఇళ్లు, వాహనాలు:
ఒడిశాలో ప్రధాన్ పేరు మీద రూ. 12 లక్షల విలువైన వ్యవసాయ భూమి, రూ. 20.50 లక్షల విలువైన వ్యవసాయేతర భూమి ఉంది. ఘాజియాబాద్‌లోని ఇందిరాపురం, భువనేశ్వర్‌లలో రూ. 1.98 కోట్ల విలువైన నివాస గృహాలు ఉన్నాయి.
ఆయన వద్ద 2011 మోడల్ హోండా సిటీ కారు ఉండగా, ఆయన భార్యకు పలు వాణిజ్య వాహనాలు ఉన్నాయి. 2024 నాటికి ప్రధాన్ వద్ద రూ. 13.5 లక్షల విలువైన 200 గ్రాముల బంగారం, 2.5 కేజీల వెండి ఉండగా, ఆయన భార్య వద్ద రూ. 35 లక్షల విలువైన 500 గ్రాముల బంగారం, 10 కేజీల వెండి ఉన్నాయి.
విద్యా అర్హత, క్రిమినల్ కేసులు..
ధర్మేంద్ర ప్రధాన్ విద్యా అర్హత ఆంత్రోపాలజీ విభాగంలో మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ (ఎంఏ). ఆయన 1990లో ఒడిశా భువనేశ్వర్‌లోని ఉత్కల్ యూనివర్సిటీ నుంచి ఈ డిగ్రీ పూర్తి చేశారు.
ఆయనపై నమోదైన పెండింగ్ కేసుల వివరాలు:
2005 కేసు: తపస్విని ఎక్స్‌ప్రెస్ రైలును నిలిపివేయడాన్ని నిరసిస్తూ గర్‌పోష్ రైల్వే స్టేషన్‌లో 'రైల్ రోకో' ఆందోళన చేపట్టినందుకు రూర్‌కెలాలో కేసు నమోదైంది.
2006 కేసు: ఒక పెళ్లి వేడుకలో పోలీసులతో వాగ్వాదానికి దిగినట్లు పూరీలో కేసు నమోదైంది. 2015లో దీనిపై ఛార్జిషీట్ రూపొందించారు.
2010 కేసు: మరణించిన రైతు కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని చేపట్టిన ఆందోళనలో కంకడహాడలో కేసు నమోదైంది.
2019 నాటి మరో రెండు కేసుల్లో పోలీసులు ఇప్పటికే ఫైనల్ రిపోర్ట్ సమర్పించారు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


