...
...
Next Story

షేర్ మార్కెట్‌లో 'లిక్విడిటీ' మంత్రం: ఈ తప్పు చేస్తే డబ్బు లాక్ అయిపోతుంది

స్టాక్ మార్కెట్‌లో లాభాలు గడించడమే కాకుండా, అత్యవసర వేళ షేర్లను సులువుగా విక్రయించగలగడమూ ఎంతో ముఖ్యం. లిక్విడ్, ఇల్లిక్విడ్ స్టాక్స్ మధ్య వ్యత్యాసాలు, మొమెంటమ్ స్ట్రాటజీలో వీటి ప్రాముఖ్యతపై కోటక్ సెక్యూరిటీస్ ఈక్విటీ రీసెర్చ్ హెడ్ శ్రీకాంత్ చౌహాన్ అందించిన విశ్లేషణ.

Published on: Aug 5, 2026, 16:31:21 IST
Advertisement

స్టాక్ మార్కెట్లో హెచ్చుతగ్గులు వేగంగా జరుగుతున్నప్పుడు, అనుకోకుండా వచ్చే నష్టాల నుంచి కాపాడుకోవడానికి పక్కా ప్రణాళిక అవసరం. ఏ సమయంలోనైనా మార్కెట్ ధరకు పెద్దగా నష్టం లేకుండా మన వద్ద ఉన్న షేర్లను సులభంగా విక్రయించగలగడమే 'లిక్విడిటీ'. పెట్టుబడి పెట్టేటప్పుడు ఎక్కువమంది ఈ అంశాన్ని పెద్దగా పట్టించుకోరు. అయితే లిక్విడ్, ఇల్లిక్విడ్ స్టాక్స్ మధ్య తేడాలు తెలుసుకోవడం ద్వారా అనవసర ప్రమాదాల నుంచి తప్పించుకోవచ్చని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.

లిక్విడ్ స్టాక్స్ అంటే ఏమిటి?

కోటక్ సెక్యూరిటీస్ ఈక్విటీ రీసెర్చ్ హెడ్ శ్రీకాంత్ చౌహాన్
కోటక్ సెక్యూరిటీస్ ఈక్విటీ రీసెర్చ్ హెడ్ శ్రీకాంత్ చౌహాన్

స్టాక్ మార్కెట్ వేగంగా కదులుతున్నప్పుడు, ధరల్లో పెద్ద మార్పు లేకుండా షేర్లను సులభంగా కొనుగోలు లేదా విక్రయించడమే లిక్విడిటీ ప్రాముఖ్యత. మార్కెట్‌లో నిరంతరం భారీ ఎత్తున క్రయవిక్రయాలు జరిగే షేర్లను 'లిక్విడ్ స్టాక్స్' అంటారు. వీటి లక్షణాలు:

  • రోజువారీ ట్రేడింగ్ పరిమాణం (Volume) చాలా ఎక్కువగా ఉండటం.
  • కొనుగోలు, అమ్మకం ధరల మధ్య వ్యత్యాసం (Bid-Ask Spread) తక్కువగా ఉండటం.
  • మార్కెట్ ధరపై ప్రభావం పడకుండా క్షణాల్లో లావాదేవీలు పూర్తవ్వడం.

రిలయన్స్ ఇండస్ట్రీస్, టీసీఎస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వంటి లార్జ్-క్యాప్ లేదా బ్లూ-చిప్ కంపెనీలు దీనికి చక్కటి ఉదాహరణలు. ఈ తరహా షేర్లలో లావాదేవీలు వేగంగా జరగడం వల్ల, మారే మార్కెట్ పరిస్థితుల్లోనూ పెట్టుబడిదారులకు నిష్క్రమించే వెసులుబాటు లభిస్తుంది.

ఇల్లిక్విడ్ స్టాక్స్ ప్రమాదకరమా?

లిక్విడ్ స్టాక్స్‌కు భిన్నంగా ఉండేవే 'ఇల్లిక్విడ్ స్టాక్స్'. వీటిలో ట్రేడింగ్ పరిమాణం చాలా తక్కువగా ఉంటుంది. బిడ్-ఆస్క్ స్ప్రెడ్ ఎక్కువగా ఉండి, ఏ సమయంలో చూసినా కొనుగోలుదారులు లేదా విక్రేతలు చాలా తక్కువ సంఖ్యలో కనిపిస్తారు.

సాధారణంగా స్మాల్-క్యాప్, పెన్నీ స్టాక్స్ లేదా మార్కెట్‌లో పెద్దగా ఆదరణ లేని కంపెనీల షేర్లు ఈ పరిధిలోకి వస్తాయి. ఇలాంటి స్టాక్స్‌ను పెద్ద మొత్తంలో కొన్నా లేదా అమ్మినా ధరల్లో తీవ్రమైన హెచ్చుతగ్గులు వస్తాయి. మార్కెట్ ఒడుదొడుకుల్లో ఉన్నప్పుడు కొనుగోలుదారులు దొరక్క పెట్టుబడిదారులు అందులోనే చిక్కుకుపోయే ప్రమాదం ఉంది.

లిక్విడిటీ ఎందుకు అంత కీలకం?

మార్కెట్‌లో ప్రస్తుతం బాగా రాణిస్తున్న షేర్లను కొనుగోలు చేసి, ఆ ట్రెండ్ కొనసాగినంత కాలం లాభాలు పొందే పద్ధతినే ముమెంటమ్ స్ట్రాటజీ అంటారు. ఈ విధానాన్ని పాటించే వారికి లిక్విడిటీ అత్యంత ముఖ్యం.

ముమెంటమ్ ట్రేడర్లు కీలకమైన ధరల వద్ద వేగంగా ఎంట్రీ, ఎగ్జిట్ అవ్వాల్సి ఉంటుంది. అధిక వాల్యూమ్ ఉన్న లిక్విడ్ స్టాక్స్‌లో వచ్చే బ్రేక్‌అవుట్‌లు నమ్మదగినవిగా ఉంటాయి. అదే ఇల్లిక్విడ్ స్టాక్స్‌లో తక్కువ లావాదేవీలకే ధర విపరీతంగా పెరిగిపోయి, కృత్రిమమైన మొమెంటమ్‌ను సృష్టిస్తాయి. అందువల్ల, వాల్యూమ్, మార్కెట్ మద్దతు ఉన్న లిక్విడ్ స్టాక్స్‌పైనే దృష్టి సారించడం శ్రేయస్కరం.

ఇల్లిక్విడ్ స్టాక్స్‌కు ఎప్పుడు దూరంగా ఉండాలి?

రీటైల్ పెట్టుబడిదారులు కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఇల్లిక్విడ్ షేర్లలో పెట్టుబడులు పెట్టేటప్పుడు తీవ్ర జాగ్రత్తలు వహించాలి.

  • మార్కెట్ వేగంగా పతనమవుతున్న వేళ.
  • కంపెనీ ఆర్థిక స్థితిగతుల (Fundamentals)పై స్పష్టమైన అవగాహన లేనప్పుడు.
  • ఊహాగానాల (Speculation) ఆధారంగా చేసే ట్రేడింగ్‌లో.
  • ప్రభుత్వ నిబంధనలు లేదా విధానాల మార్పుల వల్ల స్మాల్-క్యాప్ విభాగంలో సెంటిమెంట్ దెబ్బతిన్నప్పుడు.

కొన్ని ఇల్లిక్విడ్ స్టాక్స్ భారీ లాభాలు అందించే అవకాశం ఉన్నప్పటికీ, వాటిలో ఉండే తీవ్రమైన రిస్క్, బయటపడలేని పరిస్థితులు నష్టాలకు కారణమవుతాయి.

పోర్ట్‌ఫోలియో సమతుల్యత ఎలా సాధించాలి?

ఒక సమగ్రమైన పోర్ట్‌ఫోలియోలో రెండు రకాల షేర్లు ఉండేలా చూసుకోవచ్చు.

  • పోర్ట్‌ఫోలియో స్థిరత్వం, స్వల్పకాలిక ట్రేడింగ్ లేదా మొమెంటమ్ వ్యూహాల కోసం లిక్విడ్ స్టాక్స్‌ను ప్రధాన ఆధారంగా ఎంచుకోవాలి.
  • అధిక రిస్క్ భరించే సామర్థ్యం, సుదీర్ఘ కాల పరిమితి ఉన్నవారు మాత్రమే సరైన పరిశోధన చేసిన తర్వాత ఇల్లిక్విడ్ స్టాక్స్‌లో చిన్న భాగాన్ని కేటాయించవచ్చు.
  • లాభాలు అందించే షేర్లను ఎంచుకోవడమే కాకుండా, అవసరమైనప్పుడు ఆ నిర్ణయాన్ని అమలు చేసే వెసులుబాటును పొందడమే విజయవంతమైన ఇన్వెస్ట్‌మెంట్. దానికి లిక్విడిటీనే కీలక ఆయుధం.

వ్యాసకర్త:

- శ్రీకాంత్ చౌహాన్,

హెడ్, ఈక్విటీ రీసెర్చ్,

కోటక్ సెక్యూరిటీస్

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe