...
...
Next Story

LPG cylinder : 'గ్యాస్ సిలిండర్' వెనుక అసలు కథ- మిస్టరీగా మొదలై.. ప్రపంచాన్ని మార్చేసిన అద్భుతం!

LPG gas cylinder shortage : ప్రతిరోజూ మనం వంటింట్లో వాడే ఎల్‌పీజీ సిలిండర్ వెనుక ఒక అద్భుతమైన సైన్స్ మిస్టరీ దాగి ఉందని మీకు తెలుసా? దాదాపు వంద ఏళ్ల క్రితం ఒక కారు యజమానికి వచ్చిన వింత సమస్యే నేడు మనం వాడుతున్న గ్యాస్ సిలిండర్ ఆవిష్కరణకు దారితీసిందని మీకు తెలుసా? ఆ ఆసక్తికరమైన కథనం మీకోసం..

Published on: Mar 14, 2026, 07:30:53 IST
Advertisement

ఇరాన్​- ఇజ్రాయెల్​, అమెరికా యుద్ధం నేపథ్యంలో ఇండియాలో ఎల్​పీజీ గ్యాస్​ సిలిండర్ల కొరత ఏర్పడిన విషయం తెలిసిందే. అందుకే, ఇప్పుడు సోషల్​ మీడియాలో ‘కట్టెల పొయ్యి’ ఫొటోలు, వీడియోలు వైరల్​గా మారుతున్నాయి. దేశంలో శతాబ్దాల పాటు అవే వినియోగంలో ఉండేవి. ఆ తర్వాతే ఎల్​పీజీ సిలిండర్ల విప్లవం వచ్చింది. అయితే ఈ ‘ఎల్​పీజీ గ్యాస్​ సిలిండర్’ వెనుక ప్రపంచాన్ని మార్చేసిన మిస్టరీ ఒకటుందని మీకు తెలుసా?

జర్నీ ఆఫ్​ ఎల్​పీజీ గ్యాస్​ సిలిండర్​..

ఎల్‌పీజీ సిలిండర్ వెనుక ఒక అద్భుతమైన సైన్స్ మిస్టరీ..
ఎల్‌పీజీ సిలిండర్ వెనుక ఒక అద్భుతమైన సైన్స్ మిస్టరీ..

ఎల్‌పీజీ సిలిండర్ ప్రస్థానం చాలా వింతగా, ఒక సామాన్యమైన సంఘటనతో మొదలైంది. 20వ శతాబ్దపు ప్రారంభంలో, అమెరికాలో ఒక వాహనదారుడు గ్యారేజీకి వెళ్లి ఒక వింత ఫిర్యాదు చేశాడు. తను పెట్రోల్ ట్యాంక్ నిండా ఇంధనం పోయించానని, కానీ అది ఎక్కడా వాడకపోయినా చాలా వేగంగా తగ్గిపోతోందని చెప్పాడు. అది విన్నవారందరికీ ఆశ్చర్యం కలిగింది.

ట్యాంక్‌లో ఎక్కడా లీకేజీ లేదు. సీల్ కూడా పక్కాగా ఉంది. మరి పెట్రోల్ స్థాయి ఎందుకు తగ్గిపోతోంది?

వాల్టర్ ఓ స్నెల్లింగ్ అనే యువ రసాయన శాస్త్రవేత్త డెస్క్ మీదకు ఈ చిక్కుముడి చేరింది. ఆ కారు యజమానికి అది కేవలం ఒక చిరాకు కలిగించే సమస్య కావచ్చు, కానీ స్నెల్లింగ్‌కు మాత్రం అది ఒక విప్పాల్సిన రహస్యంగా కనిపించింది.

అసలు ఆ ఇంధనం ఎక్కడికి పోతోంది? అనే ప్రశ్నతో ఆయన పరిశోధన మొదలుపెట్టారు.

ఒక మేధావి అన్వేషణ..

పెట్రోల్ లోపల దాగి ఉన్న అస్థిర వాయువుల (వొలటైల్​ గ్యాసెస్​) ప్రవర్తనను స్నెల్లింగ్ లోతుగా పరిశీలించారు. అప్పట్లో ఇంధనాన్ని కేవలం ఒక ద్రవ పదార్థంగానే భావించేవారు. దాని లోపల ఉండే తేలికపాటి వాయువులు ఆవిరైపోయి తప్పించుకోగలవనే విషయాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు.

అవే ప్రొపేన్, బ్యూటేన్. ఇవి చాలా తేలికైనవి, సులభంగా మండే స్వభావం కలిగినవి, గాలిలోకి త్వరగా కలిసిపోతాయి. అప్పట్లో చమురు శుద్ధి కర్మాగారాలు వీటిని కేవలం ఒక వ్యర్థ పదార్థాలుగా మాత్రమే చూసేవి. కానీ స్నెల్లింగ్‌కు అందులో వ్యర్థం కనిపించలేదు.. ఒక అద్భుతమైన అవకాశం కనిపించింది!

ప్రయోగశాల నుంచి ప్రతి ఇంటికి..

ఈ వాయువులపై ప్రెజర్​ పెంచి, చల్లబరిస్తే అవి ద్రవ రూపంలోకి మారుతాయని ఆయన కనుగొన్నారు. వీటిని బలమైన లోహపు కంటైనర్లలో భద్రపరిస్తే అవి స్థిరంగా ఉంటాయని, విడుదల చేసినప్పుడు తిరిగి వాయువుగా మారి స్వచ్ఛంగా మండుతాయని ఆయన నిరూపించారు. దీనికే లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (ఎల్​పీజీ) అని పేరు పెట్టారు.

కేవలం వాయువులను గుర్తించడమే కాకుండా, వాటిని సురక్షితమైన సిలిండర్లలో నిల్వ చేసే పద్ధతిని కూడా ఆయనే రూపొందించారు! ఈ ఆవిష్కరణ చాలా కీలకం. ఎందుకంటే సరైన కంటైనర్ లేకపోతే ఆ గ్యాస్ గాలిలో కలిసిపోతుంది.

వెంటనే ఇంజనీర్లు, కంపెనీలు దీని ప్రాముఖ్యతను గుర్తించాయి. అప్పట్లో.. ఫిలిప్స్ పెట్రోలియం కంపెనీ వంటి సంస్థలు దీనిని మార్కెట్లోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించాయి. ప్రారంభంలో పరిశ్రమలు, పైపులైన్ సౌకర్యం లేని మారుమూల ప్రాంతాల్లో దీనిని వాడేవారు. క్రమంగా నగరాలు పెరగడం, బొగ్గు, కట్టెల కన్నా స్వచ్ఛమైన ఇంధనం కోసం వెతుకులాట మొదలవడంతో.. ఎల్‌పీజీ సిలిండర్లు వంటింట్లోకి ప్రవేశించాయి. ఆ చిన్న లోహపు సిలిండర్ ప్రపంచవ్యాప్తంగా నిత్యావసర వస్తువుగా మారిపోయింది.

ఆవిష్కర్త గురించి..

వాల్టర్ స్నెల్లింగ్ 1880లో వాషింగ్టన్ డీసీలో జన్మించారు. కెమిస్ట్రీ- ఇంజనీరింగ్ రంగాల్లో పెనుమార్పులు వస్తున్న కాలంలో ఆయన పెరిగారు. అదృశ్యంగా ఉండి మన జీవితాలను ప్రభావితం చేసే శక్తుల గురించి తెలుసుకోవడం అంటే ఆయనకు ప్రాణం. పరిశోధనల్లో ఆయన చాలా ఓపిగ్గా, సూక్ష్మంగా ఉండేవారు. చాలామంది శాస్త్రవేత్తలు పట్టించుకోని ఆ పెట్రోల్ ట్యాంక్ లీకేజీ సమస్యను ఆయన ఒక క్లూగా భావించారు.

స్నెల్లింగ్ 1965లో మరణించారు. ఆయన మరణించే నాటికి ఆయన కనుగొన్న ఎల్‌పీజీ ప్రపంచమంతటా విస్తరించింది. నేడు మనం వంటింట్లో వాడుతున్న ఆ సాధారణమైన సిలిండర్ వెనుక ఒక మేధావి ఉత్సుకత, పట్టుదల, ఎవరూ పట్టించుకోని ఒక మిస్టరీని ఛేదించాలనే తపన దాగి ఉన్నాయి.

ఎల్​పీజీ గ్యాస్​ సిలిండర్​ విప్లవం..
 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks