...
...
Next Story

భర్తను కాదని ప్రియుడి చేయి పట్టిన యువతి! ఒప్పుకున్న హైకోర్టు..

మధ్యప్రదేశ్ హైకోర్టు గ్వాలియర్ బెంచ్ ఒక సంచలన తీర్పును వెలువరించింది. ఒక 19 ఏళ్ల యువతి తన 40 ఏళ్ల భర్తను, తనను కన్న తల్లిదండ్రులను కాదని, తనకు నచ్చిన వ్యక్తితో కలిసి జీవించాలని తీసుకున్న నిర్ణయాన్ని కోర్టు సమర్థించింది. ఒక మేజర్ తన జీవిత భాగస్వామిని ఎంచుకునే హక్కును కలిగి ఉంటుందని స్పష్టం చేసింది.

Published on: Apr 6, 2026, 13:30:20 IST
Advertisement

మధ్యప్రదేశ్​ హైకోర్టులోని గ్వాలియర్​ బెంచ్​కి సంబంధించిన ఒక కేసు ఇప్పుడు వార్తల్లోకి ఎక్కింది. ఓ యువతి.. తన భర్త, తన తల్లిదండ్రులు కాకుండా, తన ప్రియుడితో జీవితం గడపాలని నిర్ణయించుకుంది. వ్యక్తిగత స్వేచ్ఛకు పెద్ద పీట వేస్తూ, ఆ యువతి నిర్ణయానికి కోర్టు ఒప్పుకుంది.

కేసు నేపథ్యం ఏంటి?

మధ్యప్రదేశ్​ కోర్టులో.. వ్యక్తిగత స్వేచ్ఛ కేసు
మధ్యప్రదేశ్​ కోర్టులో.. వ్యక్తిగత స్వేచ్ఛ కేసు

ఈ వివాదం ఒక 'హేబియస్ కార్పస్' పిటిషన్‌తో మొదలైంది. తన భార్యను అనుజ్ కుమార్ అనే వ్యక్తి అక్రమంగా నిర్బంధించాడని, ఆమెను తన వద్దకు చేర్చాలని కోరుతూ ఓ వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు. భర్త ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు, ఆ యువతిని వెతికి పట్టుకుని, కోర్టులో హాజరుపరిచారు. అంతకుముందు ఆమెను ఒక వన్​ స్టాప్​ సెంటర్​లో పెట్టారు.

అయితే, న్యాయమూర్తులు ఆమెను ప్రశ్నించినప్పుడు, ఆమె మనసులో ఎలాంటి సందేహాలు లేవు. తన వైవాహిక జీవితం గురించి ఆమె కుండబద్ధలు కొట్టినట్టు చెప్పింది. తన వయస్సు 19 ఏళ్లని, తన భర్త వయస్సు 40 ఏళ్లని, వారిద్దరి మధ్య ఉన్న 21 ఏళ్ల వయస్సు వ్యత్యాసం వల్ల ఆ బంధంలో ఎప్పుడూ సమతుల్యత లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తన భర్త తనను సరిగ్గా చూసుకోవడం లేదని, అక్కడ ఉండటం తనకు ఇష్టం లేదని తేల్చి చెప్పింది.

న్యాయస్థానం ఇచ్చిన అవకాశం..

యువతి నిర్ణయం స్థిరంగా ఉన్నప్పటికీ, న్యాయమూర్తులు ఆమెకు పునరాలోచించుకునే అవకాశం కల్పించారు. జస్టిస్ ఆనంద్ పాఠక్, జస్టిస్ పుష్పేంద్ర యాదవ్​లతో కూడిన డివిజన్ బెంచ్ ఆమెకు కౌన్సెలింగ్ ఇప్పించాలని ఆదేశించింది. బహుశా భావోద్వేగంలో ఆమె ఇలాంటి నిర్ణయం తీసుకుందేమోనని కోర్టు భావించింది. కానీ, కౌన్సెలింగ్ సెషన్ల తర్వాత కూడా ఆమె తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. తను ప్రేమించిన వ్యక్తితోనే ఉంటానని గట్టిగా చెప్పింది. ఆమె వెంటే ఉన్న

యువతి మేజర్ అని, ఆమె ఎవరి అక్రమ నిర్బంధంలో లేదని నిర్ధారించుకున్న తర్వాత, భర్త దాఖలు చేసిన పిటిషన్‌కు విలువే లేకుండా పోయింది. ఒక వయోజన వ్యక్తి ఎక్కడ ఉండాలి, ఎవరితో ఉండాలి అనే నిర్ణయం తీసుకునే పూర్తి హక్కు సదరు వ్యక్తికే ఉంటుందని మధ్యప్రదేశ్​ హైకోర్టు పునరుద్ఘాటించింది. ఆమె ఇష్టప్రకారం తన ప్రియుడితో వెళ్లేందుకు న్యాయస్థానం అనుమతినిచ్చింది.

రక్షణ కవచంగా "శౌర్య దీదీ"..

కేసును ముగించే ముందు, కోర్టు ఆ యువతి భద్రతపై ప్రత్యేక శ్రద్ధ చూపింది. ఆమె కొత్త జీవితంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండేందుకు ఒక రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసింది. రాబోయే ఆరు నెలల పాటు "శౌర్య దీదీ" అని పిలిచే ప్రత్యేక మహిళా అధికారులు ఆ యువతితో టచ్‌లో ఉంటారు. ఆమె క్షేమ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, ఆమె భద్రతను నిర్ధారిస్తారు.

అవసరమైన అన్ని ఫార్మాలిటీలు పూర్తి చేసిన తర్వాత ఆమెను వన్-స్టాప్ సెంటర్ నుంచి విడుదల చేయాలని కోర్టు ఆదేశించింది. ఈ కేసు కేవలం ఒక చట్టపరమైన వివాదంగా మొదలైనప్పటికీ, చివరకు వ్యక్తిగత స్వేచ్ఛకు ఒక నిదర్శనంగా ముగిసింది. ఒక వయోజనుడి జీవితంలో తుది నిర్ణయం ఆ వ్యక్తిదేనని కోర్టు మరోసారి స్పష్టమైన గీత గీసింది.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe