...
...
Next Story

‘లవ్ ట్రాప్’తో 180 మందిపై అఘాయిత్యం.. అశ్లీల వీడియోలతో బ్లాక్‌మెయిల్ చేసిన యువకుడి అరెస్ట్

మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో వెలుగుచూసిన ఈ ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. వందల మంది బాలికలను వలలో వేసుకుని, వారి జీవితాలతో ఆడుకున్న అయాన్ అహ్మద్ ఆగడాలకు పోలీసులు చెక్ పెట్టారు.

Published on: Apr 16, 2026, 06:42:00 IST
Advertisement

మహారాష్ట్రలోని అమరావతి జిల్లా పరత్వాడలో మానవత్వాన్ని మంటగలిపే దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రేమ పేరుతో వంచించి, వందలాది మంది మహిళలు, మైనర్ బాలికల జీవితాలను చిన్నాభిన్నం చేసిన అయాన్ అహ్మద్ అలియాస్ తన్వీర్ అహ్మద్‌ను పోలీసులు ఎట్టకేలకు కటకటాల్లోకి నెట్టారు. నిందితుడి వికృత చేష్టలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ దారుణాలన్నీ బయటపడ్డాయి. ఈ కేసు తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న పోలీసులు రంగంలోకి దిగి, ఏప్రిల్ 11న నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

లవ్ ట్రాప్

19 ఏళ్ల అయాన్ అహ్మద్‌ను అరెస్టు చేసిన పోలీసులు (PTI)
19 ఏళ్ల అయాన్ అహ్మద్‌ను అరెస్టు చేసిన పోలీసులు (PTI)

అయాన్ అహ్మద్ అమాయక బాలికలను లక్ష్యంగా చేసుకుని 'లవ్ ట్రాప్' వేసేవాడని పోలీసులు ప్రాథమిక విచారణలో గుర్తించారు. అందమైన మాటలతో వారిని ఆకర్షించి, ప్రేమ పేరుతో ముంబై, పుణె వంటి నగరాలకు తీసుకెళ్లేవాడు. అక్కడ వారితో చనువుగా ఉంటూ, వారికి తెలియకుండా లేదా బలవంతంగా అశ్లీల వీడియోలు, ఫోటోలు చిత్రీకరించేవాడు. ఈ వీడియోలను అడ్డం పెట్టుకుని ఆపై తన అసలు రూపాన్ని బయటపెట్టేవాడు.

180 మంది బాధితులు.. ఎక్కువగా మైనర్లు

ఈ కేసులో అత్యంత భయంకరమైన విషయం ఏమిటంటే, బాధితుల సంఖ్య ఏకంగా 180 వరకు ఉండవచ్చని సమాచారం. అందులోనూ ఎక్కువ మంది మైనర్ బాలికలేనని తెలుస్తోంది. "నిందితుడు పక్కా ప్రణాళికతో బాలికలను ట్రాప్ చేసి, వారిని లైంగికంగా వేధించడమే కాకుండా ఆ దృశ్యాలను రికార్డ్ చేశాడు" అని దర్యాప్తు అధికారులు వెల్లడించారు. బాధితులు పరువు పోతుందన్న భయంతో ఇప్పటివరకు ఫిర్యాదు చేయడానికి ముందుకు రాకపోవడం గమనార్హం. అయితే, సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ కావడంతో పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు.

బ్లాక్‌మెయిల్ నుంచి వ్యభిచారం వరకు..

కేవలం వీడియోలు తీయడంతోనే అయాన్ ఆగలేదు. ఆ దృశ్యాలను సోషల్ మీడియాలో పెడతానని బాధితులను బెదిరిస్తూ బ్లాక్‌మెయిల్‌కు పాల్పడేవాడు. అంతటితో ఆగకుండా, ఆ వీడియోలతో వారిని లొంగదీసుకుని బలవంతంగా వ్యభిచార కూపంలోకి నెట్టేందుకు ప్రయత్నించాడని తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. సమాజంలో వారి ప్రతిష్ఠను భంగం చేస్తానంటూ నరకయాతన చూపించినట్లు విచారణలో తేలింది.

రంగంలోకి ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT)

నేరస్తులకు కఠిన సంకేతాలు పంపేలా అమరావతి జిల్లా యంత్రాంగం కీలక చర్యలు తీసుకుంది. పోలీసుల సమక్షంలో పరత్వడలోని నిందితుడి నివాసం వెలుపల ఉన్న అక్రమ కట్టడాలను బుల్డోజర్లతో కూల్చివేశారు. ఇంటి బయట నిర్మించిన ఇనుప మెట్లను, ఇతర అనధికార నిర్మాణాలను అధికారులు నేలమట్టం చేశారు. నిందితుడిపై భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 294తో పాటు, పోక్సో (POCSO) చట్టంలోని సెక్షన్ 8, 12 మరియు ఐటీ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు.

 
ABOUT THE AUTHOR
Praveen Kumar Lenkala

ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe