...
...
Next Story

కొండపై యువకుడి సూసైడ్ అటెంప్ట్- ఆపేందుకు ప్రయత్నిస్తూ చనిపోయిన తండ్రి, చివరికి తల్లి కూడా..

ఐఫోన్ ఈఎంఐ చెల్లించలేకపోయినందుకు కుటుంబంలో తలెత్తిన గొడవ.. మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో ఘోర విషాదానికి దారితీసింది. కొండపై నుంచి దూకేందుకు ప్రయత్నిస్తున్న కొడుకుని ఆపేందుకు తండ్రి వెళ్లగా, ఇద్దరూ కిందపడిపోయారు! అది చూసి, మనస్తాపంతో తల్లి సైతం కొండపై నుంచి దూకి ప్రాణాలు కోల్పోయింది.

Published on: Aug 22, 2026, 06:45:40 IST
Advertisement

మహారాష్ట్ర ఛత్రపతి శంభాజీనగర్‌లో జరిగిన ఒక హృదయ విదారక ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ‘ఐఫోన్’ కొనుగోలు చేసిన ఓ 18ఏళ్ల యువకుడు, దాని ఈఎంఐ కట్టలేక కుటుంబంతో గొడవకు దిగాడు! చివరికి చనిపోవాలనుకుని కొండపై నుంచి దూకేందుకు ప్రయత్నించాడు. కుమారుడిని ఆపేందుకు తండ్రి ప్రయత్నించాడు. కానీ అదే సమయంలో ఇద్దరు కొండపై నుంచి కింద పడిపోయి ప్రాణాలు కోల్పోయారు. అనంతరం, ఆ యువకుడి తల్లి కూడా పై నుంచి కిందకు దూకేసి చనిపోయింది.

అసలేం జరిగింది?

మహారాష్ట్రలో ఘోర విషాదం!
మహారాష్ట్రలో ఘోర విషాదం!

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. పద్దెనిమిదేళ్ల కునాల్ ఎంతో ఆశపడి ఒక ఐఫోన్ కొనుగోలు చేశాడు. అయితే ఆ ఫోన్ ఈఎంఐ డబ్బులు చెల్లించే స్థోమత లేకపోవడంతో అసలు సమస్య మొదలైంది.

ఐఫోన్ ఈఎంఐ కట్టమని కునాల్ తన కుటుంబ సభ్యులను పదే పదే అడిగాడు. ఈ విషయంలో తండ్రితో తీవ్ర వాగ్వాదం జరగడంతో కోపంతో ఊగిపోయిన ఆ యువకుడు శుక్రవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. వాలుజ్ ఎంఐడీసీ పోలీసు స్టేషన్ పరిధిలోని తిస్‌గావ్ ప్రాంతంలోని ఒక కొండ ఎక్కాడు.

కునాల్ వెనుకనే తల్లిదండ్రులు కూడా అక్కడకు చేరుకున్నారు. స్థానికులతో కలిసి దాదాపు మూడు గంటల పాటు అతడిని కిందికి దిగేలా ఒప్పించేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు.

"నీ తల్లి కోసం బతుకు నాయనా," అని కొందరు బ్రతిమలాడగా, "లేదు, నేను చావాల్సిందే.. నాకు అదే ఏకైక దారి," అంటూ కునాల్ తేల్చిచెప్పినట్టు వైరల్ అయిన వీడియో ద్వారా తెలుస్తోంది.

ఘటన జరిగిన సమయంలో తిస్‌గావ్ గ్రామ మాజీ సర్పంచ్ సంజయ్ జాదవ్ కూడా అక్కడే ఉన్నారు. "నువ్వు చదువుకున్నావు.. నీకు మంచి భవిష్యత్తు ఉంది.. తల్లి వైపు చూడు అని మేము చాలా బ్రతిమలాడాము," అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

కునాల్‌ను కాపాడేందుకు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నప్పటికీ భద్రతా వలయం ఎందుకు ఏర్పాటు చేయలేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గంటల తరబడి హైడ్రామా నడిచిన తర్వాత, మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో కునాల్ తండ్రి మురళీధర్ చంద్‌గుడే కొంచెం పైకి ఎక్కి తన కొడుకును కొండ అంచుల నుంచి వెనక్కి లాగేందుకు ప్రయత్నించాడు. ఆ సమయంలో ఇద్దరూ ప్రమాదవశాత్తు బ్యాలెన్స్ కోల్పోయి లోయలోకి పడిపోయారు. కళ్ల ముందే భర్త, కొడుకు లోయలో పడిపోవడం చూసిన తల్లి.. క్షణం కూడా ఆలోచించకుండా కొండపై నుంచి దూకేసింది!

ఈ ఘోర ప్రమాదంలో ముగ్గురూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు జరుపుతున్నట్లు అధికారులు తెలిపారు.

కొండపై గంటల తరబడి జరిగిన ఈ హైడ్రామాను పలువురు స్థానికులు, టూరిస్టులు తమ కెమెరాలలో బంధించారు. ఈ యువకుడు గతంలో ఏమైనా డిప్రెషన్‌తో బాధపడ్డాడా లేదా కుటుంబ వివాదానికి అసలు కారణాలు ఏంటనే కోణంలో పోలీసులు పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks