Electric cars : దూసుకెళుతున్న మహీంద్రా బీఈ 6- ఇక బీ07 వంతు! లాంచ్ ఎప్పుడంటే..
మహీంద్రా తన తదుపరి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ 'బీ07' లాంచ్ టైమ్‌లైన్‌ను 2027కు మార్చింది. బార్న్ ఎలక్ట్రిక్ సిరీస్‌లో భాగంగా వస్తున్న ఈ కారు, ఇప్పటికే మార్కెట్లో దుమ్మురేపుతున్న బీఈ6, ఎక్స్ఈవీ మోడళ్ల కంటే అడ్వాన్స్డ్గా ఉండబోతోంది.
ఎస్‌యూవీలకు పెట్టింది పేరైనా మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థ.. ఎలక్ట్రిక్ వాహనాల సెగ్మెంట్లో రారాజుగా కొనసాగుతున్న టాటా మోటార్స్‌కి గట్టిపోటీని ఇస్తోంది. ఇందులో భాగంగానే గతేడాది.. బార్న్ ఎలక్ట్రిక్ సిరీస్‌లో భాగంగా లాంచ్ అయిన మహీంద్రా బీఈ 6, ఎక్స్ఈవీ 9ఈ, ఎక్స్ఈవీ 9ఎస్కి ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. మరీ ముఖ్యంగా బీఈ 6 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీకి మంచి క్రేజ్ కనిపిస్తోంది. ఈ మోడల్ భారత రోడ్లపై దూసుకెళుతోంది. ఇక ఇప్పుడు ఇదే జోరును కొనసాగిస్తూ.. మహీంద్రా సంస్థ తన నెక్ట్స్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని ఇండియాలో లాంచ్ చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది.

ప్రస్తుతం అంతర్గతంగా 'బీ07' అనే కోడ్ నేమ్‌తో పిలుస్తున్న ఈ కొత్త ఆల్-ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ 2027లో మార్కెట్లోకి అడుగుపెట్టనుంది. నిజానికి ఇది 2026 చివరి నాటికే రావాల్సి ఉన్నప్పటికీ, కంపెనీ ఈ గడువును మరుసటి ఏడాదికి పొడిగించింది. ఈ విషయాన్ని మహీంద్రా ఆటో అండ్ ఫార్మ్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజేష్ జెజూరికర్ స్వయంగా వెల్లడించారు.
మహీంద్రా బీ07 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ- పేరు మారనుంది..
'బీ07' అనేది కేవలం కంపెనీ పెట్టుకున్న కోడ్ నేమ్ మాత్రమేనని, మార్కెట్లోకి వచ్చే సమయానికి దీనికి సరికొత్త బ్రాండ్ పేరును ఖరారు చేస్తామని ఆయన స్పష్టం చేశారు.
ఇది 2022లో ప్రదర్శించిన 'బీఈ.07' కాన్సెప్ట్ ఆధారంగా తయారవుతోంది.
మార్కెట్లో మహీంద్రా ఈవీల జోరు..
మహీంద్రా ఇప్పటికే తన ఎలక్ట్రిక్ వ్యూహాన్ని సక్సెస్‌ఫుల్‌గా అమలు చేస్తోంది. 2022లో చూపించిన 5 కాన్సెప్ట్ కార్లలో ఇప్పటికే మూడు రోడ్ల మీదకు వచ్చాయి:
BE.05 మోడల్ ఇప్పుడు BE6 పేరుతో సేల్ అవుతోంది.
ఎక్స్‌యూవీ.ఈ8, ఎక్స్‌యూవీ.ఈ9 మోడళ్లు వరుసగా ఎక్స్ఈవీ 9ఎస్, ఎక్స్ఈవీ 9ఈలుగా మారాయి.
ఈ కార్లకు కస్టమర్ల నుంచి భారీ స్పందన లభిస్తోంది. కేవలం ఏడాది లోపే బీఈ 6, ఎక్స్ఈవీ 9ఈ మోడళ్లు కలిపి ఏకంగా 41,000 యూనిట్ల విక్రయాలను సాధించడం విశేషం. తాజాగా విడుదలైన ఎక్స్ఈవీ 9ఎస్ కూడా మంచి అమ్మకాలను నమోదు చేస్తోంది. ఈ ఊపును 'బీ07' మరింత పెంచుతుందని కంపెనీ ధీమాగా ఉంది.
మహీంద్రా బీ07- టెక్నాలజీ, పవర్..
రాబోయే బీ07 ఎస్‌యూవీ మహీంద్రా సుప్రసిద్ధ 'INGLO' ఆర్కిటెక్చర్ ఆధారంగా రూపొందుతోంది. ఇందులో కస్టమర్ల అవసరాలకు తగ్గట్టుగా 60 కేడబ్ల్యూహెచ్ నుంచి 80 కేడబ్ల్యూహెచ్ వరకు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లు ఉండే అవకాశం ఉంది. డిజైన్ పరంగా ప్రస్తుత ఈవీల మాదిరిగానే మోడ్రన్ లుక్‌ను కలిగి ఉంటుంది.
మహీంద్రా బీ07- హై-టెక్ ఇంటీరియర్..
కాన్సెప్ట్ వెర్షన్‌లో చూపించిన విధంగానే, ఈ కారులో డాష్‌బోర్డ్ అంతటా విస్తరించి ఉండే భారీ ట్రిపుల్-స్క్రీన్ సెటప్, పనోరమిక్ సన్‌రూఫ్, ఫిజికల్ బటన్లు లేని టచ్-బేస్డ్ కంట్రోల్స్ ఉండబోతున్నాయి. అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (అడాస్), కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, ఓవర్-ది-ఎయిర్ (ఓటీఏ) అప్‌డేట్స్ వంటి ఫీచర్లు ఈ కారు సొంతం.
ఈ మహీంద్రా బీ07 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీకి సంబంధించి రానున్న రోజుల్లో మరిన్ని వివరాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
తరచూ అడిగే ప్రశ్నలు-
1. మహీంద్రా బీ07 ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఎంత దూరం (రేంజ్) ప్రయాణిస్తుంది?
సమాధానం- మహీంద్రా బీ07 ఎస్‌యూవీలో 60 kWh నుంచి 80 kWh సామర్థ్యం కలిగిన బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లు ఉండే అవకాశం ఉంది. దీనివల్ల ఈ కారు ఒక్కసారి పూర్తి ఛార్జింగ్‌తో సుమారు 450 నుంచి 500 కిలోమీటర్ల కంటే ఎక్కువ రేంజ్‌ను అందిస్తుందని అంచనా. అంతేకాకుండా, ఇది 175 kW ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది, దీని ద్వారా కేవలం 30 నిమిషాల్లోనే 5% నుంచి 80% వరకు ఛార్జింగ్ చేసుకోవచ్చు.
2. మార్కెట్లో ఈ కారు ధర ఎంత ఉండవచ్చు, దీనికి పోటీదారులు ఎవరు?
సమాధానం- మహీంద్రా బీ07 ధర సుమారు రూ. 25 లక్షల నుంచి రూ. 30 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉండే అవకాశం ఉంది. ఇది ప్రీమియం మిడ్-సైజ్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ విభాగంలో వస్తున్నందున, మార్కెట్లో దీనికి పోటీగా టాటా హారియర్ ఈవీ, హ్యుందాయ్ క్రెటా ఈవీ, మారుతీ సుజుకీ ఈ విటార వంటి మోడళ్లు నిలవనున్నాయి.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


