Electric cars : బ్యాటరీ సబ్‌స్క్రిప్షన్ స్కీమ్‌తో లభిస్తున్న టాప్ ఈవీలు ఇవి- లక్షల్లో డబ్బులు ఆదా!
ఎలక్ట్రిక్ వాహనాల ధరలు భారంగా మారుతున్న వేళ, 'బ్యాటరీ-యాజ్-ఏ-సర్వీస్' (బీఏఏఎస్) స్కీమ్ విప్లవాత్మక మార్పులు తెస్తోంది. బ్యాటరీ ధరను మినహాయించి కారును తక్కువ ధరకే కొనుగోలు చేసే వెసులుబాటును టాటా, మారుతీ, ఎంజీ సంస్థలు కల్పిస్తున్నాయి. ఆ వివరాలు మీకోసం..
ఎలక్ట్రిక్ వాహనాల పట్ల ఆసక్తి ఉన్నప్పటికీ, సాధారణ పెట్రోల్, డీజిల్ (ఐసీఈ) కార్ల కంటే వాటి ధరలు ఎక్కువగా ఉండటం చాలామందిని వెనకడుగు వేయించేలా చేస్తోంది. ఈ ధర పెరగడానికి ప్రధాన కారణం అందులో వాడే భారీ బ్యాటరీ ప్యాక్. ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రముఖ ఆటోమొబైల్ సంస్థలు ఇప్పుడు 'బ్యాటరీ-యాజ్-ఏ-సర్వీస్' (బీఏఏఎస్) అనే సరికొత్త స్కీమ్‌ను అందుబాటులోకి తెచ్చాయి. అసలేంటి ఈ బీఏఏఎస్ స్కీమ్? ఇండియాలో ఈ స్కీమ్ ద్వారా అందుబాటులో ఉన్న ఈవీలు ఏవి? ఇక్కడ డీటైల్డ్‌గా తెలుసుకోండి..

బీఏఏఎస్ స్కీమ్ అంటే ఏంటి?
ఈ బీఏఏఎస్ విధానంలో మీరు ఎలక్ట్రిక్ కారును కొనేటప్పుడు బ్యాటరీ ధర చెల్లించాల్సిన అవసరం లేదు. కేవలం కారు ధరను మాత్రమే చెల్లించి, బ్యాటరీకి నెలవారీగా లేదా కిలోమీటరుకు కొంత చొప్పున 'రెంటల్' (సబ్‌స్క్రిప్షన్) చెల్లిస్తే సరిపోతుంది. దీనివల్ల కారు ప్రారంభ ధర భారీగా, ఇంకా చెప్పాలంటే రూ. లక్షల్లో తగ్గుతుంది. కారును ఎక్కువగా నడపకుండా, అప్పుడప్పుడు తీసే వారికి ఇది మంచి ఆప్షన్!
బీఏఏఎస్ స్కీమ్ ద్వారా అందుబాటులో ఉన్న ఎలక్ట్రిక్ కార్లు..
1. ఎంజీ కామెట్ ఈవీ
భారతదేశంలో అత్యంత చౌకైన ఈవీల్లో ఒకటిగా పేరుగాంచిన కామెట్ ఈవీ ధర బీఏఏఎస్ స్కీమ్ కింద కేవలం రూ. 4.92 లక్షల నుంచే ప్రారంభమవుతుంది.
ప్రైజ్ కట్: సాధారణ ఖర్చుతో పోల్చితే దాదాపు రూ. 2.71 లక్షలు ఆదా అవుతుంది.
రెంటల్ ఫీజు: కిలోమీటరుకు రూ. 3.2 చొప్పున చెల్లించాలి.
2024లో ప్రారంభించినప్పుడు ఇది రూ. 2.5 గా ఉండేది, ఇప్పుడు రూ. 3.2 కి పెరిగింది.
2. టాటా పంచ్ ఈవీ
టాటా పంచ్ ఈవీ ఫేస్‌లిఫ్ట్ వర్షెన్ ఇటీవలే లాంచ్ అయ్యింది. ఎలక్ట్రిక్ వాహనాల దిగ్గజ టాటా మోటార్స్.. ఈ పంచ్ ఈవీతోనే బీఏఏఎస్ స్కీమ్‌ని తొలిసారి తన కస్టమర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనివల్ల ఎలక్ట్రిక్ కారు ధర గణనీయంగా తగ్గింది.
బీఏఏఎస్ ధర: రూ. 6.49 లక్షల నుంచి మొదలు. (సాధారణ ధర రూ. 9.69 లక్షలు).
రెంటల్ ఫీజు: కిలోమీటరుకు రూ. 2.6 మాత్రమే. దేశంలోనే అతి తక్కువ బ్యాటరీ రెంటల్ ఫీజు ఇదే కావడం విశేషం.
3. ఎంజీ విండ్సర్ ఈవీ
ఇండియాలో ప్రస్తుతం బెస్ట్ సెల్లింగ్ ఎలక్ట్రిక్ కారుగా ఉంది ఈ ఎంజీ విండ్సర్ ఈవీ. ఇందులో రెండు రకాల బ్యాటరీ ఆప్షన్లు ఉన్నాయి. బ్యాటరీ పరిమాణాన్ని బట్టి రెంటల్ మారుతుంటుంది.
బీఏఏఎస్ ధర: రూ. 9.99 లక్షల నుంచి ప్రారంభం.
రెంటల్ ఫీజు: 38 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీకి రూ. 3.9/కి.మీ, పెద్దదైన 52.9 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీకి రూ. 4.5/కి.మీ.
లాభం: దీనివల్ల కొనుగోలు సమయంలో రూ. 5.11 లక్షల వరకు భారం తగ్గుతుంది.
4. మారుతీ సుజుకీ ఈ-విటారా
మారుతీ సుజుకీ నుంచి వస్తున్న తొలి ఈవీ 'ఈ-విటారా' కూడా ఈ స్కీమ్‌తో అందుబాటులో ఉంది.
బీఏఏఎస్ ధర: రూ. 10.99 లక్షల నుంచి మొదలు.
రెంటల్ ఫీజు: 49 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీకి రూ. 3.99/కి.మీ, పెద్ద బ్యాటరీకి రూ. 4.39/కి.మీ.
ప్రత్యేకత: ఈ స్కీమ్ ద్వారా కస్టమర్లు ఏకంగా రూ. 5.50 లక్షల వరకు ఆదా చేయవచ్చు! దేశంలోనే అత్యధికంగా ఈ కారుకే ప్రైజ్ డ్రాప్ ఉంది.
5. ఎంజీ జెడ్ఎస్ ఈవీ
ప్రీమియం ఈవీ విభాగంలో ఉన్న జెడ్ఎస్ ఈవీ కూడా ఈ బీఏఏఎస్ పరిధిలోకి వచ్చింది.
బీఏఏఎస్ ధర: రూ. 13 లక్షల నుంచి ప్రారంభం.
రెంటల్ ఫీజు: కిలోమీటరుకు రూ. 4.5.
లాభం: కొనుగోలు సమయంలో రూ. 5.24 లక్షల వరకు ఆదా అవుతుంది.
ఈ స్కీమ్ వల్ల కారును తక్కువ ధరకే ఇంటికి తీసుకెళ్లవచ్చు. అయితే, కంపెనీలు కాలక్రమేణా కిలోమీటరుకు వసూలు చేసే రెంటల్ ధరను పెంచే అవకాశం ఉంటుందని గుర్తుంచుకోవాలి. ఇది దీర్ఘకాలిక పొదుపుపై స్వల్ప ప్రభావం చూపవచ్చు.
ప్రశ్నలు- సమాధానాలు :-
ప్రశ్న- బీఏఏఎస్ స్కీమ్ కింద కారు కొంటే బ్యాటరీపై వారంటీ ఉంటుందా?
సమాధానం- కచ్చితంగా ఉంటుంది. నిజానికి ఈ స్కీమ్‌లో బ్యాటరీ యాజమాన్యం కంపెనీ లేదా సంబంధిత సర్వీస్ ప్రొవైడర్ వద్ద ఉంటుంది కాబట్టి, బ్యాటరీ పనితీరు బాధ్యత కూడా వారిదే. బ్యాటరీలో ఏదైనా సాంకేతిక సమస్య తలెత్తినా లేదా నిర్ణీత స్థాయి కంటే సామర్థ్యం తగ్గినా, కంపెనీయే దానికి పూర్తి బాధ్యత వహిస్తుంది. దీనివల్ల కస్టమర్లకు బ్యాటరీ లైఫ్, రీప్లేస్‌మెంట్ ఖర్చుల గురించి ఎలాంటి ఆందోళన ఉండదు.
ప్రశ్న- కిలోమీటరుకు చెల్లించే రెంటల్ ఫీజు ఎప్పుడూ ఒకేలా ఉంటుందా?
సమాధానం- లేదు, ఇది మారే అవకాశం ఉంది. ఎంజీ మోటార్స్ ఉదాహరణను చూస్తే, ప్రారంభంలో కిలోమీటరుకు రూ. 2.5 గా ఉన్న సబ్‌స్క్రిప్షన్ ఫీజును కాలక్రమేణా రూ. 3.2 కి పెంచారు. అంటే, భవిష్యత్తులో కంపెనీలు నిర్వహణ ఖర్చులు లేదా ఇతర కారణాల రీత్యా ఈ రెంటల్ ధరలను స్వల్పంగా పెంచే అవకాశం ఉంటుంది. అందుకే ఈ స్కీమ్ ఎంచుకునే ముందే అగ్రిమెంట్‌లోని నిబంధనలను క్షుణ్ణంగా చదవడం మంచిది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


