Mahindra Thar OG : మహీంద్రా థార్ ఓజీ కొనాలా? వద్దా? డీటైల్డ్​ ఫస్ట్​ డ్రైవ్​ రివ్యూ..

మహీంద్రా ఇటీవలే లాంచ్ చేసిన థార్ ఫేస్​లిఫ్ట్ “థార్ ఓజీ”ని కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఇది మీకోసమే. హెచ్​టీ ఆటో టీమ్ నిర్వహించిన మహీంద్రా థార్ ఓజీ ఫస్ట్​ డ్రైవ్​ రివ్యూని ఇక్కడ డీటైల్డ్​గా తెలుసుకోండి..

Published on: Oct 4, 2026, 15:33:52 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

భారతీయ ఆటోమొబైల్ రంగానికి 'మహీంద్రా థార్' ఒక వాహనం మాత్రమే కాదు, లక్షలాది మందికి ఒక ఎమోషన్. అడ్వెంచర్ ప్రియులతో పాటు నిత్యం ఆన్-రోడ్ ప్రయాణాలు చేసే యువతను సైతం థార్ విశేషంగా ఆకట్టుకుంది. ఈ క్రేజ్‌ను మరింత పెంచుతూ మహీంద్రా సంస్థ 2026 మోడల్‌ను 'థార్ ఓజీ' పేరుతో లాంచే చేసింది. మరి ఈ కొత్త థార్ ఓజీ పాత ఆఫ్‌రోడ్ సత్తాను నిలబెట్టుకుందా? రోడ్డుపై రోజువారీ ప్రయాణాలకు ఎంతవరకు సౌకర్యవంతంగా మారింది? రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ పరిసర ప్రాంతాల్లో 300 కిలోమీటర్లకు పైగా టెస్ట్ డ్రైవ్ చేసిన అనుభవంతో హెచ్​టీ ఆటో టీమ్ అందిస్తున్న ప్రత్యక్ష సమీక్ష ఇది.

మహీంద్రా థార్ ఓజీ ఫస్ట్​ డ్రైవ్​ రివ్యూ..
మహీంద్రా థార్ ఓజీ ఫస్ట్​ డ్రైవ్​ రివ్యూ..

మహీంద్రా థార్ ఓజీ రివ్యూ- ఆకట్టుకునే డిజైన్..

థార్ ఓజీ డిజైన్‌లో మహీంద్రా కొన్ని ఆసక్తికరమైన మార్పులు చేసింది. ముందరి భాగంలో తీసుకొచ్చిన గ్రిల్ డిజైన్‌తో పాటు దానిపై 'Thar' అని ప్రత్యేకంగా పొందుపరచడం వాహనానికి సరికొత్త రూపానిచ్చింది. కొత్తగా అందించిన 19 అంగుళాల అల్లాయ్ వీల్స్, వైపులా ఉన్న ఓజీ బ్యాడ్జ్ వాహనానికి అదనపు శోభను చేకూర్చాయి. చీకట్లో స్పష్టమైన వెలుతురునిచ్చే ఎల్ఈడీ హెడ్‌లాంప్‌లు, బంపర్‌లో అమర్చిన ఐస్-క్యూబ్ ఆకారపు ఎల్ఈడీ ఫాగ్ లాంప్‌లు రాత్రి ప్రయాణాలను సురక్షితం చేస్తాయి.

లోపలి భాగంలో ట్రఫుల్ బ్రౌన్ కలర్ సీట్లు కేబిన్‌కు విలాసవంతమైన లుక్‌ను తెచ్చాయి. వీల్స్ వైడ్ విడ్త్ 60 మిల్లీమీటర్లు పెంచడం వల్ల థార్ ఇప్పుడు రోడ్డుపై మరింత భారీగా, స్థిరంగా కనిపిస్తోంది.

మహీంద్రా థార్ ఓజీ రివ్యూ- సిటీ ప్రయాణాలకు అనుకూలం..

పాత థార్‌లో ఉన్న హైడ్రాలిక్ స్టీరింగ్ స్థానంలో ఇప్పుడు ఎలక్ట్రిక్ పవర్ స్టీరింగ్‌ను ప్రవేశపెట్టారు. దీనివల్ల నగరాల్లో ట్రాఫిక్ మధ్య డ్రైవ్ చేయడం, యూ-టర్న్‌లు తీసుకోవడం అత్యంత తేలికగా మారింది. హైవేలలో వేగంగా వెళుతున్నప్పుడు స్టీరింగ్ గ్రిప్ బరువుగా మారి కంట్రోల్‌ను పెంచుతుంది.

కాబిన్ ఇన్సులేషన్‌ను మెరుగుపరచడం వల్ల బయటి టైర్ల శబ్దం లోపలికి రాకుండా ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. కొత్తగా అందించిన పెంటాలింక్ రియర్ సస్పెన్షన్, డావిన్సీ డాంపింగ్ టెక్నాలజీ వల్ల రోడ్లపై ఉండే పెద్ద పెద్ద గోతులు, స్పీడ్ బ్రేకర్లను ఈ కార్ తేలికగా అధిగమిస్తుంది. నాలుగు చక్రాలకు డిస్క్ బ్రేకులు అందించడం వల్ల వాహనం ఆపే సామర్థ్యం, కంట్రోల్ చాలా బాగున్నాయి.

మహీంద్రా థార్ ఓజీ రివ్యూ- ఆఫ్ రోడింగ్‌లో నిజమైన డెవిల్!

టెస్ట్ డ్రైవ్ కోసం హెచ్​టీ ఆటో టీమ్ ఎంచుకున్న 2.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ 161 బీహెచ్​పీ పవర్, 330 ఎన్​ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఎగ్జాస్ట్ సౌండ్, టర్బో విజిల్ డ్రైవింగ్ అనుభూతిని పెంచుతాయి. జోధ్‌పూర్ ఎడారి ఇసుక దిబ్బలపై ప్రయాణించినప్పుడు థార్ ఓజీ తన అసలైన పవర్ ఏంటో నిరూపించుకుంది.

కొత్తగా ప్రవేశపెట్టిన టెర్రైన్ మోడ్‌లు క్లిష్టమైన దారుల్లో డ్రైవింగ్‌ను సులభం చేస్తాయి. ఎలక్ట్రానిక్ లాకింగ్ రియర్ డిఫరెన్షియల్, ఫ్రంట్ బ్రేక్-లాకింగ్ డిఫరెన్షియల్ సాయంతో పట్టు కోల్పోయిన చక్రాలను సమర్థవంతంగా నియంత్రిస్తూ ఏటవాలుగా ఉన్న ఎడారి దారులను కూడా థార్ సునాయసంగా దాటేసింది. 80 కిమీ వేగంతో ఏసీ ఆన్ చేసి ప్రయాణించినప్పుడు లీటరుకు 10 కిలోమీటర్లు, 50 కిమీ వేగంతో 15 కిలోమీటర్ల మైలేజ్ నమోదు చేసింది.

మహీంద్రా థార్ ఓజీ రివ్యూ- ఇంకా మెరుగుపడాల్సిన అంశాలు..

హైవే ప్రయాణాల్లో దీని నిటారైన విండ్‌స్క్రీన్ వల్ల పురుగులు పడి తరచూ శుభ్రం చేసుకోవాల్సి వస్తోంది. పాతకాలపు వైపర్లు అంతగా ఉపయోగపడవు. ఎక్కువ వేగంతో ప్రయాణిస్తున్నప్పుడు సైడ్ మిర్రర్లు స్వల్పంగా వణకడం, రివర్స్ కెమెరా స్పష్టత తక్కువగా ఉండటం వంటి చిన్నపాటి సమస్యలు ఉన్నాయి. వీటితో పాటు కాబిన్‌లోని డిస్‌ప్లే ఇంటర్‌‌ఫేస్, స్పీకర్ల క్వాలిటీ ఇంకా మెరుగ్గా ఉంటే బాగుండేది.

మహీంద్రా థార్ ఓజీ రివ్యూ- కొనాలా? వద్దా?

మహీంద్రా థార్ ఓజీ ప్రారంభ ధరను ఎక్స్-షోరూమ్‌లో రూ. 10.32 లక్షలుగా నిర్ణయించారు. ఆల్-వీల్ డ్రైవ్ ఆటోమేటిక్ జెడ్​ఎక్స్​టీ టాప్ వేరియంట్ ధర రూ. 17.75 లక్షల వరకు ఉంటుంది. ఈ ప్రారంభ ధరలు నవంబర్ 30, 2026 వరకు జరిగే డెలివరీలకు మాత్రమే వర్తిస్తాయి.

ఆఫ్‌రోడ్ సాహసాలను ఆస్వాదిస్తూనే, ప్రతిరోజూ ఆఫీస్‌కి లేదా సుదీర్ఘ ప్రయాణాలకు ఒకే కార్ వాడాలనుకునే వారికి మహీంద్రా థార్ ఓజీ ఒక ఉత్తమమైన ఎంపిక అని హెచ్​టీ ఆటో టీమ్ చెబుతోంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More