Mahindra XUV 3XO : ఫ్యామిలీ ఎస్‌యూవీలో సీఎన్జీ వేరియంట్- ధర తక్కువ, మైలేజ్ ఎక్కువ!
Mahindra XUV 3XO CNG : ఫ్యామిలీ ఎస్‌యూవీగా పేరొందిన మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓలో సీఎన్జీ వేరియంట్ రాబోతోంది! ఈ నేపథ్యంలో ఈ మోడల్ లాంచ్ టైమ్‌లైన్, ధర, ఫీచర్లు వంటి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
CNG cars under 10 Lakhs : దేశంలో పెట్రోల్ ధరల భారం పెరుగుతుండటంతో, మధ్యతరగతి వాహనదారులు ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ డిమాండ్‌ను క్యాష్ చేసుకునేందుకు మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థ తన అత్యంత ప్రజాదరణ పొందిన కాంపాక్ట్ ఎస్‌యూవీ 'ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ'లో సీఎన్జీ వేరియంట్‌ను పరిచయం చేసేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే మార్కెట్లో ఉన్న టాటా నెక్సాన్ ఐసీఎన్జీ, మారుతీ సుజుకీ బ్రెజ్జా సీఎన్జీలకు ఇది గట్టి పోటీ ఇవ్వనుంది.

ఈ నేపథ్యంలో ఈ ఫ్యామిలీ ఎస్‌యూవీపై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ సీఎన్జీ- ఇంజిన్ సామర్థ్యం ఎలా ఉంటుంది?
ప్రస్తుతం మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ ఎస్‌యూవీ మూడు రకాల ఇంజిన్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. 1.2 లీటర్ టర్బో పెట్రోల్ (111 హెచ్‌పీ), 1.2 లీటర్ టీజీడీఐ పెట్రోల్ (128 హెచ్‌పీ), 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్లు ఉన్నాయి. రాబోయే సీఎన్జీ కిట్‌ను బేస్ మోడల్ అయిన 1.1 లీటర్ ఎంపీఎఫ్ఐ పెట్రోల్ ఇంజిన్‌తో జత చేయనున్నారు. ఇది టాటా నెక్సాన్ ఐసీఎన్జీ మాదిరిగానే మెరుగైన పనితీరును కనబరుస్తుందని అంచనా. మహీంద్రా ప్యాసింజర్ వాహన విభాగంలో రాబోతున్న తొలి సీఎన్జీ ఎస్‌యూవీ ఇదే కావడం విశేషం.
మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ సీఎన్జీ- లాంచ్ ఎప్పుడు? ధర ఎంత?
మీడియా నివేదికల ప్రకారం.. మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ సీఎన్జీ వేరియంట్ 2026 చివరిలో లేదా 2027 ప్రారంభంలో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. ధర విషయానికి వస్తే, ప్రస్తుతం ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ ఎస్‌యూవీ ఎక్స్-షోరూమ్ ధర రూ. 7.54 లక్షల నుంచి రూ. 14.88 లక్షల మధ్య ఉంది. సీఎన్జీ వర్షెన్ ధర రూ. 9 లక్షల నుంచి రూ. 12 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉండే అవకాశం ఉంది.
మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ సీఎన్జీ- ప్రీమియం ఫీచర్లలో రాజీ లేదు!
సాధారణంగా సీఎన్జీ కార్లు అంటే ఫీచర్లు తక్కువ ఉంటాయనే అపోహ ఉంటుంది. కానీ మహీంద్రా ఈ వెర్షన్‌లోనూ తన టెక్నాలజీని కొనసాగించనుంది.
డిస్‌ప్లే: రెండు 10.25- ఇంచ్ స్క్రీన్‌లు.
సేఫ్టీ: లెవెల్-2 అడాస్ ఫీచర్, 360-డిగ్రీ కెమెరా, 6 ఎయిర్‌బ్యాగ్‌లు.
లగ్జరీ: పనోరమిక్ సన్‌రూఫ్ వంటి ఫీచర్లు సీఎన్జీ మోడల్‌లోనూ లభించే అవకాశం ఉంది.
అయితే, సీఎన్జీ ట్యాంక్ కారణంగా బూట్ స్పేస్ (డిక్కీ స్థలం)లో స్వల్ప మార్పులు ఉండవచ్చు.
మార్కెట్ ప్రభావం..
మహీంద్రా ఈ సెగ్మెంట్లోకి కాస్త ఆలస్యంగా అడుగుపెట్టినప్పటికీ, ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓకి ఉన్న బ్రాండ్ ఇమేజ్ ప్లస్ కానుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో సీఎన్జీ స్టేషన్ల సంఖ్య పెరుగుతుండటంతో, తక్కువ ఖర్చుతో ఎక్కువ మైలేజ్ కోరుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ కానుంది. కఠినతరమైన ఉద్గార నియమాల (బీఎస్6) దృష్ట్యా, గ్రీన్ ఎనర్జీ వైపు మహీంద్రా వేస్తున్న ఈ అడుగు పరిశ్రమలో కీలకంగా మారనుంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


