...
...
Next Story

ఒక్కసారి ట్యాంక్ ఫుల్ చేస్తే 1000 కి.మీ మైలేజ్! మహీంద్రా XUV 7XO Hybrid సంచలనం..

ఒక ట్యాంక్ పెట్రోల్‌తో ఏకంగా 1,000 కిలోమీటర్లకు పైగా ప్రయాణించేలా మహీంద్రా సరికొత్త 'ఎక్స్​యూవీ 7ఎక్స్​ఓ' స్ట్రాంగ్ హైబ్రిడ్ ఎస్‌యూవీని రెడీ చేస్తోంది. దీనితో పాటు ఎలక్ట్రిక్ మోడళ్ల కోసం రేంజ్ ఎక్స్​టెండర్ అనే సాంకేతికతను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఆ వివరాలు..

Published on: Sep 10, 2026, 17:29:43 IST
Advertisement

భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో సరికొత్త ట్రెండ్ సృష్టిస్తున్న ప్రముఖ వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా సరికొత్త వ్యూహంతో ముందడుగు వేస్తోంది. కేవలం పెట్రోల్, డీజిల్ లేదా పూర్తి స్థాయి ఎలక్ట్రిక్ వాహనాలకే పరిమితం కాకుండా, కస్టమర్ల ఇంధన ఆదా అవసరాలకు అనుగుణంగా ‘స్ట్రాంగ్ హైబ్రిడ్’, ‘రేంజ్ ఎక్స్​టెండర్’ సాంకేతికతలను విస్తరిస్తోంది. ఈ ప్రణాళికలో భాగంగా కంపెనీ తన పాపులర్ మోడల్ ‘ఎక్స్​యూవీ 7ఎక్స్​ఓ’లో స్ట్రాంగ్ హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది.

ఒక్కసారి ట్యాంక్ ఫుల్ చేస్తే 1,000 కిలోమీటర్ల మైలేజ్!

మహీంద్రా ఎక్స్​యూవీ 7ఎక్స్​ఓ..
మహీంద్రా ఎక్స్​యూవీ 7ఎక్స్​ఓ..

రాబోతున్న ఎక్స్​యూవీ 7ఎక్స్​ఓ స్ట్రాంగ్ హైబ్రిడ్‌లో ‘సిరీస్-ప్యారలల్’ సిస్టమ్‌ను అమర్చనున్నారు. ఇందులో పెట్రోల్ ఇంజిన్, ఎలక్ట్రిక్ మోటార్, బ్యాటరీ ప్యాక్ మూడూ కలిసి పనిచేస్తాయి. ట్రాఫిక్ ఎక్కువగా ఉండే నగర వీధుల్లో, తక్కువ వేగంతో ప్రయాణించేటప్పుడు ఈ కారు పూర్తిగా విద్యుత్ శక్తితోనే నడుస్తుంది. ఫలితంగా నగరాల్లో ఇంధన వినియోగం గణనీయంగా తగ్గి, వాహనదారులకు భారీగా పెట్రోల్ ఆదా అవుతుంది.

హైవేలపై వేగంగా వెళ్లే సమయంలో పెట్రోల్ ఇంజిన్ నేరుగా చక్రాలను తిప్పడమే కాకుండా, బ్యాటరీని కూడా ఛార్జ్ చేస్తుంది. అలాగే బ్రేక్ వేసినప్పుడు వృథా అయ్యే శక్తిని తిరిగి విద్యుత్తుగా మార్చే 'రీజెనరేటివ్ బ్రేకింగ్' విధానం కూడా ఇందులో ఉంటుంది. ఈ సాంకేతికతల సమ్మేళనం వల్ల ఒక్కసారి ఇంధన ట్యాంక్ ఫుల్ చేస్తే దాదాపు 1,000 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించే వీలుంటుంది!సుదీర్ఘ హైవే ప్రయాణాలు చేసే తెలుగు రాష్ట్రాల వాహనదారులకు చార్జింగ్ స్టేషన్ల వెతుకులాట లేకుండా, తక్కువ ఖర్చుతో ప్రయాణించడానికి ఇది అద్భుతమైన ప్రత్యామ్నాయంగా మారనుంది.

ఛార్జింగ్ టెన్షన్ లేని 'ఎక్స్​ఈవీ 9ఎస్' రేంజ్ ఎక్స్​టెండర్..

ఎక్స్​యూవీ 7ఎక్స్​ఓ హైబ్రిడ్‌తో పాటు 'ఎక్స్​ఈవీ 9ఎస్' ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కోసం మహీంద్రా ‘రేంజ్ ఎక్స్​టెండర్’ టెక్నాలజీని అభివృద్ధి చేస్తోంది. ఇది సాధారణ హైబ్రిడ్ కార్ల విధానానికి భిన్నంగా పనిచేస్తుంది. ఇందులో ఉండే పెట్రోల్ ఇంజిన్ నేరుగా కారు చక్రాలను తిప్పదు. కేవలం బ్యాటరీని ఛార్జ్ చేసే ఒక జెనరేటర్‌గా మాత్రమే వ్యవహరిస్తుంది. చక్రాలు ఎల్లప్పుడూ ఎలక్ట్రిక్ మోటార్ల ద్వారానే శక్తిని పొందుతాయి.

ఇటీవలే మార్కెట్లోకి వచ్చిన 'స్కోర్పియో లైఫ్‌స్టైలర్' పికప్ మోడల్‌ను హైబ్రిడ్ లేదా విద్యుత్ రూపంలో తెచ్చే ఆలోచన ప్రస్తుతానికి లేదని కంపెనీ స్పష్టం చేసింది. దీనిని సాధారణ డీజిల్, టర్బో-పెట్రోల్ ఇంజిన్లకే పరిమితం చేయనున్నారు.

పికప్ ట్రక్కుల కంటే ప్యాసింజర్ ఎస్‌యూవీ విభాగానికే ప్రాధాన్యం ఇస్తున్న మహీంద్రా, ఎక్స్​యూవీ 7ఎక్స్​ఓ, ఎక్స్​ఈవీ 9ఎస్ వంటి సరికొత్త మోడళ్ల ద్వారా భవిష్యత్తు వాహన విపణిలో తన ఆధిపత్యాన్ని మరింత బలపరచుకోవాలని చూస్తోంది.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks