...
...
Next Story

Venezuela Earthquake : విధ్వంసంలో అద్భుతం! 8 రోజుల తర్వాత శిథిలాల నుంచి సజీవంగా బయటపడ్డ వ్యక్తి..

Venezuela Earthquake news : వెనెజువెలాను వణికించిన భారీ జంట భూకంపాల ధాటికి కుప్పకూలిన షాపింగ్ మాల్ శిథిలాల కింద చిక్కుకున్న ఒక వ్యక్తి 8 రోజుల తర్వాత ప్రాణాలతో బయటపడ్డాడు. అంతర్జాతీయ రెస్క్యూ టీమ్స్ శ్రమించి ఈయన్ను కాపాడాయి.

Published on: Jul 3, 2026, 09:08:14 IST
Advertisement

ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు కొన్నిసార్లు ప్రాణాలతో బయటపడటం అనేది కేవలం అద్భుతమనే చెప్పాలి. వెనెెజువెలాలో సరిగ్గా అలాంటి ఘటనే ఒకటి వెలుగుచూసింది. దేశ ఉత్తర తీరప్రాంతాన్ని అతలాకుతలం చేస్తూ దాదాపు వారం రోజుల క్రితం 7.2, 7.5 తీవ్రతతో వరుసగా వచ్చిన జంట భూకంపాల సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. ఈ దారుణ విపత్తులో ఇప్పటివరకు 2,295 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదంలోనూ ఒక ఊరటనిచ్చే వార్త వెలుగులోకి వచ్చింది. లా గ్వైరా రాష్ట్రంలో భూకంపం ధాటికి కుప్పకూలిన ఒక తొమ్మిది అంతస్తుల భారీ షాపింగ్ మాల్ శిథిలాల కింద 8 రోజులుగా చిక్కుకుపోయిన 44 ఏళ్ల వ్యక్తిని రెస్క్యూ బృందాలు ప్రాణాలతో బయటకు తీశాయి.

యోధుడిలా పోరాడి గెలిచాడు!

మాల్​లో చిక్కుకుపోయిన వ్యక్తిని కాపాడిన సిబ్బంది.. (AP Photo/Ariana Cubillos)
మాల్​లో చిక్కుకుపోయిన వ్యక్తిని కాపాడిన సిబ్బంది.. (AP Photo/Ariana Cubillos)

సజీవంగా బయటపడ్డ ఆ వ్యక్తిని హెర్నాన్ ఆల్బెర్టో గిల్‌గా గుర్తించారు. ఆయన అదే గలేరియాస్ ప్లాయా గ్రాండే మాల్‌లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నారు. భూకంపం కారణంగా మాల్ భవనం కుప్పకూలినప్పటి నుంచి ఆయన లోపలే చిక్కుకుపోయారు. సోమవారం నుంచి ఆయనను కాపాడేందుకు అంతర్జాతీయ రెస్క్యూ టీమ్స్ రంగంలోకి దిగాయి. చిలీ, అమెరికా, పోర్చుగల్, మెక్సికో, కోస్టారికా, వెనెెజువెలాకు చెందిన ప్రత్యేక బృందాలు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి.

అత్యంత ప్రమాదకరంగా మారిన శిథిలాల మధ్య రెస్క్యూ సిబ్బంది ఒక పైపు ద్వారా గిల్‌కు నిరంతరం నీరు అందిస్తూ, ఆయన డీహైడ్రేట్ అవ్వకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. భవనం లోపలి భాగాలు ఎప్పుడు కూలిపోతాయో తెలియని స్థితిలో, రెండు ప్రత్యేక టన్నెల్స్ (సొరంగాలు) తవ్వి అత్యంత జాగ్రత్తగా ఆయన్ని గురువారం ఉదయం బయటకు తీసుకువచ్చారు. గిల్‌ను స్ట్రెచర్‌పై అంబులెన్స్ వైపు తీసుకెళుతున్నప్పుడు అక్కడ ఉన్న విలేకరులు, రెస్క్యూ సిబ్బంది చప్పట్లతో అభినందనలు తెలిపారు.

"ఇన్ని రోజులైనా నా భర్తను ప్రాణాలతో ఉంచినందుకు ఆ దేవుడికి కృతజ్ఞతలు. ఆయన ఒక యోధుడిలా పోరాడి ప్రాణాలతో తిరిగి వచ్చారు," అని గిల్ భార్య గుస్బీమార్ గొంజాలెజ్ భావోద్వేగానికి గురయ్యారు.

పెరుగుతున్న మృతుల సంఖ్య.. తీవ్రమవుతున్న సంక్షోభం!

ఈ భూకంపం వల్ల దాదాపు 10 బిలియన్ డాలర్ల ఆర్థిక నష్టం వాటిల్లి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఆన్‌లైన్ మిస్సింగ్ రిజిస్ట్రీ ప్రకారం దాదాపు 38,600 మంది ఇంకా గల్లంతయ్యారు. వివిధ దేశాల నుంచి ఇప్పటివరకు 2,000 మెట్రిక్ టన్నుల సహాయక సామాగ్రి వెనిజులాకు చేరింది.

సైన్యం కంటే మిన్నగా పౌరుల సేవలు!

వెనెెజువెలాలో తాత్కాలిక అధ్యక్షుడు డెల్సీ రోడ్రిగ్జ్ నేతృత్వంలో సైనిక, పోలీసు బలగాలు రంగంలోకి దిగి ట్రాఫిక్, భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో రెస్క్యూ ఆపరేషన్లలో సాధారణ పౌరులు, వాలంటీర్లే కీలక పాత్ర పోషిస్తున్నారు. కూలిపోయిన ఆరు పెద్ద రెసిడెన్షియల్ టవర్ల వద్ద ప్రజలు తమ చేతులతో, పారలతో శిథిలాలను తొలగిస్తూ తమ బంధువుల కోసం గాలిస్తున్నారు. వీరికి ఫైర్ ఫైటర్లు, వైద్య విద్యార్థులు, ఉపాధ్యాయులు, పశువైద్యులు వాలంటీర్లుగా మారి సహాయం అందిస్తున్నారు. అయితే, భారీ కాంక్రీట్ స్లాబులను తొలగించడానికి అవసరమైన భారీ యంత్రాలు లేకపోవడం వల్ల రెస్క్యూ పనులు ఆలస్యమవుతున్నాయని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇంధన సరఫరాపై నిఘా

మరోవైపు రెస్క్యూ ఆపరేషన్లకు ఆటంకం కలగకుండా ఉండేందుకు పరాగ్వానా రిఫైనింగ్ కాంప్లెక్స్ నుంచి లా గ్వైరాకు డీజిల్ ఇంధనాన్ని తరలించినట్లు చమురు శాఖ మంత్రి పౌలా హెనావో ప్రకటించారు. భూకంపం వల్ల ఇంధన టెర్మినల్స్‌కు పెద్దగా నష్టం జరగలేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. అత్యంత తీవ్రంగా దెబ్బతిన్న కాటియా లా మార్ ఇంధన టెర్మినల్‌లో ఏవైనా నిర్మాణాత్మక నష్టాలు జరిగాయా అనే కోణంలో అధికారులు తనిఖీలు చేపట్టారు.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe