భారత స్టాక్ మార్కెట్ చరిత్రలో 2025వ సంవత్సరం ప్రైమరీ మార్కెట్‌కు ఒక స్వర్ణయుగంగా నిలిచింది. సెకండరీ మార్కెట్ ఒడిదుడుకుల్లో ఉన్నప్పటికీ, ఐపీఓ మార్కెట్ మాత్రం సరికొత్త రికార్డులను తిరగరాసింది! ఈ ఏడాది ఏకంగా 100కు పైగా కంపెనీలు పబ్లిక్ ఇష్యూలకు వచ్చి రూ. 1.8 లక్షల కోట్ల నిధులను సమీకరించాయి.
మీషో, టాటా క్యాపిటల్, హెచ్‌డీబీ ఫైనాన్షియల్, ఏథర్ ఎనర్జీ వంటి దిగ్గజ సంస్థలు ఈ ఏడాది ఐపీఓ బరిలో నిలిచాయి. అయితే ఇక్కడే ఒక చేదు నిజం కూడా ఉంది! ఈ ఏడాది వచ్చిన 106 ఐపీఓల్లో సరిగ్గా సగం కంపెనీలు, అంటే 53 ఇష్యూలు ప్రస్తుతం వాటి ఆఫర్ ధర కంటే తక్కువలోనే ట్రేడవుతున్నాయి. అంటే ఐపీఓలో ఇన్వెస్ట్ చేసిన సగం మందికి పైగా మదుపర్లు నష్టాల్లోనే ఉన్నారు.
కాసులు కురిపించిన నాలుగు 'మల్టీబ్యాగర్లు' ఇవే..
ఈ ఏడాది ఇన్వెస్టర్ల సంపదను రెట్టింపు చేసిన ఘనత కేవలం నాలుగు కంపెనీలకే దక్కింది! వాటిలో రెండు 'న్యూ ఏజ్' టెక్ కంపెనీలు కావడం విశేషం.
1. స్టాలియన్ ఇండియా ఫ్లోరోకెమికల్స్: జనవరిలో వచ్చిన ఈ కంపెనీ 2025లో బెస్ట్ పర్ఫార్మర్‌గా నిలిచింది. రూ. 90 ఉన్న షేరు ధర ప్రస్తుతం రూ. 214కు చేరింది. అంటే దాదాపు 138 శాతం లాభాలను అందించింది!
రిఫ్రిజిరెంట్స్, స్పెషాలిటీ గ్యాసెస్ రంగంలో ఈ కంపెనీ పని చేస్తోంది.
2. ఆదిత్య ఇన్ఫోటెక్: జులైలో ఐపీఓకు వచ్చిన ఈ సంస్థ తన బ్రాండ్ 'సీపీ ప్లస్'తో అందరికీ సుపరిచితమే. రూ. 675 ఆఫర్ ధరతో మొదలై, ప్రస్తుతం 125.6 శాతం వృద్ధితో రూ. 1526 వద్ద ట్రేడవుతోంది.
వీడియో సెక్యూరిటీ సొల్యూషన్స్‌లో ఈ కంపెనీ అగ్రగామిగా ఉంది.
{{/usCountry}}వీడియో సెక్యూరిటీ సొల్యూషన్స్‌లో ఈ కంపెనీ అగ్రగామిగా ఉంది.
{{/usCountry}}3. మీషో: ఈ కామర్స్ రంగంలో సంచలనం సృష్టించిన మీషో, ఐపీఓలోనూ అదే జోరు చూపించింది! రూ. 111 ఆఫర్ ధరతో వచ్చిన ఈ షేరు 112 శాతం లాభాలను ఇచ్చింది. కేవలం మూడు రోజుల్లోనే 81 రెట్లు సబ్‌స్క్రయిబ్ అవ్వడం విశేషం. మార్కెట్లో లిస్ట్ అయిన తర్వాత కూడా మీషో షేర్లు భారీ స్థాయిలో దూసుకెళ్లాయి.
ఈ అద్భుతమైన ర్యాలీతో కంపెనీ సీఈఓ విదిత్ ఆత్రే బిలియనీర్ల జాబితాలో చేరారు.
4. ఏథర్ ఎనర్జీ: ఎలక్ట్రిక్ టూవీలర్ దిగ్గజం ఏథర్ ఎనర్జీ ఏప్రిల్‌లో మార్కెట్లోకి వచ్చింది. లిస్టింగ్ రోజున 6 శాతం నష్టపోయినప్పటికీ, ఆ తర్వాత పుంజుకుని ఇప్పుడు ఏకంగా 106.29 శాతం లాభాలను మదుపర్లకు అందించింది.
| కంపెనీ | లిస్టింగ్ డే గెయిన్/ లాస్ | ప్రస్తుత లాభ/నష్టాలు |
|---|---|---|
| స్టాలియన్ ఇండియా ఫ్లోరోకెమికల్స్ | 40.00% | 138.17% |
| ఆదిత్య ఇన్ఫోటెక్ లిమిటెడ్ | 60.39% | 125.59% |
| మీషో లిమిటెడ్ | 53.23% | 112.16% |
| ఏథర్ ఎనర్జీ లిమిటెడ్ | -5.83% | 106.29% |
| సోర్స్- చిత్తోర్గఢ్ |
బెల్‌రైజ్ ఇండస్ట్రీస్, క్వాలిటీ పవర్ వంటి మరికొన్ని కంపెనీలు 47 నుంచి 73 శాతం మధ్య లాభాలను అందించగా.. గ్లోటిస్, బీఎమ్‌డబ్ల్యూ వెంచర్స్ వంటి కంపెనీలు దాదాపు 55 శాతం వరకు పతనమై ఇన్వెస్టర్లను ముంచేశాయి!
ఫలితంగా.. ఈ ఏడాది ఐపీఓ మార్కెట్ చూస్తుంటే, భారీ లాభాలు రావాలంటే కంపెనీ ఎంపికలో ఎంత జాగ్రత్తగా ఉండాలో అర్థమవుతోంది.