ఏథర్ ఎనర్జీ నుంచి కొత్త ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్- లేటెస్ట్ అప్డేట్ ఇది..
ఏథర్ ఎనర్జీ నుంచి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ రాబోతోంది. దీనికి సంబంధించిన డిజైన్ వివరాలు లీక్ అయ్యాయి. గతంలో ప్రదర్శించిన ఈఎల్01 కాన్సెప్ట్ ఆధారంగా ఈ కొత్త 'ఫ్యామిలీ' ఈ-స్కూటర్ని సంస్థ తయారు చేయనున్నట్టు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే..
ఏథర్ ఎనర్జీ నుంచి ఒక కొత్త ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్ రాబోతోంది! ఈ మేరకు ఇండియాలో ఒక ఈ-స్కూటర్ డిజైన్ పేటెంట్‌కి సంస్థ దాఖలు చేసుకుంది. ఇది EL01 కాన్సెప్ట్ ఆధారంగా తయారవుతోంది. ఈ పేటెంట్ ఫైలింగ్, కంపెనీ నెక్ట్స్ జనరేషన్ 'ఫ్యామిలీ స్కూటర్' ఉత్పత్తి రూపంలో ఎలా ఉంటుందనే దానిపై స్పష్టమైన సూచన ఇస్తోంది.

ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్- ఈఎల్01 పేటెంట్ వెల్లడించిన కీలక అంశాలు..
ఈఎల్01 అనే పేరు కొత్తదేమీ కాదు! ఏథర్ ఈ సంవత్సరం ప్రారంభంలో జరిగిన 'ఏథర్ కమ్యూనిటీ డే 2025' కార్యక్రమంలో తమ కొత్త ఈఎల్ ప్లాట్‌ఫారమ్‌ను ఆవిష్కరించేటప్పుడు ఈ ఈఎల్01 కాన్సెప్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ని ప్రదర్శించింది.
అయితే, ఆ సమయంలో ఏ మోడల్‌తో కొత్త ఆర్కిటెక్చర్ ప్రారంభమవుతుందో, లేదా ఎప్పుడు లాంచ్ చేస్తారో కంపెనీ ప్రకటించలేదు. తాజా డిజైన్ పేటెంట్ దాఖలుతో, ఈ ప్రాజెక్ట్ ఉత్పత్తి దశకు ఒక అడుగు దగ్గరైనట్లు తెలుస్తోంది.
కాన్సెప్ట్‌కు ఎంత దగ్గరగా ఉంది?
పేటెంట్ పొందిన డిజైన్, బహిరంగంగా చూపించిన ఈఎల్01 కాన్సెప్ట్‌ను చాలావరకు పోలి ఉంది.
డిజైన్: ఇది స్పోర్టీ మోడల్‌గా కాకుండా, స్పష్టంగా కుటుంబ అవసరాల కోసం ఉద్దేశించినట్లు కనిపిస్తోంది. డిజైన్ చాలా క్లీన్‌గా, ఆచరణాత్మకంగా ఉంది.
ప్రధాన లక్షణాలు: చదునైన, విశాలమైన ఫ్లోర్‌బోర్డ్, పొడవైన సింగిల్ పీస్ సీటు, వెనుక కూర్చున్నవారి సౌలభ్యం కోసం పెద్ద గ్రాబ్ రైల్ ఇందులో ఉన్నాయి.
లైటింగ్: పేటెంట్ చిత్రంలో చూసినట్లుగా, హెడ్‌ల్యాంప్ హ్యాండిల్‌బార్‌పై అమర్చి ఉంది. అయితే ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్ ఫ్రెంట్ ఏప్రాన్‌పై ఉంది. ఎలక్ట్రిక్ స్కూటర్ మొత్తం రూపకల్పన నిటారుగా, సాంప్రదాయ పద్ధతిలో ఉంది.
తేడాలు: డిజైన్ పేటెంట్ వెర్షన్‌లో డ్రమ్ బ్రేక్‌లు ఉపయోగించినట్లు కనిపిస్తోంది. కాన్సెప్ట్ మోడల్‌లో ముందు డిస్క్ బ్రేక్, వెనుక డ్రమ్ సెటప్‌ను చూపించారు. అలాగే, కాన్సెప్ట్‌లో 14-ఇంచ్ చక్రాలను ప్రదర్శించారు. అయితే ఉత్పత్తి మోడల్‌లో కూడా అదే పరిమాణం ఉంటుందా అనేది ఇంకా స్పష్టం కాలేదు.
ఫీచర్లు: ఈఎల్01 కాన్సెప్ట్‌లో డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంది. పేటెంట్లో పరికరాల స్థాయిలు ధృవీకరించనప్పటికీ, ఫైనల్ ప్రాడక్ట్‌లో స్క్రీన్ ఆధారిత డిస్‌ప్లే ఉండే అవకాశం ఉంది.
కొత్త ఈఎల్ ప్లాట్‌ఫారమ్ ఎందుకు ముఖ్యం?
ఈఎల్01 స్కూటర్ ఏథర్‌కి చెందిన కొత్త ఈఎల్ ప్లాట్‌ఫారమ్ ఆధారంగా తయారు కానుంది. 26 లక్షల కిలోమీటర్లకు పైగా వాస్తవ ప్రపంచ రైడింగ్ డేటాను ఉపయోగించి దీనిని అభివృద్ధి చేశారు.
ఈ ప్లాట్‌ఫారమ్‌ని మాడ్యులర్‌గా రూపొందించారు. అంటే దీనిపై వివిధ పరిమాణాలు, రకాలు, అవసరాలకు తగిన స్కూటర్లను రూపొందించవచ్చు.
ఇది యూనిబాడీ స్టీల్ ఛాసిస్‌ను పరిచయం చేసింది. ఇది మన్నికను పెంచడంతో పాటు తయారీ ప్రక్రియను సరళీకృతం చేస్తుంది. ఏథర్ ప్రకారం, ఈ కొత్త నిర్మాణం వల్ల స్కూటర్ అసెంబ్లీ 15 శాతం వేగంగా జరుగుతుంది!
సరళమైన భాగాలు, తక్కువ బ్రేక్ అరుగుదల కారణంగా, నిర్వహణ ఖర్చులు తగ్గుతాయని కంపెనీ పేర్కొంది. సర్వీసింగ్ విరామాలు కూడా 10,000 కి.మీ వరకు పెంచవచ్చు.
ఏథర్ ఎనర్జీ సంస్థకు ఏథర్ రిజ్టా రూపంలో ఇప్పటికే ఒక బెస్ట్ సెల్లింగ్ ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్ ఉంది. ఇక ఈ ఈఎల్01 లాంచ్ అయితే, మార్కెట్లో వాటా మరింత పెంచుకోవచ్చని సంస్థ అభిప్రాయపడుతోంది.














