క్రేజీ డిజైన్- రేంజ్లో తోపు! 2026లో లాంచ్ అయ్యే టాప్ 5 ఎలక్ట్రిక్ కార్లు..
2025లో అనేక ఈవీ మోడల్స్ ఇండియాలో లాంచ్ అయ్యాయి. ఈ నేపథ్యంలో 2026 కూడా చాలా ఆసక్తికరంగా ఉండబోతోంది! దిగ్గజ ఆటోమొబైల్ సంస్థలు 2026లో తమ కొత్త ఈవీలను లాంచ్ చేసేందుకు ప్లాన్స్ చేస్తున్నాయి. వాటిల్లోని టాప్ 5 అట్రాక్టివ్, మచ్ అవైటెడ్ మోడల్స్‌ని ఇక్కడ తెలుసుకోండి..
భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు ఏడాదికేడాది స్థిరంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే టాటా వంటి బ్రాండ్‌లు అనేక ఈవీ మోడళ్లను అందిస్తూ విస్తరణ ప్రణాళికలతో దూసుకుపోతుండగా, మారుతీ వంటి సంస్థలు ఈ సెగ్మెంట్‌లోకి ప్రవేశించడానికి సిద్ధమవుతున్నాయి. గ్లోబల్‌గా ఎస్‌యూవీలకు పెరుగుతున్న డిమాండ్‌తో పాటు, దేశంలో ఎలక్ట్రిఫికేషన్‌పై పెరుగుతున్న ఆసక్తికి అనుగుణంగా తయారీదారులు తమ వ్యూహాలను మార్చుకుంటున్నారు.

రాబోయే సంవత్సరాల్లో అనేక కొత్త ఎలక్ట్రిక్ మోడళ్లను ప్రవేశపెట్టేందుకు కంపెనీలు సన్నాహాలు చేస్తున్నాయి. ఫలితంగా 2026లో పలు క్రేజీ మోడల్స్ లాంచ్‌కు రెడీ అవుతున్నాయి. వాటిల్లో టాప్ 5 బెస్ట్, మచ్ అవైటెడ్ ఈవీల వివరాలను ఇక్కడ చూసేయండి..
2026లో లాంచ్ అవుతున్న టాప్ 5 ఎలక్ట్రిక్ కార్లు..
1. టాటా సియెర్రా ఈవీ-
ఐకానిక్ టాటా సియెర్రా ఐసీఈ ఇంజిన్ ఇటీవలే ఇండియాలో లాంచ్ అయ్యింది. దీని ఎలక్ట్రిక్ వెర్షన్ 2026 మార్చి నాటికి మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.
పవర్‌ట్రైన్: ఆల్-ఎలక్ట్రిక్ సియెర్రా సింగిల్-మోటార్ రేర్-వీల్ డ్రైవ్, డ్యూయల్-మోటార్ ఆల్-వీల్ డ్రైవ్ కాన్ఫిగరేషన్‌లలో లభించే అవకాశం ఉంది. ఇది ఆఫ్-రోడ్ సామర్థ్యాన్ని మరింత పెంచుతుంది!
ప్రత్యేకతలు: కొత్తగా పరిచయం చేసిన ఐసీఈ సియెర్రా డిజైన్‌ను పోలి ఉండే ఈ ఈవీలో ఫ్రంక్ (ముందు భాగంలో స్టోరేజ్ స్పేస్), వన్-పెడల్ డ్రైవింగ్, వెహికల్-టు-లోడ్ బై-డైరెక్షనల్ ఛార్జింగ్ వంటి అధునాతన ఫీచర్లు ఉంటాయని అంచనాలు ఉన్నాయి.
2. కియా సైరోస్ ఈవీ-
కియా సైరోస్ ఈవీ కూడా 2026 మార్చి నాటికి భారత్‌లో అరంగేట్రం చేయవచ్చని అంచనాలు ఉన్నాయి. ఈ మధ్యే తొలిసారిగా ఇది టెస్టింగ్ సమయంలో కెమెరా కంట పడింది.
డిజైన్: స్పై షాట్‌ల ప్రకారం.. ఎలక్ట్రిక్ సైరోస్ డిజైన్ దాదాపుగా ఐసీఈ వెర్షన్‌ను పోలి ఉంటుంది. అయితే, ముందు కుడి ఫెండర్‌పై ఛార్జింగ్ పోర్ట్ వంటి ఈవీ-స్పెసిఫిక్ టచ్‌లు ఇందులో ఉంటాయి.
ముఖ్య విషయం: టెస్ట్ మోడల్‌లో కియా పర్ఫార్మెన్స్ మోడళ్లకు కేటాయించే ఆకుపచ్చ బ్రేక్ కాలిపర్స్ కనిపించడం విశేషం. క్యాబిన్, ఫీచర్లు ఐసీఈ సైరోస్తో సమానంగా ఉండే అవకాశం ఉంది.
ప్లాట్‌ఫామ్: టాటా నెక్సాన్ ఈవీకి పోటీగా రానున్న ఈ కారు హ్యుందాయ్ కే1 ప్లాట్‌ఫామ్‌పై తయారువుతుందని సమాచారం.
3. హ్యుందాయ్ ఇన్‌స్టర్ ఈవీ-
టాటా పంచ్ ఈవీకి పోటీగా హ్యుందాయ్ సంస్థ 2026 చివరి నాటికి భారత మార్కెట్‌లోకి ఒక ఎలక్ట్రిక్ కారును తీసుకురావాలని యోచిస్తోంది. దాని పేరు హ్యుందాయ్ ఇన్‌స్టర్ ఈవీ.
ఉత్పత్తి: HE1i అనే కోడ్‌నేమ్‌తో పిలుస్తున్న ఈ కాంపాక్ట్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ చెన్నైలోని శ్రీపెరంబుదూర్ ప్లాంట్‌లో తయారవుతుంది. దీనికి దేశీయంగా సేకరించిన ఎక్సైడ్ బ్యాటరీలను వాడతారు.
బ్యాటరీ/రేంజ్: గ్లోబల్ ఇన్‌స్టర్ ఈవీ ఆధారంగా, ఇది 42కేడబ్ల్యూహెచ్, 49కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఆప్షన్‌లలో వస్తుంది. ఈ బ్యాటరీలు 97హెచ్‌పీ లేదా 115హెచ్‌పీ మోటార్‌లతో కనెక్ట్ చేసి ఉంటుంది. డబ్ల్యూఎల్టీపీ ప్రకారం, ఇవి వరుసగా 300 కి.మీ, 355 కి.మీ రేంజ్‌ను అందిస్తాయి.
ఫీచర్లు: ఇందులో డ్యూయల్ 10.25-ఇంచ్ డిస్‌ప్లేలు, లెవల్ 2 అడాస్ (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్), ఆటో క్లైమేట్ కంట్రోల్, బ్లైండ్-స్పాట్ మానిటరింగ్‌తో కూడిన 360-డిగ్రీ కెమెరా వంటి ఫీచర్లు ఉంటాయని భావిస్తున్నారు.
4. మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ ఈవీ-
మహీంద్రా సంస్థ ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓకి చెందిన పూర్తి ఎలక్ట్రిక్ వెర్షన్‌పై పనిచేస్తోంది. ఇది టాటా నెక్సాన్ ఈవీకి పోటీ ఇవ్వనుంది.
స్థానం: ఇది ఎక్స్‌యూవీ400 కంటే చిన్నదిగా, తక్కువ ధరలో ఉండే అవకాశం ఉంది.
బ్యాటరీ/రేంజ్: రాబోయే ఈ ఈవీలో 35 కేడబ్ల్యూహెచ్ ఎన్ఎంసీ బ్యాటరీ ప్యాక్ ఉండవచ్చని, ఇది సుమారు 400 కి.మీ రేంజ్‌ను అందించగలదని అంచనా.
లాంచ్: మహీంద్రా తన ఈ కొత్త ఎంట్రీ-లెవల్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని 2026 మొదటి అర్ధభాగంలో విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
5. మారుతీ సుజుకీ ఈ-విటారా
మారుతీ నుంచి అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ విటారా వచ్చే ఏడాది ప్రారంభంలో, అంటే జనవరి 2026లో లాంచ్కానుంది. ఇది మారుతీకి చెందిన మొదటి ఈవీ అవుతుంది.
బ్యాటరీ/రేంజ్: ఈ ఎస్‌యూవీ రెండు లిథియం ఐరన్ ఫాస్ఫేట్ బ్యాటరీ ఆప్షన్‌లలో లభిస్తుంది:
49 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ (సింగిల్-మోటార్ సెటప్) - 346 కి.మీ రేంజ్.
61 కేడబ్ల్యూహెచ్ పెద్ద బ్యాటరీ (ఫ్రంట్-వీల్ డ్రైవ్ లేదా ఆల్-వీల్ డ్రైవ్) - 428 కి.మీ రేంజ్.














