...
...
Next Story

టీ20 ప్రపంచకప్​ జట్టులో చోటు ఉండదని గిల్​కి చెప్పలేదు! అసలేం జరిగింది?

యంగ్​ ఓపెనర్​ శుభ్‌మన్ గిల్‌కి ‘షాక్’! టీ20 వరల్డ్ కప్ జట్టు నుంచి తొలగిస్తున్నట్టు బీసీసీఐ లేదా గంభీర్​, సూర్యకుమార్​ యాదవ్​ సైతం గిల్​కి చెప్పలేదని తెలుస్తోంది. ఇది ఇప్పుడు హాట్​ టాపిక్​గా మారింది.

Published on: Dec 21, 2025, 06:17:46 IST
Advertisement

ఫిబ్రవరిలో జరగనున్న టీ20 ప్రపంచకప్​ కోసం భారత జట్టును శనివారం ప్రకటించారు. స్క్వాడ్​లో యంగ్​ స్టార్​ ఓపెనర్​ శుభ్​మన్​ గిల్​ లేకపోవడం ఇప్పుడు హాట్​ టాపిక్​గా మారింది. బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా శనివారం టీ20 ప్రపంచకప్ జట్టును ప్రకటించినప్పుడు కాదు, బుధవారం పొగమంచు కారణంగా నాలుగో టీ20 మ్యాచ్ రద్దయినప్పుడే గిల్ భవితవ్యం ఖరారైపోయిందని క్రికెట్​ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే, జట్టు నుంచి తప్పిస్తున్నారనే విషయాన్ని సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గానీ, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ గానీ, కోచ్ గౌతమ్ గంభీర్ గానీ గిల్‌కు ముందు చెప్పలేదని నివేదికలు వెలువడుతున్నాయి. ఈ విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

అవమానకర రీతిలో వేటు?

శుభ్​మన్​ గిల్​..
శుభ్​మన్​ గిల్​..

గత ఏడాది కాలంగా గిల్ ఆటతీరు అంతంతమాత్రంగానే ఉన్నా, జట్టులో కీలక ఆటగాడిగా ఉన్న అతడిని తప్పించిన తీరు మాత్రం చర్చకు దారితీస్తోంది. ఫామ్‌లో లేకపోయినా జట్టు యాజమాన్యం గిల్‌కు మరిన్ని అవకాశాలు ఇస్తుందని అందరూ భావించారు. కానీ, ఒక క్రమపద్ధతిలో అతడిని జట్టుకు దూరం చేయడం గిల్‌ను కాస్త నిరాశకు, అవమానానికి గురిచేసి ఉండవచ్చని క్రికెట్​ వర్గాలు అంటున్నాయి.

గాయం పేరుతో 'ఎగ్జిట్ రూట్'?

బ్యాటింగ్ చేస్తున్నప్పుడు గిల్ వేలికి గాయమైందనే వార్త బయటకు రాగానే, యాజమాన్యం అతడిపై నమ్మకం కోల్పోయిందని స్పష్టమైంది. దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు మ్యాచ్‌ల్లో గిల్ కేవలం 32 పరుగులు మాత్రమే చేశాడు. అహ్మదాబాద్‌లో జరిగే మ్యాచ్‌లో పెయిన్ కిల్లర్స్ వేసుకుని అయినా ఆడతానని గిల్ కోరినప్పటికీ, మేనేజ్మెంట్ మాత్రం అతడిని పక్కన పెట్టడానికే మొగ్గు చూపింది.

మొదట గిల్‌కు ఫ్రాక్చర్ అయిందని భావించినా, స్కానింగ్‌లో అది కేవలం చిన్న గాయమేనని తేలింది. అయినప్పటికీ, వైస్ కెప్టెన్ హోదాలో ఉన్న గిల్‌ను టీ20 ప్రపంచకప్​ జట్టు నుంచి తప్పించడానికి ఈ గాయాన్ని ఒక సాకుగా వాడుకున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

అగార్కర్ ఏమన్నారంటే?

"గిల్ అద్భుతమైన ఆటగాడు అనడంలో సందేహం లేదు. కానీ ప్రస్తుతం అతను ఆశించిన స్థాయిలో పరుగులు చేయలేకపోతున్నాడు. గత వరల్డ్ కప్‌లో కూడా జట్టు కాంబినేషన్ కారణంగా అతను చోటు కోల్పోయాడు. ఈసారి కూడా జట్టులో ఇద్దరు కీపర్లను తీసుకోవాలని భావించాం. 15 మంది సభ్యుల జట్టును ఎంపిక చేసేటప్పుడు ఎవరో ఒకరు త్యాగం చేయక తప్పదు. ఈసారి దురదృష్టవశాత్తు అది గిల్ అయ్యాడు," అని అగార్కర్ వివరించారు.

జట్టు కాంబినేషన్ పేరుతో గిల్‌ను పక్కన పెట్టడం టీమ్ ఇండియా భవిష్యత్తు ప్రణాళికల్లో భాగంగా చూస్తారా లేక ఇది తాత్కాలిక నిర్ణయమేనా అనేది వేచి చూడాలి.

‘దిష్టి తీయించుకో’

టీ20 ప్రపంచకప్​ కోసం ప్రకటించిన టీమిండియా జట్టులో గిల్​కి చోటు దక్కకపోవడం ఆశ్చర్యానికి గురిచేసినట్టు క్రికెట్​ దిగ్గజం సునీల్​ గవాస్కర్​ చెప్పారు. ఈ నేపథ్యంలో గిల్​తో తన సంభాషణ గురించి వివరించారు.

“అహ్మదాబాద్​ నుంచి నేను, గిల్​, సూర్యకుమార్​ యాదవ్​ కలిసి ప్రయాణించాము. గిల్​కి గాయాలు ఎక్కువ అవుతున్నట్టు అనిపించింది. చెడు కళ్లు మీద పడకుండా దిష్టి తీయించుకోమని నేను గిల్​కి సలహా ఇచ్చాను. ఇలాంటివి మనం అందరం నమ్ముతాము. అప్పుడప్పుడు చెడు కళ్లు మన మీద పడతాయని అనుకుంటాము,” అని గవాస్కర్​ అన్నారు.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks