...
...
Next Story

MG Hector Hawk : ఎంజీ కొత్త, పవర్​ఫుల్​ ఎస్​యూవీ- టాటా సఫారీకి పోటీగా హెక్టర్ హాక్!

భారతీయ ఎస్‌యూవీ మార్కెట్లోకి ఎంజీ మోటార్ ఆగస్టు నెలలో 'హెక్టార్ హాక్' పేరుతో సరికొత్త ఎస్‌యూవీని తీసుకురానుంది. ఎలక్ట్రిక్, ప్లగ్-ఇన్ హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్లలో లభించే ఈ కారు ఫుల్ ఛార్జ్‌పై 530 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని అంచనా.

Published on: Aug 1, 2026, 16:22:51 IST
Advertisement

భారత మార్కెట్లో ఎస్‌యూవీ ప్రియుల కోసం ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ ఎంజీ మోటార్ సరికొత్త మోడల్‌ను సిద్ధం చేస్తోంది. త్వరలోనే ‘హెక్టార్ హాక్’ పేరుతో ఒక పవర్‌ఫుల్ ఎస్‌యూవీని భారత మార్కెట్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ , ప్లగ్-ఇన్ హైబ్రిడ్ అనే రెండు పర్యావరణ హిత పవర్‌ట్రెయిన్ ఎంపికలతో వస్తుండటం ఈ కారు ప్రత్యేకత. తమ సెగ్మెంట్‌లో ఈ రెండు ఆప్షన్లతో వస్తున్న అత్యంత అరుదైన మోడళ్లలో ఇది ఒకటిగా నిలవనుంది.

ఎంజీ హెక్టర్ హాక్​గా వస్తున్న వూలింగ్ స్టార్‌లైట్ 560 ఇదిగో..
ఎంజీ హెక్టర్ హాక్​గా వస్తున్న వూలింగ్ స్టార్‌లైట్ 560 ఇదిగో..

గ్లోబల్ మార్కెట్లో మంచి గుర్తింపు పొందిన ‘వూలింగ్ స్టార్‌లైట్ 560’ మోడల్ ఆధారంగా దీనిని రూపుదిద్దింది. ఇప్పటికే పలుమార్లు భారత రోడ్లపై టెస్టింగ్ జరుపుకుంటూ ఈ కారు కెమెరాలకు చిక్కింది. ఎంజీ సంస్థ సరికొత్తగా అభివృద్ధి చేసిన 'అడాప్ట్' ప్లాట్‌ఫామ్‌పై నిర్మిస్తున్న ఈ మోడల్.. భవిష్యత్తులో కంపెనీకి ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీగా మారే అవకాశముంది.

ప్రీమియం ఎస్‌యూవీ సెగ్మెంట్‌లోకి ఎంట్రీ..

మూడు వరుసల సీటింగ్ కెపాసిటీతో ప్రీమియం ఎస్‌యూవీ విభాగంలోకి హెక్టార్ హాక్ ఎంట్రీ ఇవ్వనుంది. ఇది మార్కెట్లో ఇప్పటికే అత్యంత ప్రజాదరణ పొందిన టాటా సఫారీ , మహీంద్రా ఎక్స్​యూవీ 7ఎక్స్​ఓ వంటి బలమైన మోడళ్లతో పోటీ పడనుంది. ఎంజీ పోర్ట్‌ఫోలియోలో చూస్తే.. ప్లగ్-ఇన్ హైబ్రిడ్ వెర్షన్ ప్రస్తుతం ఉన్న హెక్టార్ కారు కంటే పైన, ఆల్-ఎలక్ట్రిక్ వెర్షన్ కంపెనీలోనే అత్యుత్తమ ఫ్లాగ్‌షిప్ ఈవీ ఎస్‌యూవీగా నిలవనున్నాయి.

కొత్తదనం ఉట్టిపడే డిజైన్..

టెస్టింగ్ సమయంలో ఈ కారును పూర్తిగా కవర్ చేసినప్పటికీ, కొన్ని ప్రధాన డిజైన్ అంశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముందుభాగంలో ప్రత్యేకమైన డేటైమ్ రన్నింగ్ లైట్లతో కూడిన ఎల్‌ఈడీ హెడ్‌లాంప్స్ ఆకట్టుకుంటున్నాయి. ఎలక్ట్రిక్ వెర్షన్‌లో క్లోజ్డ్ గ్రిల్ అందించే అవకాశం ఉండగా.. సైడ్ ప్రొఫైల్ నీట్‌గా, ఆకర్షణీయమైన అల్లాయ్ వీల్స్‌తో ఉంది. ఎడమవైపు వెనుక భాగంలో ఛార్జింగ్ పోర్ట్ అమర్చారు. వెనుక భాగంలో ఎల్‌ఈడీ టెయిల్ లాంప్స్, రూఫ్ స్పాయిలర్, రియర్ వైపర్‌లు ఉన్నాయి.

ఆధునిక ఫీచర్లతో విశాలమైన క్యాబిన్..

వీటితో పాటు పనోరమిక్ సన్‌రూఫ్, పవర్డ్- వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, 50డబ్ల్యూ వైర్‌లెస్ ఛార్జర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, రియర్ ఏసీ వెంట్స్, 6-స్పీకర్ల సౌండ్ సిస్టమ్‌ను ఇందులో చేర్చే అవకాశముంది. భద్రత పరంగా 6 ఎయిర్‌బ్యాగ్‌లు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (టీపీఎంఎస్), ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, హిల్-హోల్డ్ అసిస్ట్, రియర్ పార్కింగ్ కెమెరా, లేటెస్ట్ అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (అడాస్) ఫీచర్లను కూడా అందించనున్నారు.

రెండు పవర్‌ట్రెయిన్ ఆప్షన్లు..

ఈ కారును ఎంజీ మోటార్ ఈవీ, ప్లగ్-ఇన్ హైబ్రిడ్ రూపాల్లో మార్కెట్లోకి తెస్తోంది.

ప్లగ్-ఇన్ హైబ్రిడ్ వెర్షన్: 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌కు 20.5 kWh బ్యాటరీ ప్యాక్‌ను అనుసంధానిస్తారు. ఇది 195 హెచ్​పీ పవర్, 230 ఎన్​ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కేవలం ఎలక్ట్రిక్ మోడ్‌లోనే ఇది గరిష్టంగా 125 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు.

ఎలక్ట్రిక్ వెర్షన్: 69.2 kWh సామర్థ్యం గల బ్యాటరీ ప్యాక్, 201 హెచ్​పీ ఎలక్ట్రిక్ మోటార్‌తో రానుంది. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే గరిష్టంగా 530 కిలోమీటర్ల పరిధి (రేంజ్) ఇస్తుందని కంపెనీ పేర్కొంటోంది.

ఆగస్టులోనే మార్కెట్లోకి రాక!

ఈ ఆగస్టు నెలలోనే ఎంజీ హెక్టార్ హాక్ భారత మార్కెట్లో లాంచ్ కానుంది. విశాలమైన క్యాబిన్, అత్యాధునిక ఫీచర్లు, రెండు రకాల పవర్‌ట్రెయిన్ ఆప్షన్లతో ఈ ఎస్​యూవీ మార్కెట్​లో సంచలనం సృష్టించనుంది!

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe