...
...
Next Story

MG Hector Tomahawk EV : 517 కి.మీ రేంజ్​ ఎంజీ హెక్టార్ టోమాహాక్ ఈవీ కొనాలా? వద్దా? ఫస్ట్​ డ్రైవ్​ రివ్యూ..

ఎంజీ హెక్టార్ టోమాహాక్ ఈవీ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఇది మీకోసమే! హెచ్​టీ ఆటో నిర్వహించిన ఈ బడా, ఫ్యామిలీ ఎలక్ట్రిక్ ఎస్​యూవీ టెస్ట్​ డ్రైవ్​ రివ్యూను ఇక్కడ డీటైల్డ్​గా తెలుసుకోండి..

Published on: Sep 20, 2026, 06:45:53 IST
Advertisement

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో ఎలక్ట్రిక్ ఎస్‌యూవీల హవా రోజురోజుకూ పెరుగుతోంది. పెద్ద సైజు, ఎక్కువ వేగం, సరికొత్త సాంకేతికతతో అనేక కార్లు వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. ఈ పోటీ వాతావరణంలో ఎంజీ సంస్థ తన పవర్‌ఫుల్ మోడల్ ‘హెక్టార్ టోమాహాక్ ఈవీ’ని రూ. 19 లక్షల ప్రారంభ ధరతో ఇటీవలే మార్కెట్లోకి తీసుకొచ్చింది.

ఎంజీ హెక్టార్ టోమాహాక్ ఈవీ..
ఎంజీ హెక్టార్ టోమాహాక్ ఈవీ..

అయితే కేవలం మైలేజ్, స్క్రీన్‌ల సంఖ్య మాత్రమే కాకుండా.. రోజువారీ ప్రయాణాలకు, కుటుంబంతో వెళ్లే సుదీర్ఘ పర్యటనలకు ఈ పెద్ద ఎస్‌యూవీ ఎంతవరకు సౌకర్యవంతంగా ఉంటుంది? మన రహదారులపై లగ్జరీ కంఫర్ట్ అందిస్తుందా లేదా? కొచ్చి వేదికగా మా హెచ్​టీ ఆటో టీమ్ నిర్వహించిన ఎంజీ హెక్టార్ టోమాహాక్ ఈవీ టెస్ట్​ డ్రైవ్​ రివ్యూని ఇక్కడ డీటైల్డ్​గా తెలుసుకోండి..

ఎంజీ హెక్టార్ టోమాహాక్ ఈవీ రివ్యూ- డిజైన్, లుక్..

పేరులో 'టోమాహాక్' అని ఉన్నా, ఎంజీ హెక్టార్ టోమాహాక్ ఈవీ డిజైన్ చూస్తే చాలా క్లాసీగా, పద్ధతిగా ఉంటుంది. 4,700 ఎంఎం పొడవు ఉన్న ఈ ఎస్‌యూవీ రోడ్డుపై చాలా భారీగా, బలమైన రూపంతో కనిపిస్తుంది. అతిగా మెరిసిపోయే హంగులు లేకుండా సరైన నిష్పత్తిలో డిజైన్ చేశారు.

ఈవీ మోడల్ అయినప్పటికీ ఏదో స్పేస్‌షిప్‌లా మార్చేయకుండా.. సాంప్రదాయ ఎస్‌యూవీ శైలిలోనే స్లీక్ హెడ్‌లాంప్‌లు, క్లీన్ ఫ్రంట్ ప్రొఫైల్ అందించారు. కారు చుట్టూ ఉన్న క్లాడింగ్ రగ్గడ్ లుక్‌ను ఇస్తుంది. పార్కింగ్ స్థలంలో ఉంచినా అందరి దృష్టిని ఆకర్షించేంత రోడ్ ప్రెజెన్స్ దీని సొంతం.

ఎంజీ హెక్టార్ టోమాహాక్ ఈవీ రివ్యూ- ఇంటీరియర్..

ఫీచర్ల విషయంలో ఎంజీ ఏమాత్రం తగ్గలేదు. ఈ ఎలక్ట్రిక్ ఎస్​యూవీలో 8.8-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ లభిస్తుంది. టాప్ మోడల్ 'ఎసెన్స్' వేరియంట్‌లో ఏకంగా 15.6-అంగుళాల భారీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను అందించారు. ఇందులో వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే సపోర్ట్ ఉన్నాయి.

  • 10-స్పీకర్ల ఇన్ఫినిటీ సౌండ్ సిస్టమ్
  • యాంబియంట్ లైటింగ్
  • ఏఐ పవర్డ్ వాయిస్ అసిస్టెంట్
  • కారోకే ఫంక్షన్
  • PM2.5 క్యాబిన్ ఎయిర్ ఫిల్టర్

ప్రయాణికులకు కావలసిన వినోదాన్ని, సౌకర్యాన్ని అందించే అనేక ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

ఎంజీ హెక్టార్ టోమాహాక్ ఈవీ రివ్యూ- లగేజ్ స్పేస్, కంఫర్ట్..

కుటుంబ సమేతంగా ప్రయాణాలు చేసే వారికి ఈ ఎంజీ హెక్టార్ టోమాహాక్ ఈవీ ఎంతో అనుకూలంగా ఉంటుంది. డోర్ పాకెట్లలో పెద్ద బాటిళ్లు పెట్టుకోవచ్చు. స్మార్ట్‌ఫోన్ కోసం ప్రత్యేక స్లాట్, వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్, కీస్, వ్యాలెట్ ఉంచేందుకు సెంటర్ కన్సోల్‌లో తగినంత స్థలం ఇచ్చారు.

రెండో వరుస సీట్లలో మోకాళ్లకు, తలకు పుష్కలంగా స్థలం ఉంది. పనోరోమిక్ సన్‌రూఫ్ ఉన్నప్పటికీ పైన ఏమాత్రం ఇబ్బంది అనిపించదు. వెనుక సీట్లో ముగ్గురు పెద్దవాళ్లు హాయిగా కూర్చోవచ్చు. సెంటర్ టన్నెల్ ఎత్తుగా లేకపోవడం వల్ల మధ్యలో కూర్చునే వారికి కాళ్ల వద్ద ఇబ్బంది ఉండదు. వెనుక ప్రయాణికులకు ఏసీ వెంట్లు, టైప్-ఏ, టైప్-సీ ఛార్జింగ్ పోర్టులు, సన్‌బ్లైండ్‌లు ఇచ్చారు. డిక్కీ సామర్థ్యం 610 లీటర్లు ఉండటం వల్ల పెద్ద సూట్‌కేసులను సులభంగా సర్దుకోవచ్చు. వెనుక సీట్లను మడతబెడితే లగేజ్ స్పేస్ 1,000 లీటర్ల కంటే ఎక్కువ పెరుగుతుంది.

ఎంజీ హెక్టార్ టోమాహాక్ ఈవీ రివ్యూ- పర్ఫార్మెన్స్..

ఈ ఎస్‌యూవీలో 200 బీహెచ్​పీ పవర్, 310 ఎన్​ఎం టార్క్ ఉత్పత్తు చేసే ఏకైక ఎలక్ట్రిక్ మోటార్‌ను అమర్చారు. ఇందులో ఈకో, నార్మల్, స్పోర్ట్, కస్టమ్ అనే నాలుగు డ్రైవింగ్ మోడ్‌లు ఉన్నాయి. సిటీ ట్రాఫిక్‌లో కారును నడపడం చాలా తేలికగా ఉంటుంది. యాక్సిలరేటర్ తొక్కగానే కారు చాలా స్మూత్‌గా ముందుకు సాగుతుంది. ఓవర్‌టేక్ చేయడం ఎంతో సులువు.

ఈ ఎంజీ హెక్టార్ టోమాహాక్ ఈవీలో రీజనరేటివ్ బ్రేకింగ్‌కు 4 లెవల్స్ ఇచ్చారు. కారు వేగం తగ్గుతుంది కానీ పూర్తిగా ఆగిపోవడానికి బ్రేక్ పెడల్‌ను ఉపయోగించాల్సిందే.

ఎంజీ హెక్టార్ టోమాహాక్ ఈవీ రివ్యూ- బ్యాటరీ, రేంజ్..

ఈ ఎలక్ట్రిక్ కారులో 69.2 kWh బ్యాటరీ ప్యాక్ ఉంది. ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 517 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. టెస్ట్ డ్రైవ్ సమయంలో 99 శాతం ఛార్జింగ్‌తో 486 కిమీ రేంజ్ చూపించగా, 120 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత బ్యాటరీ 74 శాతానికి, రేంజ్ 362 కిలోమీటర్లకు చేరింది.

రోడ్డు పరిస్థితులు, ప్రయాణించే వేగం, ఏసీ వాడకంపై నిజమైన రేంజ్ ఆధారపడి ఉంటుంది.

గుంతల రోడ్లు, అతుకుల రహదారులపై కూడా ఈ కారు ప్రయాణం ఎంతో సుఖవంతంగా ఉంటుంది. సస్పెన్షన్ వ్యవస్థ దెబ్బలను తట్టుకుని క్యాబిన్‌లోకి జెర్క్‌లు రాకుండా చూస్తుంది. అయితే కార్నరింగ్ సమయంలో బాడీ రోల్ కాస్త అనిపిస్తుంది. కనుక దీనిని రేసింగ్ కంటే కుటుంబంతో సుదీర్ఘ ప్రయాణాలకు ఉపయోగిస్తే అద్భుతమైన అనుభవాన్ని ఇస్తుంది.

ఎంజీ హెక్టార్ టోమాహాక్ ఈవీ రివ్యూ.. కొనాలా? వద్దా?

ఎంజీ హెక్టార్ టోమాహాక్ ఈవీ ప్రయాణ సౌకర్యానికి, విశాలమైన స్థలానికి పెద్దపీట వేసింది. బేస్ 7-సీటర్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 19.50 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఎంజీ అందించే 'బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్' (బీఏఏఎస్) ప్రోగ్రామ్ ఎంచుకుంటే టాప్ మోడల్ 'ఎసెన్స్' 5-సీటర్ ప్రారంభ ధరను రూ. 14 లక్షలకే సొంతం చేసుకోవచ్చు. రోజువారీ ప్రయాణాలతో పాటు కుటుంబంతో వీకెండ్ ట్రిప్పులు వేసే వారికి ఇది సరైన ఎంపికగా నిలుస్తుందని హెచ్​టీ ఆటో టీమ్ రివ్యూ ఇచ్చింది.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks